ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గద్దర్‌పై మహా పరిశోధన

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:22 AM

సాధారణ పరిశీలకుల దృష్టిలో గద్దర్‌ ఒక పాట కవి, ఒక విప్లవ కవి. బహుజన ఉద్యమ కాలానికి మొదట పరోక్షంగా, తర్వాత ప్రత్యక్షంగా మద్దతిచ్చిన పోరాటశీలి. ఇంకా కొంచెం విస్తృతంగా పరిశీలన చేసిన వారి దృష్టిలో గద్దర్‌ 1980ల నుండి తెలుగు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన సాంస్కృతిక విప్లవ సైనికుడు.

సాధారణ పరిశీలకుల దృష్టిలో గద్దర్‌ ఒక పాట కవి, ఒక విప్లవ కవి. బహుజన ఉద్యమ కాలానికి మొదట పరోక్షంగా, తర్వాత ప్రత్యక్షంగా మద్దతిచ్చిన పోరాటశీలి. ఇంకా కొంచెం విస్తృతంగా పరిశీలన చేసిన వారి దృష్టిలో గద్దర్‌ 1980ల నుండి తెలుగు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన సాంస్కృతిక విప్లవ సైనికుడు. నిజానికి కాలం సృష్టించిన ఒక సాంస్కృతిక యోధుడు గద్దర్‌. అతడు తెలుగు రాష్ట్రాలను దాటి భారతదేశం అంతటా తన ప్రభావాన్ని చాటిన ఆచరణాత్మకమైన విప్లవకారుడు. గద్దర్‌ గురించి మాట్లాడడం అంటే గడిచిన 50 సంవత్సరాల చరిత్రను చర్చించడమే అవుతుంది.


ఈ 50 సంవత్సరాల చరిత్రను మాట్లాడడమంటే అంతకు ముందటి నూరేళ్ల చరిత్ర ప్రభావాలను చర్చించడమే అవుతుంది. ‘భారతదేశ ప్రజాకవి గద్దర్‌’ గ్రంథంలో సామిడి జగన్‌ రెడ్డి విశ్వవిద్యాలయాలు చేయాల్సిన పరిశోధనను ఏ డిగ్రీ కోరకుండా ఒక వ్యక్తిగా చేయడం చూసిన ప్రతీ పాఠకుడు ఆశ్చర్యపోతాడు. ఇందులో గద్దర్‌ వ్యక్తిగత జీవితం, పోరాట జీవితంతోపాటు స్వాతంత్ర్యానంతరం భారతదేశపు విభిన్న ఉద్యమాలతో గద్దర్‌ కార్యాచరణ అనే గీటురాయిని పరిశోధనకు పెట్టి ఫలితాలు రాబట్టాడు. సుమారు వెయ్యి పుటల్లో ‘ఆధునిక భారత ఇతిహాసం - గద్దర్‌’ అన్న కనిపించని టైటిల్‌తో రాసిన మహా గ్రంథం ఇది.


యాభైకి పైగా అధ్యాయాలతో నడిచిన ఈ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో, ఉప శీర్షికలలో ఇచ్చినటువంటి సమాచారం, విశ్లేషణ ముందు తరాలకు అవసరమైనది. గద్దర్‌ విద్య కోసం ఆసరా ఇచ్చిన అక్క శాంతాబాయి గురించి, ఎమర్జెన్సీలో అరెస్ట్‌ అయిన సందర్భంలో గురైన చిత్రహింసల గురించి, ‘వందనమో వందనమమ్మా నా చెల్లేల స్వర్ణమ్మ’ అన్న పాటలో, ఉద్యమంలో స్త్రీవాదం గురించి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ నిరశన విరమించిన సందర్భంలో గద్దర్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌ సందర్శన తదితర వివరాలన్నీ ఇందులో ముందు వెనకలుగా ఉన్నాయి. ‘యాలరో ఈ మాదిగ బతుకు’ అన్న దళిత స్పృహతో రాయబడిన పాటతో మొదలై, ఒంటిలో బుల్లెట్లు దిగిన తర్వాత రాసిన పాటల లోపలి తాత్వికచింతన వరకు ఈ పుస్తకం నిండా చర్చించాడు జగన్‌.


గద్దర్‌ పాల్కురికి సోమనాథుడితో పోల్చదగ్గవాడు అంటాడు రచయిత. అందుకు ఆయన ఇచ్చిన ఉపపత్తులు విశ్లేషణ నిజమేననిపిస్తాయి. పద్యం మహోన్నత స్థాయిలో నడుస్తూ ఉన్నప్పుడు, ద్విపదను సామాన్య ప్రజల కావ్య రూపంగా మార్చినవాడు పాల్కురికి. అటు పద్యం, ఇటు వచన కవిత్వం మాత్రమే కావ్య గౌరవం అందుకుంటున్న రోజుల్లో పాటకు పట్టం కట్టి ప్రజల హృదయాలను చేరినవాడు గద్దర్‌. చరిత్ర చేత ప్రభావితమై, చరిత్రను ప్రభావితం చేసి, చరిత్రను సృష్టించిన గద్దర్‌ను చరిత్ర మరిచిపోదన్న ప్రొఫెసర్‌ కాశీం రాసిన ముందుమాట నూరుపాళ్ళు నిజం.


‘గద్దర్‌ తెలిసో తెలియకో చిన్ననాటి నుండే చరిత్రను నిర్మిస్తూ వచ్చిండు’ అని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెఫర్డ్‌ అన్నమాట నిజమే. ‘విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో పడిపోతున్న ప్రమాణాల కాలంలో ఇది కొత్త మలుపు లాంటి పరిశోధన’ అన్న జిలకర శ్రీనివాస్‌ అభిప్రాయం కూడా ఈ పుస్తకం లోపలికి సరియైున దారి చూపుతుంది. ఈ పుస్తకం గురించి ఏదైనా మాట్లాడాలంటే ఉప శీర్షికలు చూడాల్సిందే. సీక్వెన్స్‌ ఎంతుంది అనే ప్రశ్న వేసుకోవడం కంటే మొత్తం గ్రంథాన్ని చదివి సారాన్ని మనసుకి ఎక్కించుకోవడమే నిజమైన పాఠకుడికి ఉండాల్సిన శ్రద్ధ. గద్దర్‌ విస్తృతి లాంటిదే గద్దర్‌పై జగన్‌ పరిశోధనాగ్రంథపు విస్తృతి.

- ఏనుగు నరసింహారెడ్డి

మహామానవ - ఇతిహాసం భారతదేశ ప్రజాకవి గద్దర్‌

(స్వాతంత్ర్యానంతర ప్రగతిశీల సాహిత్య, సంగీత, సాంస్కృతికోద్యమ నిర్మాణం)

పరిశోధన, విశ్లేషణ : సామిడి జగన్‌ రెడ్డి

పేజీలు: 948, వెల: రూ. 1000

ప్రతులకు: తెలగాణ్య పబ్లికేషన్స్‌ - 86399 72160 ; నవోదయ బుక్‌హౌస్‌

Updated Date - Oct 20 , 2024 | 10:22 AM