Suryapet: సూర్యాపేట కలెక్టరేట్లో లైంగిక వేధింపులు !
ABN , Publish Date - Oct 04 , 2024 | 04:12 AM
సూర్యాపేట కలెక్టరేట్లోని ఓ శాఖకు చెందిన అధికారి.. తన విభాగంలోని ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.
సూర్యాపేట(కలెక్టరేట్), అక్టోబరు 3: సూర్యాపేట కలెక్టరేట్లోని ఓ శాఖకు చెందిన అధికారి.. తన విభాగంలోని ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. బాధిత మహిళ కలెక్టర్‌కు గురువారం ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి బయటికొచ్చింది. కలెక్టరేట్లోని ఓ ఓ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళను అదే శాఖకు చెందిన జిల్లా అధికారి(50) కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ అధికారి సదరు ఉద్యోగిని సెల్‌ఫోన్‌కు అసభ్యకర సందేశాలు కూడా పంపారు.
తన మాట వినకపోవడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటుందంటూ ఆమెకు మెమో జారీ చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు లైంగిక వేధింపుల విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్.. ఈ అంశంపై ఓ కమిటీతో విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి గతంలోనూ ఇలానే ప్రవర్తించగా బాధిత మహిళలు దేహశుద్ధి చేసినట్టు తెలిసింది.