Harish Rao: రుణమాఫీ కాలేదని అంటే.. అన్నదాతలను అరెస్టు చేస్తారా?: హరీశ్
ABN, Publish Date - Aug 20 , 2024 | 03:22 AM
రుణమాఫీ కాలేదని అంటే రైతులను అరెస్టు చేస్తారా..? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ కాలేదని అంటే రైతులను అరెస్టు చేస్తారా..? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆదిలాబాద్ సహా.. ఇతర జిల్లాల్లో అన్నదాతలపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రుణమాఫీ కోసం నిరసన చేస్తున్న రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
పోలీసు యాక్ట్-30 పేరు చెప్పి జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని హుకుం జారీ చేయడం అన్నదాతల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. రుణమాఫీ జరగక వ్యవసాయ శాఖ కార్యాలయం, బ్యాంకులు, కలెక్టరేట్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు తెలపకుండా రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు. ఆగస్టు 15లోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ చేపడుతుందని సోమవారం ఎక్స్‌వేదికగా హరీశ్ రావు హెచ్చరించారు.
రుణమాఫీపై చర్చకు సిద్దమా?
హరీశ్‌రావుకు కోదండరెడ్డి సవాల్
హైదరాబాద్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? అని ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయేతర భూములకు రైతు బంధుకింద రూ.25,676 కోట్లు ఇచ్చారని, అందులో ఎక్కువ మొత్తం ఆ పార్టీ నేతలకే వెళ్లిందన్నారు. ఓఆర్‌ఆర్ కింద వెళ్లిన భూములకూ రైతు బంధు ఇచ్చారన్నారు. ధరణితో ఎన్నో రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
Updated Date - Aug 20 , 2024 | 03:22 AM