Harish Rao: మీకు అండగా మేముంటాం..
ABN, Publish Date - Sep 30 , 2024 | 03:09 AM
ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్ తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటాయని, ప్రజలు ఎప్పుడైనా వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు.
ఒక్క కాల్ చేయండి.. అరగంటలో వచ్చేస్తాం
‘మూసీ’ నిర్వాసితులకు మాజీ మంత్రి హరీశ్ భరోసా
కొడంగల్‌లో రేవంత్ ఇల్లు రెడ్డికుంటలో ఉంది.. దాన్నీ కూలుస్తారా? అని నిలదీత
హైదరాబాద్/నార్సింగ్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్ తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటాయని, ప్రజలు ఎప్పుడైనా వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. ఇకపై ప్రజల ఇళ్లను రేవంత్ సేన ముట్టుకోకుండా తాము అండగా ఉంటామని, ఫోన్ చేస్తే అరగంటలో వస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల ఇళ్లు కూలగొట్టాలంటే బుల్డోజర్లు ముందుగా తమను దాటి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గండిపేట మండలంలోని హైదర్షాకోట్, లంగర్‌హౌజ్‌లోని హసీంనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని సన్‌సిటీలో ఆదివారం ఆయన పర్యటించారు.
మూసీ సుందరీకరణ నేపథ్యంలో నిర్వాసితులవుతున్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజల బాధలు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ.. హస్తం గుర్తును తీసేసి.. బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలని సూచించారు. ‘‘కొండగల్‌లోని సర్వే నంబర్ 30లో ఉన్న రెడ్డికుంటలో నువ్వు ఇల్లు కట్టుకున్నవ్.. ముందుగా దాన్ని కూలగొట్టు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నీ తమ్ముడి ఇంటికి మాత్రం నోటీసులు ఇచ్చి వదిలేస్తావా? పేదల ఇళ్లు కూలగొడతావా? నీ తమ్ముడికో రూల్.. పేదలకో రూలా?’’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కూల్చడమే తప్ప.. ఏ ఒక్క భవనమూ కట్టింది లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మూసీ సుందరీకరణ మానుకోవాలని డిమాండ్ చేశారు.
మూసీకి నీళ్లెలా తెస్తారు?
కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మూసీలోకి తెస్తామనడం వింతగా ఉందని హరీశ్ పేర్కొన్నారు. గోదావరి నీళ్లను మూసీలోకి తెస్తే.. కాళేశ్వరంపై సీఎం చేసిన వ్యాఖ్యలు అబద్ధమే కదా? అని అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మానేసి, మూసీలోకి మురికి నీరు రాకుండా చెయ్యాలని సూచించారు. బీఆర్‌ఎస్ పాలనలో 32 ఎస్టీపీలు ఏర్పాటు చేశామని, మురుగు నీరు మూసీలోకి రాకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కానీ, సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎేస్టట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Updated Date - Sep 30 , 2024 | 03:09 AM