HCL: హైటెక్‌సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్..
ABN, Publish Date - Sep 28 , 2024 | 03:25 AM
మరో దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో తన భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైటెక్ సిటీలో తన నూతన కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనుంది.
త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొత్తగా 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు
స్కిల్ యూనివర్సిటీలో హెచ్‌సీఎల్ భాగస్వామ్యం
సీఎంతో హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ రోష్నీ సమావేశం
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మరో దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో తన భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైటెక్ సిటీలో తన నూతన కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనుంది. నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న హెచ్‌సీఎల్ 60 దేశాల్లో విస్తరించి ఉండగా.. 2.20 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్‌లో ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు 16 నగరాల్లో కార్యాలయాలు కలిగి ఉంది. తాజాగా మరో కొత్త కార్యాలయం హైటెక్‌సిటీలో సిద్ధమైంది. దీనిని ప్రారంభించాల్సిందిగా హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆమె శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. నూతన క్యాంపస్ ఏర్పాటుతో కొత్తగా ఐదువేల ఇంజినీర్లకు ఉద్యోగాలు లభించనున్నాయని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న విద్య, నైపుణ్యాభివృద్థి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు, విద్యా వనరులను విస్తరించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో హెచ్‌సీఎల్ భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువకులకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్థికి హెచ్‌సీఎల్‌తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్‌సీఎల్-గువీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హెచ్‌సిఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం యువతకు ఉద్యోగాలను కల్పించటంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్థికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం
రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలను నేర్పించి సాధికారత కల్పించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని రోష్ని నాడార్ అన్నారు. ఉపాధి అవకాశాలతో పాటు సాంకేతిక సామర్థ్యాలను హెచ్‌సీఎల్-గువీ పెంపొందిస్తుందని ప్రకటించారు. ఆన్‌లైన్ శిక్షణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో హెచ్‌సిఎల్-గువీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని ఆమె వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో తమ కంపెనీ భాగస్వామ్యం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి అభ్యాసకులకు సాధికారత కల్పిస్తుందని అన్నారు. ఔత్సాహిక సాంకేతిక నిపుణులను తయారు చేస్తుందని చెప్పారు.
స్కిల్ యూనివర్సిటీతో పాటు హెచ్‌సీఎల్ విద్యా కార్యక్రమాలను తెలంగాణలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించే ప్రణాళికలు, దీంతో ఎక్కువ మంది లబ్థి పొందుతారనే ఆలోచనలను కూడా ఈ సమావేశంలో పంచుకున్నారు. హెచ్‌సీఎల్ రెండేండ్ల కిందట తమ నైపుణ్య విభాగం గువీని ప్రారంభించింది. దీంతో దేశీయ భాషల్లో సాంకేతిక కోర్సులను అందిస్తోంది. ప్రధానంగా సాంకేతిక విద్యలో భాషా అవరోధాలు తొలగించేందుకు కృషి చేస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 28 , 2024 | 03:25 AM