ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy rain: ఏపీకి రాకపోకల బంద్‌..

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:31 AM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ప్రవాహం ప్రధాన రహదారులపైకి వచ్చి వాహనాలు ప్రయాణించేందుకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.

  • మహారాష్ట్ర, కర్ణాటకకు కూడా..

  • కోదాడ వద్ద జాతీయ రహదారిపైకి పాలేరు బ్యాక్‌ వాటర్‌

  • నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపైకి వాహనాలు

  • ఖమ్మం-సూర్యాపేట మార్గం మూత

  • శ్రీశైలం వద్ద విరిగిన కొండచరియలు

  • ఘాట్‌ రోడ్డుపై నిలిచిన రాకపోకలు

  • భారీ వర్షాలతో 80 రైళ్ల రద్దు

  • వరంగల్‌ మీదుగా విజయవాడ వెళ్లేవన్నీ..

  • పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాక్‌లు

  • వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు

  • జాతీయ రహదారిపైకి పాలేరు బ్యాక్‌ వాటర్‌

  • ఏపీలోనూ నందిగామ వద్ద రోడ్డుపైకి నీరు

  • హైదరాబాద్‌- విజయవాడ వాహనాల నిలిపివేత

  • పెన్‌గంగాతో మహారాష్ట్ర రాకపోకలకు ఆటంకం

  • శ్రీశైలం రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

  • మహబూబాబాద్‌లో కొట్టుకుపోయిన రైల్వేట్రాక్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ప్రవాహం ప్రధాన రహదారులపైకి వచ్చి వాహనాలు ప్రయాణించేందుకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. దీనికితోడు పలుచోట్ల వరద ప్రవాహానికి రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పాలేరు బ్యాక్‌ వాటర్‌ జాతీయ రహదారి 65పైకి చేరడంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ను మళ్లించారు మరోవైపు ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామ వద్ద కూడా .65వ నంబర్‌ జాతీయ రహదారిపైకి నీరుచేరడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. మున్నేరు వాగు పొంగడంతో ఐతవరం సమీపంలోని జాతీయ రహదారిపై నీరు నిలిచింది.


దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను కీసర టోల్‌ప్లాజా వద్ద అక్కడి పోలీసులు నిలిపివేశారు. నార్కట్‌పల్లి నుంచి 65వ నెంబర్‌ జాతీయరహదారిపై ట్రాఫిక్‌ని నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు మళ్లించగా.. ఈ రోడ్డుపై రద్దీ పెరిగింది. నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి నుంచి దామరచర్ల వరకు ట్రాఫిక్‌ రద్దీ రాత్రి వరకూ కొనసాగింది విజయవాడ నుంచి వయా గుంటూరు, అద్దంకి, మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్‌కు వాహనాలు మళ్లించారు. విజయవాడ నుంచి ఖమ్మంకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామం వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద ఐదు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో హైదరాబాద్‌- విజయవాడ రాకపోకలు నిలిచిపోయాయి.


ఖమ్మం మీదుగా మున్నేరువాగు ప్రవాహం పెరగడంతో బైపా్‌సలోని మున్నేరు బ్రిడ్జినుంచి రాకపోకలను నిలిపివేశారు. మున్నేరు బైపాస్‌ బ్రిడ్జి చెంతకు మున్నేరు వరద చేరడంతో మున్నురు బ్రిడ్జి ఊగింది. కొంత పగుళ్లు రావడంతో సాయంత్రంనుంచి వాహనాలు నిలిపివేశారు. మరోవైపు పాలేరు అలుగుల ద్వారా వస్తున్న నీరు ఖమ్మం-సూర్యాపేట ప్రధానరహదారి పైనుంచి భయంకరంగా ప్రవహించడంతో ఆదివారం ఉదయం నుంచి రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఖమ్మం మీదుగా సూర్యాపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం నుంచి మధిరకు రాకపోకలు నిలిచాయి మధిర-బోనకల్‌, మధిర-పెనుగంచిపోలువైపు రోడ్లపై నీరు చేరడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నిలిపివేశారు.


  • బీబీనగర్‌ వద్ద రాకపోకల నిలిపివేత..

యాదాద్రి జిల్లాలోని బీబీనగర్‌ మండలం రుద్రవెల్లి బ్రిడ్జి, వలిగొండ మండలం సంగెం వద్ద బ్రిడ్జిల వద్ద రాకపోకలు నిలిపివేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌ వద్ద జాతీయరహదారి 167ఎన్‌ పనుల్లో భాగంగా బ్రిడ్జి పనులు సాగుతుండగా, సర్వీ్‌సరోడ్‌ తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హన్వాడ మీదుగా వెళ్ళే మహబూబ్‌నగర్‌ - కొడంగల్‌ వాహనాలను కోయిలకొండ మీదుగా దారి మళ్లించారు. నవాబ్‌పేట మండలంలో తాళ్లవాగు వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. నవాబ్‌పేట మండలం కారూర్‌-మల్లారెడ్డిపల్లి రహదారికి కోసుకుపోవడంతో రాకపోకలను నిలిపివేశారు. జడ్చర్ల మండలం గోప్లాపూర్‌-లింగంపేట వెళ్లే దారిలో గంజి వాగు వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం-వరంగల్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆనంద్‌పూర్‌ వద్ద పెన్‌గంగా నదిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి.


  • కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌.. రైళ్ల రద్దు

మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ల మద్య 418 కిలోమీటర్‌ వద్ద పెద్ద మోరి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ ప్రాంతంలో 30 మీటర్ల పొడవు రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయి పట్టాలు గాలిలో వేలాడుతున్నాయి. మరోవైపు మహబూబాబాద్‌-తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య 432 కిలోమీటర్‌ వద్ద 20 మీటర్ల పొడవు వరద ఉధృతికి రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయింది. ఇలా కేసముద్రం స్టేషన్‌కు ఇరువైపులా రైల్వేట్రాక్‌ కొట్టుకుపోవడంతో మహబూబాబాద్‌, కేసముద్రం, డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. కేసముద్రం రైల్వేస్టేషన్‌లో బెంగళూరు ధన్‌వాడ, ధన్‌వాడ బెంగళూరు సంఘమిత్ర అప్‌అండ్‌డౌన్‌ వైపునకు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. ఈ రెండు రైళ్లలో సుమారు 6 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు డోర్నకల్‌లో లింగంపల్లి-కాకినాడ, కాకినాడ-లింగంపల్లి రైళ్లతోపాటు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ ప్రయాణించే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయాయి. మహబూబాబాద్‌లో గూడూరు-సికింద్రాబాద్‌ సింహపురం ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. కాగా, డోర్నకల్‌, మహబూబాబాద్‌ స్టేషన్‌ల నుంచి ఆయా రైళ్లను మోటుపల్లి, నల్లగొండ మీదుగా హైదరాబాద్‌కు దారి మళ్లించారు. ఈ ప్రయాణికులకు కేసముద్రంలోని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ఉదయం అల్పాహార, మధ్యహ్నం భోజనం తయారు చేసి అందజేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అధికార యంత్రాంగం వరంగల్‌ నుంచి 36 ఆర్టీసీ బస్సులను తెప్పించి, ప్రయాణికులను వరంగల్‌కు తరలించారు.


  • శ్రీశైలానికి నిలిచిన రాకపోకలు

శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ ఇరువైపులా ఘాట్‌ రోడ్డుపై కొండ చెరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నారాయణపేట జిల్లాలెపి ఉట్కూర్‌ పెద్ద చేరువు నిండి అలుగు పారడంతో మక్తల్‌ - ఊట్కూరు - నారాయణపేటల మధ్య రాకపోకలు స్తంభించాయి. భూనేడ్‌ - అభంగాపూర్‌ మధ్య వాగు ఉధృతి తగ్గక పోవడంతో కోటకొండ నుంచి అభంగాపూర్‌, బండగొండ, భూనేడ్‌, కొత్తపల్లి తదితర ప్రాతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని తాండూరు పరిధిలో వాగులు పొంగి ప్రవహించడంతో సరిహద్దులోని కర్ణాటకకు రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్‌ నస్కల్‌ - పరిగి, ధన్నారం - వికారాబాద్‌, మోమిన్‌పేట్‌ - మర్పల్లి, అత్తాపూర్‌ - చించల్‌పేట్‌, పరిగి - మహబూబ్‌నగర్‌, తాండూరు - చించోలి రూట్లలో వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గౌడవెల్లి వాగు ఉధృతితో గౌడవెల్లి-మేడ్చల్‌ మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

Updated Date - Sep 02 , 2024 | 03:31 AM

Advertising
Advertising