ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rain: రాష్ట్రంలో మూడ్రోజులు వర్షాలు

ABN, Publish Date - Aug 16 , 2024 | 03:34 AM

రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించింది.

  • అక్కడక్కడ భారీ వానలు కురిసే చాన్స్‌.. మెదక్‌ జిల్లా గుమ్మడిదలలో 9.1 సెం.మీ.

  • హైదరాబాద్‌లో కుండపోత వాన..

  • రెండ్రోజుల్లో కృష్ణాకు మళ్లీ వరదలు!

  • సాగర్‌ 2 గేట్ల నుంచి నీటి విడుదల

  • తుంగభద్రలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటు పనులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, మేడ్చల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక గురువారం ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డితో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడ్డాయి.


ముఖ్యంగా హైదరాబాద్‌, దాని శివారు ప్రాంతాల్లో రాత్రి గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. మెదక్‌ జిల్లా గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెం.మీ., హైదరాబాద్‌లోని భన్సీలాల్‌పేటలో 8.7 సెం.మీ., పాటిగడ్డలో 8.5 సెం.మీ., ముషీరాబాద్‌లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి హైదరాబాద్‌ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్‌, సికింద్రాబాద్‌, వనస్థలిపురం, కూకట్‌పల్లి, ముషీరాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గోల్కొండ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద పోటెత్తింది.


దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కృష్ణా, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో శుక్రవారం నుంచి వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో రెండ్రోజుల్లో మళ్లీ వరదలు మొదలవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక బేసిన్‌లోని ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్‌ దాకా.. అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నిల్వలున్నాయి. దీంతో నిల్వలను కొనసాగిస్తూనే విద్యుదుత్పత్తి కోసం వచ్చిన కొంత మోతాదులో దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టికి 33,123 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 15 వేల క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది.


నారాయణపూర్‌కు 15 వేల క్యూసెక్కులు వస్తుండగా, 6 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 31,304 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కు 35,425 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, కొట్టుకుపోయిన 19వ గేటుతో పాటు మరికొన్ని గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా.. మొత్తం 1,11,025 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి 1,36262 క్యూసెక్కులు చేరుతుండగా.. 68,453 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి 67,753 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సాగర్‌ 2 గేట్లు ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 63,129 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతోంది.


  • స్టాప్‌లాగ్‌ ఏర్పాటు ప్రక్రియ షురూ..

తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్టుగేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ బిగించే ప్రక్రియ గురువారం పకడ్బందీగా మొదలైంది. స్టాప్‌లాగ్‌ తొలిబ్లాక్‌ను గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భారీ వాహనంపై ఆనకట్ట వద్దకు తరలించారు. క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, ఐదుగురు ఇంజనీర్ల పర్యవేక్షణలో తమిళనాడుకు చెందిన కార్మికులు బ్లాక్‌ను కిందికి దించారు. గేటు అమరిక కోసం కౌంటర్‌ వెయిట్‌ కింది భాగంలో గంట పాటు వెల్డింగ్‌ చేశారు. 1,635 అడుగుల వద్ద స్టాప్‌లాగ్‌ను ‘గైడ్‌ యాంగిల్‌’లోకి (గేటును 2 వైపులా పట్టి ఉంచే నిర్మాణం) దించాల్సి ఉంది.


60 అడుగుల వెడల్పు.. 4 అడుగుల ఎత్తు.. 13 టన్నుల బరువైన భారీ ఇనుప నిర్మాణమిది! అయితే... కొలతల్లో కాస్త తేడా వచ్చింది. రాతి గేట్‌వాల్‌ కన్నా ప్రస్తుతం తయారు చేయించిన స్టాప్‌లాగ్‌ రెండు అంగుళాలు ఎక్కువైంది. దీంతో.. రెండు వైపులా ఒక్కో అంగుళం చొప్పున అరగదీయాల్సి వస్తోంది. రాత్రి 10 గంటల దాకా ఆ పని కొనసాగింది. ఆ తర్వాత పనులను నిలిపివేశారు. శుక్రవారం ఉదయం స్టాప్‌లాగ్‌ బ్లాక్‌ను అమర్చే ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తారు.

Updated Date - Aug 16 , 2024 | 07:03 AM

Advertising
Advertising
<