Railway Disruption: 481 రైళ్లు రద్దు..
ABN, Publish Date - Sep 03 , 2024 | 04:01 AM
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో 481 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
మరో 152 శకటాల దారి మళ్లింపు..
ప్రత్యేక రైలులో మానుకోటకు 8 ఎక్స్‌కవేటర్లు
కేసముద్రం-ఇంటికన్నె, మానుకోట-తాళ్లపూసపల్లి
సెక్షన్ల మధ్య కొట్టుకుపోయిన ట్రాక్‌కు రిపేర్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో 481 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా.. 152 రైళ్లను దారి మళ్లించారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్ల మధ్య 30 మీటర్ల మేర.. మహబూబాబాద్-తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య 20 మీటర్ల మేర ట్రాక్ కొట్టుకుపోయి పట్టాలు గాలిలో వేలాడాయి.
ప్రత్యేక రైలు ద్వారా 8 ఎక్స్‌కవేటర్లను తెప్పించిన అధికారులు.. ఆదివారం నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా పట్టాల కింద మట్టిని నింపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులను సోమవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పరిశీలించారు. వర్షం తెరిపిస్తే మంగళవారం సాయంత్రానికి డబుల్ లైన్లలో ఒకదాన్ని పునరుద్ధరించి రాకపోకలను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కాగా, దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఐదు రైళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడం ఇదే తొలిసారి అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆదివారం ట్రాక్ కొట్టుకుపోయి విజయవాడ-కేసముద్రం సెక్షన్‌లో నిలిచిపోయిన 15 రైళ్లను ఖమ్మం సమీపంలోని మోటుమర్రి స్టేషన్ నుంచి విష్ణుపురం మీదుగా ఇతర మార్గాల్లోకి మళ్లించారు.
కేసముద్రం రైల్వే స్టేషన్‌లో జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన బెంగళూరు-దానాపూర్, దానాపూర్-బెంగళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రె్‌సలలోని ప్రయాణికులను ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లతో బయటకు తెచ్చారు. బస్సుల్లో వారిని కాజీపేట, విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని దానాపూర్, బెంగళూరుకు పంపించారు. ఏపీ, తెలంగాణలో ట్రాక్‌లు దెబ్బతిన్న ప్రాంతాల్లో నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వే 158 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో సుమారు పది వేల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్టు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తున్న నాలుగు వందే భారత్ రైళ్లలో రెండింటిని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మార్గంలో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రె్‌సలను పూర్తిగా రద్దు చేయగా, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌ను 5గంటలు ఆలస్యంగా రీ షెడ్యూలు చేశారు.
Updated Date - Sep 03 , 2024 | 04:01 AM