High Court: స్పీకర్ నిర్ణయం తీసుకునేదెప్పుడు?
ABN, Publish Date - Aug 06 , 2024 | 03:31 AM
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది.
8 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఎన్ని రోజులు పెండింగ్ పెట్టాలి?: హైకోర్టు
8 తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం: ఏజీ
8 విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. ఆరు నెలలా? ఏడాదా? రెండేళ్లా? మూడేళ్లా? ఎంత సమయం పడుతుంది? అని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను ఎన్నిరోజులు పెండింగ్‌లో ఉంచాలని అడిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ కొనసాగించారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు ప్రస్తావించిన కైశం మేఘాచంద్రసింగ్, రాజేంద్రసింగ్ రాణా, కిహోటో హోలోహన్ కేసులు ప్రస్తుత సందర్భానికి వర్తించవని తెలిపారు. అత్యంత తాజాగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మహారాష్ట్రకు సంబంధించిన ‘సుభాష్ దేశాయ్ వర్సెస్ మహారాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ’ కేసును ప్రస్తావించారు. అందులో సుప్రీంకోర్టు ‘తగిన సమయం (రీజనబుల్ టైం)’ అని ప్రస్తావించిందే తప్ప.. కచ్చితమైన సమయాన్ని నిర్దేశించలేదని పేర్కొన్నారు. గతంలోఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్సెస్ తలసాని శ్రీనివా్‌సయాదవ్’ కేసు ఇప్పటికీ అమలులో ఉందని గుర్తుచేశారు.
స్పీకర్ అధికారాల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించిందని వెల్లడించారు. స్పీకర్ అధికారాలకు సంబంధించి ‘ఎస్‌ఏ సంపత్‌కుమార్ వర్సెస్ కాలె యాదయ్య’ కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేశారని తెలిపారు. ఈ మొత్తం తీర్పుల నేపథ్యంలో స్పీకర్ ‘తగిన సమయంలో’ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. స్పీకర్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోక ముందే కోర్టు జోక్యం చేసుకోవడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవహారంలో పిటిషనర్లు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దురుద్దేశంతో వ్యవహరించారని, అనర్హత పిటిషన్‌లు సమర్పించి పట్టుమని పదిరోజులు కూడా కాకముందే కోర్టుకు వచ్చారని తెలిపారు.
దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదిస్తూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు ప్రస్తావించిన కేసుల సందర్భాలు, ప్రస్తుత విషయం వేర్వేరని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ ఏజీ ఆరోపణలను తోసిపుచ్చారు. నెలరోజుల తర్వాత అనర్హత పిటిషన్‌లు దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా, తదుపరి వాదనలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
Updated Date - Aug 06 , 2024 | 03:31 AM