ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఇవేం కూల్చివేతలు ?

ABN, Publish Date - Oct 01 , 2024 | 03:24 AM

అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న తీరు పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు

  • రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలివ్వడమేంటి?

  • హైకోర్టునూ కూలుస్తామని యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా?

  • ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారు?

  • రాజకీయ బాస్‌లు చెప్పినట్లు చేస్తే ఇబ్బందుల్లో పడతారు.. ఇలాగైతే జైళ్లకు పంపుతాం

  • ఆదేశాలు పాటించకుంటే హైడ్రా జీవోపై స్టే

  • ట్రాఫిక్‌ రద్దీపై ఏం చర్యలు తీసుకున్నారు?

  • కావూరి హిల్స్‌, అమీన్‌పూర్‌కు మధ్య వివక్షేల?

  • పెద్దలను వదిలేసి.. పేదలను కొడుతున్నారు

  • కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తాం

  • సహజ న్యాయసూత్రాలు అంటే తెలియదా?

  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ రాధపై ధర్మాసనం ఫైర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న తీరు పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఆదివారం కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రశ్నించింది. కూల్చివేతల సమయంలో సహజ న్యాయసూత్రాలను కూడా పాటించడంలేదని తప్పుబట్టింది. రికార్డులు పరిశీలించకుండానే.. తహసీల్దార్‌ అడిగారంటూ కూల్చివేతలకు సిబ్బందిని, యంత్రాలను ఎలా కేటాయిస్తారంటూ హైడ్రా కమిషనర్‌పై మండిపడింది. హైకోర్టు భవనాన్ని కూల్చివేస్తామంటూ చార్మినార్‌ తహసీల్దార్‌ యంత్రాలు అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. కోర్టు తీర్పులను ఉల్లంఘించి వ్యవహరిస్తే జైలుకు వెళ్తారని హెచ్చరించింది.


సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డిపేటలో ఓ ప్రైవేటు ఆస్పత్రి భవనాన్ని ఆదివారం (ఈ నెల 22న) కూల్చివేయడంపై దాఖలైన పిటిషన్‌పై హైడ్రా కమిషనర్‌, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ రాధ ప్రత్యక్షంగా, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. వారిని దాదాపు గంటన్నరపాటు ప్రశ్నించిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. హైడ్రా తీరు పట్ల తాము సంతృప్తిగా లేమని, ప్రభుత్వ భూములను రక్షించే పద్ధతి ఇది కాదని వ్యాఖ్యానించింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేపట్టరాదన్న ప్రాథమిక విషయం తెలియకపోవడమేంటని విస్మయం వ్యక్తం చేసింది. ‘‘పొలిటికల్‌, ఎగ్జిక్యూటివ్‌ బాస్‌లు చెప్పినట్లు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు. వారిని సంతృప్తి పరిచేందుకు చట్టాలను ఉల్లంఘించొద్దు.


మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మా తీర్పులను ఉల్లంఘిస్తూ ఇలాగే వ్యవహరిస్తే చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు వెళ్తారు. ప్రభుత్వ భూములను రక్షించే విధానం ఇది కాదు. చట్టాలను, తీర్పులను ఉల్లంఘిస్తూ ఏం సాధిద్దామనుకుంటున్నారు? రాత్రికి రాత్రే అంతా మారిపోతుందని భ్రమ పడుతున్నట్లున్నారు! ఈ దేశంలో సహజ న్యాయసూత్రాలు ఉన్నాయని తెలుసా? వ్యక్తి చనిపోయే ముందూ చివరి కోరిక ఏంటని అడుగుతారు. భవనం కూల్చేముందు యజమానికి చివరి అవకాశం ఇవ్వరా? ప్రస్తుత కేసులో విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేయడంపై స్టే ఉంది. భవన నిర్మాణ అనుమతుల రద్దుపై స్టే ఉంది. అవేవీ పట్టించుకోకుండా ఎలా కూలుస్తారు?’’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.


  • ఆ గడువు పూర్తికాకుండానే కూల్చేస్తారా?

48 గంటల్లో భవనాన్ని ఖాళీ చేయాలంటూ శనివారం సాయంత్రం నోటీసు ఇచ్చి.. గడువు పూర్తికాకముందే ఆదివారం ఉదయం 7.30 గంటలకు కూల్చివేశారని హైకోర్టు గుర్తు చేసింది. తహసీల్దార్‌ ఆదివారం విధుల్లో ఉండటమేంటని ప్రశ్నించింది. ‘‘ఉదయం 7.30 అల్పాహారం కూడా పూర్తికాదు. ఇది కక్షతో, కుట్రపూరితంగా చేపట్టిన చర్య కాదా? నోటీసు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటారా? ఇలాగే చేస్తే సూమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి విచారిస్తాం. అసలు తహసీల్దార్‌కు సర్వే, దాని విధానం ఏంటో తెలుసా? హైడ్రా ఏర్పాటు జీవో 99లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకున్నారు. హైడ్రాకు ట్రాఫిక్‌, విపత్తు నిర్వహణ వంటి అనేక విధులు ఉన్నాయి.


కానీ, కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టారు. ట్రాఫిక్‌ సహా నిర్దేశించిన ఇతర విధుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? మాదాపూర్‌ వంటి ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. చెరువుల చుట్టుపక్కల భూములు కొనాలంటే భయపడాలని మీరు (రంగనాథ్‌) ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. మీరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలనుకుంటున్నారా? మేం అమీన్‌పూర్‌ గురించి మాట్లాడుతున్నాం.. కావూరి హిల్స్‌ వరకు రాలేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారు. వివక్ష చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. హైడ్రా ఏర్పాటు అభినందనీయం. కానీ, వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం. హైడ్రా జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాగే వ్యవహరిస్తే జీవోపై స్టే ఇస్తాం’’ ధర్మాసనం హెచ్చరించింది.


  • మూసీపై 20 లంచ్‌మోషన్‌ పిటిషన్లు

మూసీ రివర్‌బెడ్‌ ఖాళీ చేయిస్తామంటూ సర్వే చేపడుతుండటంపై హైకోర్టుకు పిటిషన్లు వెల్లువలా వస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. కేవలం సోమవారం ఒక్కరోజే మూసీ కూల్చివేతలకు సంబంధించి దాదాపు 20 లంచ్‌మోషన్‌లు ఇచ్చినట్లు పేర్కొంది. రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌, భవన నిర్మాణ అనుమతులు, కోర్టు స్టే ఉత్తర్వులు పరిశీలించకుండా చర్యలు తీసుకోవడమేంటని తప్పుబట్టింది. ‘‘ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించింది. అక్రమ నిర్మాణాలుగా తేల్చిన తర్వాత రిజిస్ర్టార్‌ రిజిస్ర్టేషన్‌ ఎలా చేస్తారు? పంచాయతీ, మునిసిపాలిటీ, జీహెచ్‌ఎంసీ ఎలా అనుమతులు ఇస్తాయి? ఒక శాఖ అనుమతులు ఇచ్చి.. మరో శాఖ కూల్చివేయడమేంటి? రిజిస్ర్టేషన్‌ జరగకుండా రిజిస్ర్టార్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు అంటున్నారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఒక్క చెరువుకు కూడా ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు.


ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, సర్వే చేయకుండా అక్రమ నిర్మాణాలుగా ఎలా తేలుస్తారు ? నల్లకుంట, బతుకమ్మ కుంట ఇప్పుడు ఉన్నాయా?’’ అని ప్రశ్నించింది. దీనికి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సమాధానమిస్తూ.. ఓఆర్‌ఆర్‌ పరిధిలో 2,500 చెరువులు ఉండగా 1,320 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు, 138 చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. కోర్టు పట్ల అత్యంత గౌరవం ఉందని, తహసీల్దార్‌ అడిగినందునే మెన్‌ అండ్‌ మెషినరీ ఇచ్చామని, తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే మూసీ సుందరీకరణ, కూల్చివేతలు, తరలింపుపై హైడ్రాకు సంబంధం లేదన్నారు. ప్రస్తుతం ఉన్నవాటిని రక్షించుకోవాలని తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే అసాధారణ కేసుల్లో మాత్రమే తాము అధికారుల హాజరుకు ఆదేశిస్తామని, ఇది అసాధాణ కేసు అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది. అప్పటివరకు యథాతథ స్థితి (స్టేట్‌సకో) కొనసాగించాలని.. కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది.

Updated Date - Oct 01 , 2024 | 03:24 AM