High Court: ఎంపీ రఘునందన్‌రావుకు.. కోర్టు ధిక్కరణ నోటీసులు
ABN, Publish Date - Sep 20 , 2024 | 03:32 AM
మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావుపై హైకోర్టు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ‘‘మీపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు?
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టేటస్‌కో ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ
హైకోర్టు జడ్జి లేఖతో సుమోటోగా స్వీకరించిన సీజే ధర్మాసనం
వివరణ ఇవ్వాలంటూ ఎంపీకి నోటీసులు
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావుపై హైకోర్టు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ‘‘మీపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు? వివరణ ఇవ్వండి’’ అంటూ నోటీసులు జారీ చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలంటూ.. హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం.. కూల్చివేతలపై స్టేట్‌సకో ఇచ్చింది. అప్పటికే హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే.. ఈ జడ్జిమెంట్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. హైకోర్టు తీర్పుపై తీవ్ర విమర్శలు చేశారు.
దీనిపై ఓ న్యాయమూర్తి తీవ్రంగా స్పందిస్తూ.. హైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేకు లేఖ రాశారు. ‘‘హడావుడిగా జడ్జిలు మధ్యంతర ఆదేశాలు ఇవ్వకూడదు. అంతకు ముందు కోర్టు ఆదేశాలను ధ్రువీకరించుకోకుండా స్టేట్‌సకో లేదా స్టే ఆదేశాలు ఎలా ఇస్తారు? జడ్జిలు తమ కళ్లకు గంతలను విప్పేసి, చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోవాలి. ఆ తర్వాతే తీర్పులివ్వాలి. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత పిటిషన్లు పత్తాలేకుండా పోతున్నాయి. అలాంటి కేసులను రిజిస్ట్రీ ఎందుకు జడ్జిల ముందు లిస్ట్ చేయడం లేదు? సీజే దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు? అని ప్రతిపాదిత ధిక్కరణదారు(రఘునందన్) వ్యాఖ్యానించారు.
తన స్టేట్‌మెంట్ ప్రజల్లోకి వెళ్లడానికి న్యాయవ్యవస్థకు దురుద్దేశాలను ఆపాదించారు. అపవాదు అంటగట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపాదిత ధిక్కరణదారు వ్యాఖ్యలను విస్మరించి, అలాగే వదిలేస్తే.. న్యాయవ్యవస్థపై గౌరవం తగ్గిపోవడమే కాకుండా.. రూల్ ఆఫ్ లా భావనపై తీవ్ర ప్రభావం పడుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. దీన్ని సీజే అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. గురువారం ఈ కేసు విచారణకు రాగా.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్‌కు కోర్టు క్రిమినల్ ధిక్కరణ నోటీసులను జారీ చేసింది.
Updated Date - Sep 20 , 2024 | 03:32 AM