High Court: పత్రాలన్నీ సక్రమంగా ఉంటే వారం రోజుల్లో రిజిస్ట్రేషన్
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:09 AM
వివాదాలు పరిష్కారమైన భూముల్లో సైతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు పలువురు సబ్‌రిజిస్ట్రార్‌లు నిరాకరిస్తున్న నేపథ్యంలో హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీచేసింది.
తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి
సబ్‌రిజిస్ట్రార్‌లకు హైకోర్టు మార్గదర్శకాలు
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వివాదాలు పరిష్కారమైన భూముల్లో సైతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు పలువురు సబ్‌రిజిస్ట్రార్‌లు నిరాకరిస్తున్న నేపథ్యంలో హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీచేసింది. వివాదాలు పరిష్కారమైనప్పటికీ తాజాగా కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ సబ్‌రిజిస్ట్రార్‌లు ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు నిరాకరిస్తున్న నేపథ్యంలో హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం కోర్టు తీర్పులను అర్థం చేసుకోకుండా సబ్‌రిజిస్ట్రార్‌లు పౌరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీచేసింది. ‘‘ రిజిస్ట్రేషన్‌కు వచ్చిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చట్టం-1908, ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం సక్రమంగా ఉంటే వారంలో రిజిస్ట్రేషన్ చేయాలి. లేదంటే తిరస్కరిస్తున్నట్లు లిఖితపూర్వకంగా కారణాలు వివరించాలి.
డాక్యుమెంట్లను తిరస్కరిస్తే స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల వాపసు చేసే ప్రక్రియను సరళీకృతం చేయాలి. కోర్టు వివాదాలు ముగిసి.. ఎలాంటి అప్పీళ్లు పెండింగ్‌లో లేనప్పుడు మళ్లీ కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలని పౌరులను ఇబ్బందులకు గురిచేయకుండా ఉన్నతాధికారులు విఽధివిధానాలు జారీచేయాలి. తీర్పులు వెలువడిన లేదా పిటిషన్‌లు కొట్టేసిన కేసుల్లో డాక్యుమెంట్లను తిరస్కరించరాదు. ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జనరల్ డైరీ లేదా వాచ్ రిజిస్టర్ నిర్వహించాలి. అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పౌరుల వరుస సంఖ్య, తేదీ, సమయం అందులో రాయాలి. ఇవికాకుండా పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.
Updated Date - Jul 20 , 2024 | 05:09 AM