ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: చట్టప్రకారం వెళ్లండి

ABN, Publish Date - Aug 22 , 2024 | 04:12 AM

భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్వాడ ఫాంహౌజ్‌ విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాలని.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ సంస్థ (హైడ్రా)ను హైకోర్టు ఆదేశించింది.

  • కేటీఆర్‌ జన్వాడ ఫాంహౌజ్‌పై హైకోర్టు.. ‘స్టే’కు నో

  • ఆ భవనానికి సర్పంచ్‌ అనుమతి చెల్లదన్న సర్కారు

  • ఇవ్వాల్సింది పంచాయతీ కార్యదర్శి అని వెల్లడి

  • ఫాంహౌజ్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని వివరణ

  • 20 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో కట్టుకున్న

  • భవనాలను ఇప్పుడు అక్రమనిర్మాణాలంటే ఎలా?

  • ఒక శాఖ అనుమతిస్తే మరొక శాఖ కూల్చేస్తుందా?

  • హైడ్రా హైడ్రామా.. దాన్ని ఎలా ఏర్పాటు చేశారు

  • పరిధి, విధులేంటి.. చట్టబద్ధత ఏమిటి: హైకోర్టు

  • తదుపరి విచారణ సెప్టెంబరు 12కు వాయిదా

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్వాడ ఫాంహౌజ్‌ విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాలని.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ సంస్థ (హైడ్రా)ను హైకోర్టు ఆదేశించింది. అన్ని పత్రాలు, బిల్లులు, చెల్లింపుల రశీదులు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. ఫాంహౌజ్‌ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కూల్చివేతల పేరిట హైడ్రా హైడ్రామా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.


రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ పంచాయతీలోని 311 సర్వే నంబర్‌లో 1210 చదరపు గజాల్లో ఉన్న ఫాంహౌజ్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉందంటూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని.. ఆ ఫామ్‌హౌజ్‌ విషయంలో వారు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యజమాని బద్వేల్‌ ప్రదీప్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభం కాగానే.. హైడ్రా కూల్చివేతలపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.


‘‘కూల్చితల పేరిట హైడ్రా హైడ్రామా చేస్తోంది. చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు తేడా చూపిస్తోంది. 20 ఏళ్ల కింద ఎప్పుడో కన్వర్షన్‌ రుసుములు కట్టి అనుమతులు పొంది ఇళ్లు నిర్మించుకుంటే ఇప్పుడు వచ్చి అక్రమ నిర్మాణాలు అంటారా? అలాంటప్పుడు రుసుములు తీసుకుని అదే ప్రభుత్వశాఖలు ఎలా అనుమతులు ఇచ్చాయి. ఒక ప్రభుత్వశాఖ అనుమతి ఇస్తే.. మరో ప్రభుత్వ శాఖ ఇళ్లను కూల్చేస్తుందా? అసలు హైడ్రా చట్టబద్ధత ఏంటి? దానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ఎలా ఏర్పాటు చేశారు? దాని పరిధి, విధులు ఏంటి? ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో నిర్మాణాలు అంటున్నారు.


ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ మార్క్‌ చేసి తుది నోటిఫికేషన్‌ ఇచ్చిందా? ఎన్ని చెరువులకు ప్రాథమిక, తుది నోటిఫికేషన్‌లు ఇచ్చారు? ఇప్పటి వరకూ ఒక్క ఫైనల్‌ నోటిఫికేషన్‌నూ నీటిపారుదలశాఖ కోర్టుకు సమర్పించలేదు’’ అని వ్యాఖ్యానించింది.జన్వాడ ఫాంహౌజ్‌ను కూల్చబోమంటూ అండర్‌టేకింగ్‌ ఇవ్వాలని.. ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేస్తామని పేర్కొంది. అండర్‌ టేకింగ్‌ ఇవ్వకపోతే స్టేటస్‌ కో (యథాతథస్థితి) విధిస్తామని పేర్కొంది. అండర్‌టేకింగ్‌ ఇవ్వడానికి నిరాకరించిన అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌.. ప్రభుత్వ సూచనలు అందుకునే వరకు వాయిదా వేయాలని కోరడంతో విచారణ మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా పడింది.


  • నోటీసులు ఇచ్చాకే కూల్చివేతలు..

మళ్లీ విచారణ మొదలయ్యాక ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. హైడ్రా ఏర్పాటు జీవో 99 గురించి, దాని పరిధి, విధుల గురించి వివరించారు. ప్రస్తుత ఫాంహౌజ్‌ 111 జీవో పరిధిలో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలతో కలిసి సమన్వయంతో హైడ్రా పనిచేస్తోందని.. ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతోపాటు అక్రమ నిర్మాణాలు తొలగిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ చట్టవిరుద్ధంగా నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి కూల్చివేతలూ చేపట్టలేదన్నారు.


అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లను గుర్తించి ఫైనల్‌ నోటిఫికేషన్‌లు ఇవ్వాలంటూ చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిందని.. అందులో భాగంగానే హైడ్రా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్‌ల గుర్తింపులో ఆలస్యం అయినా పని పూర్తిచేయాలని ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ‘‘జన్వాడ ఫాంహౌజ్‌కు అనుమతి లేదు. పిటిషనర్‌కు విక్రయించిన విక్రయదారు సర్పంచ్‌ నుంచి అనుమతి పొందారని పేర్కొంటున్నారు కానీ సర్పంచ్‌కు అనుమతి ఇచ్చే అధికారం లేదు. పంచాయతీ సెక్రటరీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.’’ అని ఏఏజీ పేర్కొన్నారు.


ఎఫ్‌టీఎల్‌ గుర్తిస్తూ నోటిఫికేషన్‌తోపాటు కౌంటర్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఇక.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వి.హరిహరణ్‌ వాదనలు వినిపించారు. విక్రయదారు సర్పంచ్‌ అనుమతి తీసుకున్నారని.. ఫాంహౌజ్‌ ఎఫ్‌టీఎల్‌లో లేదని తెలిపారు. ఈనెల 14న నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ తమ ఫాంహౌజ్‌ ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌లో ఉందని.. హైడ్రా అధికారులతో కలిసి వస్తామని బెదిరించాని.. ఎలాంటి నోటీసు ఇవ్వలేదని ధర్మాసనానికి వెల్లడించారు. హైడ్రాతో కలిసి ఫాంహౌజ్‌ కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.


ఇరువర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జన్వాడ ఫాంహౌజ్‌ విషయంలో చట్టప్రకారం వ్యవహరించాలని పేర్కొంది. అనుమతులతోపాటు అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకోవాలని.. వివాదంలో ఉన్న ఆస్తి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందా? లేదా? అనే విషయాన్ని ప్రాథమిక, తుది నోటిఫికేషన్‌ల ద్వారా పరిశీలించాలని సూచించింది. చర్యలు తీసుకునే ముందు పిటిషనర్‌ సమర్పించే రికార్డులు పరిశీలించాలని.. హైడ్రా జీవో 99 నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది.


ఎఫ్‌టీఎల్‌ నోటిఫికేషన్‌తో సహా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే హైడ్రా కూల్చివేతలు చేపట్టే ముందు టైటిల్‌ను, జీహెచ్‌ఎంసీ లేదా ఇతర స్థానిక సంస్థల నుంచి పొందిన అనుమతులను పరిశీలించాలని సూచించింది. స్థలం 60 నుంచి 100 గజాలు ఉన్నా.. ఎకరంపైన ఉన్నా ఎలాంటి వివక్షా లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా హైడ్రా వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది. ఈ నిబంధనలు పాటిస్తూ ఎన్ని నిర్మాణాలు కూల్చారో కౌంటర్‌లో వివరించాలని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 12కు వాయిదావేసింది.

Updated Date - Aug 22 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<