High Court: మైనార్టీ గురుకులాల్లో బదిలీలపై హైకోర్టు స్టే
ABN, Publish Date - Jul 14 , 2024 | 03:52 AM
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే గురుకులాల ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే గురుకులాల ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ గురుకులాల్లో పనిచేసే ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, లైబ్రరేరియన్, ఇతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం జూలై 6న మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు చెల్లవని పేర్కొంటూ పీజీటీ జి.హేమలత, ఇతర ఉద్యోగులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది ఫణిభూషణ్ వాదనలను వినిపిస్తూ.. మైనార్టీ గురుకుల సొసైటీని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్స్-2018 పరిధిలోకి తెస్తూ 2022లో ప్రభుత్వం మెమో జారీచేసిందని.. దానిపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించిందని గుర్తుచేశారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. మైనార్టీ గురుకుల సొసైటీ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్స్-2018 పరిధిలో లేదని.. దానిపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. డివిజన్ బెంచ్ స్టేను వెకేట్ చేయించుకోకుండా బదిలీలు చేపట్టడం చెల్లదని స్పష్టంచేసింది. తదుపరి విచారణ(ఈనెల 18) వరకు బదిలీల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని మధ్యంతర స్టే విధించింది.
Updated Date - Jul 14 , 2024 | 03:52 AM