High Court: 10 రోజులు కాకముందే కోర్టుకొచ్చారు!
ABN, Publish Date - Aug 08 , 2024 | 04:06 AM
బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టేయండి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వాదన
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన పదిరోజులకే హైకోర్టును ఆశ్రయించారని.. స్పీకర్ కార్యాలయం అనర్హత పిటిషన్లు స్వీకరించడం లేదనేది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రధాన ఫిర్యాదు అని తెలిపారు. కోర్టు జోక్యంతో వారి అనర్హత పిటిషన్లను స్వీకరించిన స్పీకర్ కార్యాలయం.. రశీదులు సైతం ఇచ్చిందని చెప్పారు. దాంతో పిటిషనర్ల ఉద్దేశం నెరవేరిందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు ఎక్కువగా ప్రస్తావిస్తున్న సుప్రీంకోర్టు తీర్పు ‘కైశం మేఘాచంద్రసింగ్’ కేసులో మూడు నెలల గడువు తీరిన తర్వాత పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో 10 రోజులు కూడా గడవకముందే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారని, దురుద్దేశంతో వ్యవహరించిన వారి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
Updated Date - Aug 08 , 2024 | 04:06 AM