Survey of India: చెరువులు, నాలాల లెక్క పక్కాగా!
ABN, Publish Date - Oct 09 , 2024 | 03:03 AM
మహానగరంలో చెరువులు, నాలాల లెక్కను శాస్త్రీయ విధానం ద్వారా తేల్చేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) సన్నద్ధమైంది.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపునకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పని చేయనున్న హైడ్రా
ఇప్పటికే ఎన్‌ఆర్‌ఎ్‌సఏ, ఎస్‌ఆర్‌ఎ్‌ససీలతో సమన్వయం
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ విభాగాల వద్ద వివరాలూ పరిశీలన
అన్నీ క్రోడికరించి చెరువులపై అంచనా
1970-71లో స్థితి ఎలా..ఇప్పుడెలా ఉన్నాయన్నది గుర్తింపు
సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కమిషనర్ రంగనాథ్ భేటీ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మహానగరంలో చెరువులు, నాలాల లెక్కను శాస్త్రీయ విధానం ద్వారా తేల్చేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) సన్నద్ధమైంది. హబ్సిగూడలోని సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైదరాబాద్‌లో చెరువులు, నాలాల లెక్క తేల్చేందుకు నడుంబిగించింది. ఈ మేరకకు సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం సమావేశమయ్యారు. నాలుగైదు దశాబ్దాల క్రితం నగరంలో గొలుసు కట్టు చెరువులు ఎన్ని ఉండేవి.? ఇప్పుడెన్ని ఉన్నాయి? అనేవి తేల్చేందుకు సహకరించాలని సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ డేబబ్రత పాలిట్‌లను రంగనాథ్ కోరారు. సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న పాత మ్యాపులను ఈ సందర్భంగా పరిశీలించారు. 1971-72 సర్వే ప్రకారం నగరంలో ఉన్న చెరువుల సంఖ్య, వాటి విస్తీర్ణం, ప్రస్తుత స్థితి, నాలాలు ఎంత మేర ఉండేవి? కబ్జా అయినవెన్ని? అనేవి సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
కాగా చెరువులకు సంబంధించి హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి హైడ్రా ఇప్పటికే వివరాలు సేకరించింది. వాటిని సర్వే ఆప్ ఇండియా వద్ద ఉన్న గత, ప్రస్తుత మ్యాపులతో క్రోడికరించి చూశారు. ఏ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగయ్యాయి? నాలాలు విస్తీర్ణం ఎంత తగ్గింది? అన్న దానిపై ఓ అంచనాకు రానున్నట్లు రంగనాథ్ తెలిపారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణలో సర్వే ఆఫ్ ఇండియానూ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరి, సంగగారెడ్డి జిల్లాల్లోని చెరువులకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన వివరాలను ప్రభుత్వ విభాగాల సమచారంతో సరి పోల్చి ఓ నివేదిక తయారు చేయాలని నిర్ణయించారు. చెరువుల వారీగా వివరాలను డిజిటలైజ్ చేయాలని భావిస్తున్నారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణపై దృష్టి
పలు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను నోటిఫై చేస్తూ హెచ్‌ఎండీఏ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంకొన్ని చెరువులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో కొన్ని చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల క్రితం నాటి వివరాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ ఎఫ్‌టీఎల్ నిర్ధారించకుండా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం గుర్తించారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి సారించాలని హైడ్రా నిర్ణయించింది.
పైన పేర్కొన్న ఆయా విభాగాలతోపాటు ఎన్‌ఆర్‌ఎ్‌సఏ, ఎస్‌ఆర్‌ఎ్‌ససీల వద్ద ఉండే శాటిలైట్ చిత్రాలు, ఇతర వివరాలనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. శాస్ర్తీయ విధానంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ధారించాలని హైడ్రా నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వమూ సంబంధిత విభాగాలకు మూడు నెలల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో హైడ్రా కీలకంగా వ్యవహరించనుంది. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ తరువాతే చెరువుల్లో ఆక్రమణల గుర్తింపు, తొలగింపుపై దృష్టి సారించే అవకాశముందని ఓ అధికారి తెలిపారు. ప్రాధాన్య క్రమంలో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది.
Updated Date - Oct 09 , 2024 | 03:03 AM