ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Book Festival: కొత్త పాఠకులు వస్తున్నారు..

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:19 AM

‘‘ఈ కాలంలో పుస్తకాలు చదివే ఓపికెవరికుంది అండి.! కొన్నాళ్లుపోతే అచ్చు పుస్తకాలను ఆర్కైవ్స్‌లో చూడాలేమో’’ లాంటి నిరాశ, నిస్పృహతో నిండిన వ్యాఖ్యానాలను తరుచుగా వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో మరో వందేళ్లు అయినా ‘పుస్తకం చిరంజీవి’ అన్న ఆశావాహాన్ని కల్పిస్తోంది

ఆదివారం కిక్కిరిసిన హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ప్రాంగణం

  • ఒక్కరోజే 90వేలకు పైగా సందర్శకులు

  • ఈ-కాలంలోనూ అచ్చు పుస్తకానికి ‘జై’ కొడుతున్న యువతరం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు22(ఆంధ్రజ్యోతి): ‘‘ఈ కాలంలో పుస్తకాలు చదివే ఓపికెవరికుంది అండి.! కొన్నాళ్లుపోతే అచ్చు పుస్తకాలను ఆర్కైవ్స్‌లో చూడాలేమో’’ లాంటి నిరాశ, నిస్పృహతో నిండిన వ్యాఖ్యానాలను తరుచుగా వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో మరో వందేళ్లు అయినా ‘పుస్తకం చిరంజీవి’ అన్న ఆశావాహాన్ని కల్పిస్తోంది హైదరాబాద్‌ పుస్తక మహోత్సవం. అది ప్రారంభమైన మూడు రోజుల్లో 1.5లక్షలమంది సందర్శించారు. ఆదివారం పుస్తకాల పండుగ ప్రాంగణమంతా జనసందోహాన్ని తలపించింది. 300కుపైగా పుస్తక స్టాళ్లన్నీ పాఠకులతో కిక్కిరిశాయి. ఒక్కరోజే 90వేలమందికిపైగా బుక్‌ ఫెయిర్‌లో పాల్గొన్నట్లు ఆ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్‌ చెప్పారు. సెలవు కావడంతో పిల్లలతో సహా సకుటుంబ సపరివార సమేతంగా పిక్నిక్‌కు తరలినట్టుగా ఎన్టీఆర్‌ మైదానంలోని దాశరథి ప్రాంగణంవైపు కదిలారు. స్టాళ్లలో పిల్లలకు తల్లిదండ్రులు దగ్గరుండిమరీ పుస్తకాలను పరిచయం చేస్తుండడం కనిపించింది.


విద్యార్థుల కోలాహలం

పుస్తకాల పండుగకు నగరం నలుమూలల నుంచి మాత్రమే కాదు, జిల్లాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. కల్వకుర్తి, జనగామ, నల్గొండ, మహబూబ్‌నగర్‌, కోదాడ తదితర ప్రాంతాలకు చెందిన ప్రైవేటు, ప్రభుత్వ, గురుకులాల విద్యార్థులు ప్రతి పుస్తకాల స్టాల్‌ను సందర్శించి, అందులో వారిని ఆకట్టుకున్న పుస్తకాల పేర్లుతో సహా నోట్స్‌ తయారుచేసుకున్నారు. తర్వాత ఒకరికొకరు చర్చించుకొని మరీ పుస్తకాలు కొనుగోలుచేయడం విశేషం. అలా పుస్తక ప్రదర్శనలో కనిపించిన కల్వకుర్తి అక్షరవనం విద్యార్థినులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా... సుధామూర్తి రచనలకు తామంతా అభిమానులమని, ముఖ్యంగా ‘ది మ్యాజిక్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ టెంపుల్‌’ ఆంగ్ల నవల చాలా ఇష్టమని వారంతా చెప్పారు. రస్కిన్‌ బాండ్‌ రచనలన్నా చాలా ఇష్టమని మరికొందరు వెల్లడించారు. నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, మంచిపుస్తకం తదితర తెలుగు ప్రచురణల స్టాళ్లతోపాటు కాల్పనిక ఆంగ్ల సాహిత్యంపట్ల ఎక్కువ మంది ఆసక్తి కనబరచడం విశేషం. కొత్తపాఠకులు వస్తున్నారనడానికి ఇంతకుమించిన ఉదాహరణ మరొకటి ఉంటుందా.?


అమ్మకాలు ఊపందుకున్నాయి...

పుస్తక ప్రదర్శనకు వచ్చేవారిలో కొనేవారే ఎక్కువ అనడానికి, పుస్తకాల అమ్మకాలే సాక్ష్యం. రైటర్స్‌ హాల్లోని ఒక చిన్నటేబుల్‌ నిర్వాహకులు శనివారం రూ.5వేల విలువైన పుస్తకాలు విక్రయించినట్లు చెప్పారు. నవతెలంగాణ, నవోదయ, ఎమెస్కో వంటి స్టాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మొత్తం అమ్మకాల శాతాన్ని పదిరోజుల తర్వాతే అంచనావేయగలమని నవోదయ కోటేశ్వరరావు చెబుతున్నారు. యోగద సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియా, శివానంద సుపథ ఫౌండేషన్‌, రామకృష్ణ మఠం తదితర ఆధ్యాత్మిక పుస్తకాలయాలు, జిడ్డు కృష్ణమూర్తి, విశ్వనాథ సత్యనారాయణ, చలం, బాలగోపాల్‌, కత్తిపద్మారావు తదితరుల రచనలకు ఆదరణ లభిస్తోంది. పుస్తక జ్ఞానాన్ని పొందాలన్న జిజ్ఞాస యువతరంలో ప్రబలంగా ఉన్నదనడానికి పుస్తక మహోత్సవానికి వస్తోన్న ఆదరణ ద్వారా నిరూపితమవుతుంది.


‘డిజిటల్‌’తో వెసులుబాటున్నా..

మా అమ్మ మంచి సాహిత్యాభిమాని. దాంతో నాకు కూడా చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఏటా నాకు ఇష్టమైన పుస్తకాలు కొనడానికి వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు కొంటున్నాను. ట్యాబ్‌ ఒక్కటి వెంట పెట్టుకుంటే, అందులో వెయ్యి పుస్తకాలు మనచేతిలో ఉన్నట్టేకదా.! అయినా, అచ్చు పుస్తకం చదవడానికే ఇష్టపడతాను. చేతిలో పుస్తకాన్ని పట్టుకున్నప్పుడు కలిగే అనుభూతి ఈ-బుక్స్‌ చదువుతున్నప్పుడు రాదు.

- మౌక్తిక, ఇంజనీరింగ్‌ విద్యార్థిని, వరంగల్‌


ఆలోచనా తీరులో మార్పు...

ఆరేళ్ల కిందట నేను ఈ బుక్‌ ఫెయిర్‌కు రాకముందు వరకు, నాకు కేవలం అతికొద్దిమంది రచయితలు, వారి రచనలు మాత్రమే తెలుసు. ఇక్కడికి రావడం ప్రారంభించాక నా ఆలోచనా తీరే మారింది. తాత్విక, మనోవైజ్ఞానిక, సామాజిక, ఆధ్యాత్మిక రచనలెన్నో నాకు ఇక్కడ పరిచయం అయ్యాయి. సంక్రాంతికి ఊరెళ్లడమైనా మానతానేమోగానీ, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌కు మాత్రం రావడం మానను. ఇక్కడి వాతావరణం వృత్తిరీత్యా నాకెంతో దోహదపడింది కూడా.

- కిరణ్‌, వర్థమాన సినిమా రచయిత

Updated Date - Dec 23 , 2024 | 03:19 AM