Hyderabad: సర్కారు అంగీకారం.. జేఎన్‌టీయూ తిరస్కారం..! విషయం ఏంటంటే..
ABN, Publish Date - Sep 26 , 2024 | 11:42 AM
‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం’ అన్నచందంగా తయారైంది జేఎన్‌టీయూ(JNTU) పరిధిలోని అటానమస్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి. యూనివర్సిటీ పరిధిలో దాదాపు 80 అటానమస్ హోదా కలిగిన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండ గా, సగానికి పైగా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిలిపివేశారు.
- అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతుల్లో గందరగోళం
- సెమిస్టర్ ఫలితాలు అందక విద్యార్థుల అయోమయం
హైదరాబాద్ సిటీ: ‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం’ అన్నచందంగా తయారైంది జేఎన్‌టీయూ(JNTU) పరిధిలోని అటానమస్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి. యూనివర్సిటీ పరిధిలో దాదాపు 80 అటానమస్ హోదా కలిగిన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండ గా, సగానికి పైగా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిలిపివేశారు. తరుచుగా సెమిస్టర్ ఫలితాల వెల్లడిలో జేఎన్‌టీయూ అధికారులు చేస్తున్న జాప్యంపై.. ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్రంగా నిరసన వ్యక్తమవుతోంది.
ఇదికూడా చదవండి: Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..
సెమిస్టర్ ఫలితాల ఆలస్యంపై అటానమస్ కాలేజీల యాజమాన్యాలను విద్యార్థులు సంప్రదిస్తే జేఎన్‌టీయూ అధికారులు ఆమోదించడం లేదని చేతులెత్తేస్తున్నారు. ఇదే విషయంపై యూనివర్సిటీ ఉన్నతాధికారులను కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదిస్తే.. ఆయా కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సులకు జేఎన్‌టీయూ నుంచి అనుమతులు లేనందునే ఫలితాలను నిలిపివేసినట్లు చెబుతున్నారు.
మూడేళ్ల క్రితం సర్కారు అనుమతించినా..
ప్రభుత్వం నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా మూడేళ్ల క్రితం ఆయా కోర్సుల్లో తమ పిల్లలను చేర్చితే, జేఎన్‌టీయూ అధికారులు నింపాదిగా కొన్ని కాలేజీల్లో కోర్సులకు అనుమతుల్లేవని ఇప్పుడు చెబుతుండడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటానమస్ కాలేజీల్లో సర్కారు అనుమతించిన కోర్సులకు, జేఎన్‌టీయూ అధికారులు అనుమతుల్లేవనడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు. ముఖ్యంగా మేడ్చల్, దుండిగల్, దూలపల్లి, ఘట్‌కేసర్, మైసమ్మగూడ, శంషాబాద్, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం(Shamshabad, Moinabad, Ibrahimpatnam) ప్రాంతాల్లోని కొన్ని కాలేజీల్లో ఇటువంటి సమస్య ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అటానమస్ కాలేజీల యాజమాన్యాలకు, జేఎన్‌టీయూ అధికారులకు మధ్య పొసగకుంటే, విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఫలితాలను ఆపేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒకట్రెండు కోర్సులకు అనుమతులు లేకుంటే వాటివరకు ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టాలే గానీ, అనుమతులున్న కోర్సుల ఫలితాలను నిలిపేయడం జేఎన్‌టీయూ అధికారులకు సమంజసంగా లేదంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అటానమస్ కాలేజీల్లో సెమిస్టర్ ఫలితాలను తక్షణం ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు నెలలుగా యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్ లేకపోవడం, ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్ యూనివ ర్సిటీకి నెలకు ఒక్కసారైనా రాకపోతుండడంతో వర్సిటీలో పాలన గందరగోళంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర..
ఇదికూడా చదవండి: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా
ఇదికూడా చదవండి: హై‘డ్రామా’లొద్దు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 26 , 2024 | 11:42 AM