Hyderabad : విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్
ABN, Publish Date - Jul 31 , 2024 | 05:45 AM
విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీంరావు లోకూర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం(29వ తేదీ) ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నివేదిక ఇవ్వడానికి మూడు నెలల గడువు
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీంరావు లోకూర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం(29వ తేదీ) ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. పోటీ బిడ్డింగ్ లేకుండా ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం, నామినేషన్ ప్రాతిపదికన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ప్రారంభ మైన నాటి నుంచి మూడు నెలల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం లోకూర్ కమిషన్‌కు నిర్దేశించింది. జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు.
ముక్కుసూటి మనిషిగా పేరుంది. ఆయన విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా రికార్డులన్నీ పరిశీలించి, అవసరమైతే నోటీసులు/సమన్లు జారీ చేస్తారు. ఇదే అంశంపై విచారణ కోసం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డితో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా ఆయన దాదాపు 28 మందికి లేఖలు రాశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఆయా తప్పిదాలకు మాజీ సీఎం కేసీఆరే కారకుడని విద్యుత్ నిపుణులు కంచర్ల రఘు, ఎం.తిమ్మారెడ్డి, ఎం.వేణుగోపాల్‌రావు, గోపాలకృష్ణన్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌లు కమిషన్‌కు ఫిర్యాదు చేయగా... ఆ ఫిర్యాదుల్లోని అంశాలు వాస్తవాలా? కాదా? అనే విషయమై ఫిర్యాదు చేసిన వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇస్తూ గత జూన్‌లో కేసీఆర్‌కు కమిషన్ లేఖ రాసింది.
విచారణ పూర్తి కాకుండానే మీడియాకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారని తప్పు పడుతూ 12 పేజీలతో కమిషన్‌కు కేసీఆర్ లేఖ రాశారు. తర్వాత కమిషన్ విచారణను సవాలుచేస్తూ తొలుత హైకోర్టులో కేసు వేశారు. అక్కడ ఫలితం దక్కలేదు. సుప్రీంకోర్టులో కేసు వేయగా... విచారణ నుంచి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తప్పుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం ఆయన స్థానంలో జస్టిస్ మదన్ భీంరావు లోకూర్‌ను నియమించింది.
జస్టిస్ లోకూర్ నేపథ్యం
1977లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభం. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ప్రాక్టీస్. 1981లో సుప్రీంకోర్టులోఅడ్వకేట్ ఆన్ రికార్డుగా నమోదు.
1999-2010 మధ్యకాలంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక సీజేగా, 2010- 2011 మధ్యకాలంలో గుహహాతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2011-2012 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
ముస్లింలు, ఇతర మైనార్టీలకు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆయన తీర్పుతో కొట్టివేశారు.
ఎన్నికల్లో మతం, కులం, భాషపై ఆధారంగా మాట్లాడేవారిని అనర్హులుగా ప్రకటించాలని వంటి సంచలన తీర్పులు ఇచ్చారు.
Updated Date - Jul 31 , 2024 | 05:45 AM