ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జైల్లో నెలరోజులు బాతుగుడ్లు, వట్టి చేపలు తిని బతికా!

ABN, Publish Date - Jul 09 , 2024 | 02:41 AM

కాంబోడియా జైల్లో నెల రోజులు తాను బాతు గుడ్లు.. వట్టి చేపలు తిని బతికానని మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన మున్సిఫ్‌ ప్రకాశ్‌ చెప్పాడు. చేసిన పనికి డబ్బులివ్వకపోగా తానే బాకీ పడ్డానంటూ కంపెనీ తనపై కేసుపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

  • చేసిన పనికి కంపెనీ డబ్బివ్వలే.. ఉల్టా బాకీ పడ్డానంటూ కేసు పెట్టారు

  • కాంబోడియాలో అంతా సైబర్‌ మోసం

  • ఏఐ టెక్నాలజీతో ఫోటోల మార్ఫింగ్‌

  • చాలా మంది చెరలో ఉన్నారు : ప్రకాశ్‌

బయ్యారం, జూలై 8: కాంబోడియా జైల్లో నెల రోజులు తాను బాతు గుడ్లు.. వట్టి చేపలు తిని బతికానని మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన మున్సిఫ్‌ ప్రకాశ్‌ చెప్పాడు. చేసిన పనికి డబ్బులివ్వకపోగా తానే బాకీ పడ్డానంటూ కంపెనీ తనపై కేసుపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంబోడియా నుంచి ప్రకాశ్‌ ఆదివారం రాత్రి స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అదేరోజు రాత్రి మహబూబాబాద్‌లోని తన బంధువుల ఇంట్లో ఉన్న ప్రకాశ్‌ సోమవారం ఉద యం ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసి అన్న ప్రశాంత్‌, ఇతర కుటుంబసభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా, కాంబోడియా పయనం, అక్కడ తలెత్తిన పరిస్థితులను బయ్యారం సీఐ రవికుమార్‌కు ప్రకాశ్‌ వివరించాడు.


తాను హైదరాబాద్‌లో ఓ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేసి మానేశానని, మరో జాబ్‌ కోసం తన ప్రొఫైల్‌ను ఓ వెబ్‌సైట్‌లో పెట్టగా ఉద్యోగావకాశాలపై పలువురి నుంచి తనకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని, ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన విజయ్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పడంతో తాను కాంబోడియా వెళ్లానని వివరించాడు. తీరా అక్కడికి వెళ్లాక కంపెనీ వాళ్లు అప్పగించిన పని చూసి తాను షాక్‌ అయ్యాయని, శిక్షణ తర్వాత కొద్దిరోజుల పాటు తనతో బలవంతంగా పని చేయించుకున్నారని, తాను తిరస్కరించడంతో పలు రకాల చిత్రహింసలకు గురి చేశారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కంపెనీవాళ్లు తనను ఓ గదిలో బంధించారని.. అన్నం పెట్టకపోగా.. తీవ్రంగా కొట్టారని, కరెంట్‌ షాక్‌, మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారని వెల్లడించాడు.


తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి దిగడంతో కంపెనీ నిర్వాహకులు, సుమారు రూ. 5 లక్షలు బాకీ పడ్డానంటూ తనపై కేసు పెట్టారని చెప్పాడు. కంబోడియా జైల్లో నెల రోజులు తాను బాతు గుడ్లు, వట్టి చేపలు తిని బతికానని విలపించాడు. కాంబోడియాలో అంతా సైబర్‌ మోసమని.. పలురకాల ట్రేడ్‌ అప్లికేషన్లు, ఏఐలాంటి అధునాతన టెక్నాలజీ సాయంతో ఫొటోలు మార్పింగ్‌ చేస్తూ సైబర్‌ మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకోవడమే వారి పని వివరించాడు. ఇదే తరహా సైబర్‌ మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని ఇటీవలే కేరళ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు ప్రకాశ్‌ గుర్తు చేశాడు. తన మాదిరిగా అక్కడ ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పాడు. అమ్మాయిల పరిస్థితి మరీ దయనీయం అని, పలువురు మహిళలు వివిధ రకాల శారీరక బాధలు అనుభవిస్తున్నారని తెలిపాడు. తనతో పాటు మొత్తం 9 మంది స్వదేశానికి వచ్చారని, అందులో అక్రమ్‌ అనే కరీంనగర్‌కు చెందిన యువకుడు కూడా ఉన్నట్లు ప్రకాశ్‌ చెప్పాడు.

Updated Date - Jul 09 , 2024 | 02:41 AM

Advertising
Advertising
<