ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : లక్ష మాఫీ రేపే!

ABN, Publish Date - Jul 17 , 2024 | 04:41 AM

పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఊహించిన దానికన్నా ముందే ఈ నెల 18 నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. రూ.లక్ష లోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు.

  • తొలి విడతగా రూ.లక్ష వరకు రుణాలకు వర్తింపు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన

  • పాస్‌బుక్‌ ఉన్న ప్రతి రైతు ఖాతాలో

  • కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్‌కార్డు

  • రేషన్‌ కార్డుల్లేని 6.36 లక్షల మందికీ మాఫీ

  • బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేస్తే చర్యలు

  • అర్హులకు ‘ఆరోగ్యశ్రీ’.. ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌

  • నెలలోపు ‘ధరణి’ సమస్యలు పరిష్కరించాలి

  • ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్‌ చేయాలి

  • ఒకే చోట ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు

  • ప్రభుత్వానికి కళ్లు చెవులు కలెక్టర్లే: సీఎం

  • కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో సదస్సు

  • ఉదయం 9.30 నుంచి రాత్రి 7.20 వరకు భేటీ

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఊహించిన దానికన్నా ముందే ఈ నెల 18 నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. రూ.లక్ష లోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. భూమి పట్టాదారు పాస్‌పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల మాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలో 90 లక్షల కార్డులుండగా.. రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. రేషన్‌ కార్డులు లేని 6.36 లక్షల మందికీ రుణాలు ఉన్నాయని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. రేషన్‌ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.

గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని బ్యాంకర్లకు సూచించాలన్నారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేసినందునే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడూ అలాంటి చర్యలే తీసుకుంటామని హెచ్చరించారు.

ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని, అక్కడ ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో సంబరాలను నిర్వహించి, సంతోషాన్ని పంచుకోవాలని సూచించారు. రైతు రుణ మాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు జిల్లాల (ఉమ్మడి జిల్లాల చొప్పున)కు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు.


అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు..

అర్హులందరికీ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డులు అందేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్‌ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్‌ పెట్టొద్దన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందించాలని నిర్దేశించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించారు.

ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం.. రెండు సెషన్లుగా రాత్రి 7.20 గంటల వరకు దాదాపు 10 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం పూట సమావేశంలో మొత్తం కలెక్టర్ల పనితీరు, వారికి దిశా నిర్దేశం చేయడంపైనే సీఎం దృష్టి పెట్టారు. సాయంత్రపు సమావేశంలో కూడా పలు పథకాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్‌ సీజన్‌ వ్యవసాయం, ప్రజారోగ్యం-సీజనల్‌ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతిభద్రతలు, డ్రగ్స్‌ నియంత్రణపై చర్చ జరిగింది. తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కలెక్టర్ల సదస్సును ప్రారంభించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభోపన్యాసం చేశారు.

అనంతరం కలెక్టర్లను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. మీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వాములైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలి. మాజీ ఐఏఎ్‌సలు ఒక శంకరన్‌, ఒక శ్రీధరన్‌లా సామాన్యులు గుర్తు పెట్టుకునేలా పని చేయాలి. ఏసీ గదులకు పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తీ ఉండదు. క్షేత్ర స్థాయికి వెళ్లి, ప్రజల ఆలోచనలు ఏమిటో తెలుసుకోండి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. మీ ప్రతి చర్యా... ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలి. పారదర్శక, ప్రజాహిత పాలనను అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉంది’’ అని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.


ఆరు గ్యారెంటీల అమలు బాధ్యత కలెక్టర్లదే..

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలైన ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.85 వేలు ఖర్చు పెడుతోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలకమైన విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే... విద్యార్థులు ఆ టీచర్ల పట్ల సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు.. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితనం ఉండాలి’’ అని సీఎం అన్నారు. పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమర్థులైన యువ కలెక్టర్లను నియమించామని, రాజకీయ ఒత్తిళ్లు, రాగద్వేషాలు లేకుండా కలెక్టర్ల బదిలీలు చేపట్టామని తెలిపారు. ఐఏఎస్‌ అధికారుల సర్వీసులో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమని పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతోపాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్‌ అధికారులు ఇక్కడి భాషతోపాటు తెలంగాణ సంస్కృతిలో కూడా భాగస్వాములు కావాలని సూచించారు.

మహిళా గ్రూపుల్లో సభ్యులను చేర్చేందుకు స్పెషల్‌ డ్ర్తెవ్‌..

మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్‌ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మంది సభ్యులుగా చేరేలా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని, ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలని చెప్పారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కలెక్టర్లు కాపాడాలని సీఎం అన్నారు. అవసరమైతే వాటికి జియో ట్యాగింగ్‌ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసి నిఘా ఉంచాలన్నారు.

15లోగా ‘ధరణి’ సమస్యలకు పరిష్కారం

ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కాగా, ‘‘ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. కొత్తగా 1,15,308 దరఖాస్తులు వచ్చాయి’’ అని అధికారులు వివరించారు. దీంతో.. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాన్ని కూడా తప్పకుండా నమోదు చేసేలా చూడాలని సీఎం అన్నారు. పెండింగ్‌ దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని ఆదేశించారు.

Updated Date - Jul 17 , 2024 | 04:41 AM

Advertising
Advertising
<