Hyderabad: చాక్లెట్ ఆశ చూపి.. చిన్నారి అపహరణ..
ABN, Publish Date - Aug 05 , 2024 | 05:21 AM
హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో అపహరణకు గురైన ఆరేళ్ల చిన్నారిని పోలీసులు 18 గంటల్లోనే రక్షించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్‌ను అరెస్టు చేశారు.
18 గంటల్లోనే పాపను రక్షించిన పోలీసులు
నిందితుడు బిహార్ రాష్ట్రానికి చెందిన అన్సారీ
డబ్బుకోసం పాపను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ
గతంలో పలు కేసుల్లో జైలుకెళ్లిన నిందితుడు
మంగళ్‌హాట్/హైదరాబాద్ సిటీ/కొత్తూర్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో అపహరణకు గురైన ఆరేళ్ల చిన్నారిని పోలీసులు 18 గంటల్లోనే రక్షించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని బిహార్‌కు చెందిన మహ్మద్ బిలాల్ అన్సారీ (32)గా గుర్తించిన పోలీసులు.. డబ్బుకోసమే పాపను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్‌జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వివరాలు వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన పి.ప్రియాంక, పి.భీమా బాయ్ దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. బేగంబజార్ ఛత్రీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ప్రగతి(6)తో పాటు ఒక బాబు ఉన్నాడు. ప్రగతి స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ప్రియాంక సోదరి ఆబిడ్స్ పరిధిలోని కట్టెల మండి ప్రాంతంలో ఉంటున్నారు.
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రియాంక తన కూతురు ప్రగతితో కలిసి కట్టెలమండిలోని సోదరి ఇంటికి వెళ్లింది. అక్కడ ప్రగతి తన పిన్ని కొడుకు వృత్తిక్ (4)తో కలిసి ఆడుకోవడానికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత వృత్తిక్ ఇంటికి రాగా.. ప్రగతి రాలేదు. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో ప్రియాంక 4 గంటలకు ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు. కట్టెలమండిలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. పాపను కొత్తూర్ సమీపంలోని ఇన్ముల్ నర్వ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు గుర్తించారు.
అక్కడి కన్‌స్ట్రక్షన్ క్యాంప్ వద్ద రాత్రంతా ఉంచి, ఆదివారం ఉదయం పాపను తీసుకొని బస్టాప్ వద్దకు వస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ప్రగతికి చాక్లెట్‌తో పాటు సైకిల్ ఇప్పిస్తానని ఆశ చూపించి కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని డీసీపీ తెలిపారు. పాప తండ్రికి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పాడన్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం భరోసా సెంటర్‌కు పంపినట్లు డీసీపీ చెప్పారు.
అన్సారీ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఫుట్‌పాత్‌లపై ఉంటూ కూలి పని చేసుకుంటున్నాడు. అతనిపై బిహార్‌లో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 11 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసులో 14 నెలలు, బైక్ చోరీ కేసులో 9 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఇటీవల సైబరాబాద్ పరిధిలోని కొత్తూర్‌లో 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడి తప్పించుకొని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పోలీసుల మోస్ట్‌వాంటెడ్ జాబితాలో అన్సారీ ఉన్నట్లు చెప్పారు.
Updated Date - Aug 05 , 2024 | 05:21 AM