Hyderabad: వియ్ వాంట్ మెట్రో.. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్
ABN, Publish Date - Nov 13 , 2024 | 11:34 AM
నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసిన మెట్రోరైళ్లు.. మాకూ కావాలంటూ ఆయా ప్రాంతాల్లో డిమాండ్లు అధికమవుతున్నాయి. ట్రాఫిక్ చిక్కులను తప్పించి వేగంగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత వృద్ధి చెందుతాయని ఆయా ప్రాంతాల వారు ఆశిస్తున్నారు.
- మేడ్చల్ మెట్రోసాధన సమితి పేరుతో ఉద్యమం
- నగరం చుట్టుపక్కల ప్రాంతాలకూ మెట్రో కావాలని వినతులు
- ప్రస్తుతం మూడు కారిడార్లలోనే రైళ్ల రాకపోకలు
- రద్దీ అధికమవుతున్నా పట్టింపులేని సంస్థ
- రెండేళ్లు గడిచినా పత్తాలేని అదనపు కోచ్‌లు
‘మా ప్రాంతానికి మెట్రో నడిపించండి.. మెట్రో వస్తే ట్రాఫిక్ రంది పోతుంది’ ఇది నగరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్. త్వరగా గమ్యస్థానాలను చేర్చే మెట్రో రైలు(Metro train) సౌకర్యం కల్పించాలంటూ ప్రధానంగా నగర ఉత్తరభాగంలో డిమాండ్ రోజురోజుకూ అధికమవుతోంది. ఇందుకోసం మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించి వివిధ రూపాల్లో తమ ఆకాంక్షను ప్రభుత్వ పెద్దలకు తెలియజేయస్తున్నారు. మెట్రో నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు సహకరిస్తామని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం మూడు కారిడార్లలో నడుస్తున్న మెట్రో రైళ్లలో ప్రయాణించడం కనా కష్టమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా అదనపు కోచ్‌ల గురించి సంస్థ పట్టించుకున్న పాపానపోవడం లేదు.
ఈ వార్తను కూడా చదవండి: నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
హైదరాబాద్ సిటీ: నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసిన మెట్రోరైళ్లు.. మాకూ కావాలంటూ ఆయా ప్రాంతాల్లో డిమాండ్లు అధికమవుతున్నాయి. ట్రాఫిక్ చిక్కులను తప్పించి వేగంగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత వృద్ధి చెందుతాయని ఆయా ప్రాంతాల వారు ఆశిస్తున్నారు. గ్రేటర్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నార్త్‌సిటీ (మేడ్చల్ మార్గంలో)కి మెట్రోను నడిపించాలని స్థానికులు కొంతకాలంగా గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు మేడ్చల్ మెట్రోసాధన సమితి పేరుతో కొద్దిరోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్నారు. పలురూపాల్లో తమ డిమాండ్‌ను తెలియజేయడంతోపాటు ఆయా పార్టీల నేతలకు వినతిపత్రాలను అందజేస్తున్నారు.
రెండోదశకు అంకురార్పణ
నగరంలో రెండోదశ మెట్రోరైలు విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది. ప్రతిపాదిత 5 కారిడార్లకు ఇటీవల రూ.24,269 కోట్లు మంజూరు చేయడంతోపాటు పరిపాలన అనుమతుల కోసం ఈనెల 4న మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ (ఎంఏయూడీ) ద్వారా జీవో జారీ చేసింది. రాష్ట్ర క్యాబినెట్‌లో ఆమోదించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను కేంద్రానికి నివేదించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఉత్తరప్రాంత వాసులు తమకు మెట్రోరైలు కలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. నార్త్ సిటీ మెట్రో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ముందు మొదటిదశలోని మూడు కారిడార్లలో కోచ్‌లు పెంచితే మరింతమందికి మెట్రో రవాణా సౌకర్యం లభించనుంది.
25వేల మందితో సంతకాల సేకరణ
నార్త్‌సిటీలో భాగమైన బోయిన్‌పల్లి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, కొంపల్లి, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి, సూరారం తదితర ప్రాంతాల వాసులు మెట్రోరైలును సాధించేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు. మేడ్చల్ మెట్రోసాధన సమితి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. శాంతియుత నిరాహారదీక్షలతోపాటు అధికార కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్మేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వానికి తమ ఆకాంక్షను తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో సంతకాల సేకరణ కూడా చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన 25వేల మందితో సంతకాల సేకరణ చేసిన లేఖలను ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్‌రెడ్డికి పంపించేందుకు సిద్ధమయ్యారు.
మెట్రోరైలు వస్తే ప్రతిరోజు దాదాపు 30 లక్షల మందికి మెరుగైన రవాణా అందడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అంతేకాదు, మెట్రో నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు తమవంతు సహకారం అందిస్తామని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. మెట్రో రెండోదశ డీపీఆర్ పూర్తయిన నేపథ్యంలో..మూడోదశ విస్తరణ కింద తమ ప్రతిపాదనలను వెంటనే పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.
నార్త్‌సిటీలో ప్రతిపాదిత కారిడార్లు
- ప్యారడైజ్-తాడ్‌బండ్-బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్-మిలటరీ డెయిరీఫామ్ రోడ్డు-కొంపల్లి-మేడ్చల్: 22 కిలోమీటర్లు (ఇందులో ప్యారడైజ్ నుంచి మిలటరీ డెయిరీఫామ్ రోడ్డు వరకు 5.50 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ కారిడార్, తర్వాత డెయిరీఫామ్ రోడ్డు నుంచి మేడ్చల్ వరకు సాధారణ మెట్రో కారిడార్).
- జేబీఎస్-శామీర్‌పేట-తూంకుంట : 19 కిలోమీటర్లు
- తార్నాక-ఈసీఐఎల్-నాగారం-కీసర : 20 కిలోమీటర్లు
- బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్-మూసాపేట వై జంక్షన్-బాలానగర్-సూరారం-గండిమైసమ్మ: 21 కిలోమీటర్లు
- అంచనా వ్యయం: రూ.22,960 కోట్లు
తగినన్ని కోచ్‌లు లేక లక్ష్యానికి దూరం
మెట్రో ప్రయాణానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ నిర్వహణ విషయంలో ఎల్‌అండ్‌టీ, మెట్రో అధికారులు శ్రద్ధ చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీకి తగినట్లు అదనపు కోచ్‌లను పెంచడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య బోగీల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. ప్రస్తుతం నడుస్తున్న 57 రైళ్లలో 171 కోచ్‌లకు అదనంగా నాగ్‌పూర్ నుంచి మరో 40 నుంచి 50 కోచ్‌లను తెస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా అతీగతి లేదు. మెట్రోరైల్ ప్రారంభ సమయంలో రోజుకు 16 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పిస్తామని కేంద్రానికి తెలియజేసిన అధికారులు.. కనీసం నిత్యం 5 లక్షల ప్యాసింజర్ మార్కును కూడా దాటించలేకపోతున్నారు. ఇందుకు తగినన్నీ కోచ్‌లు లేకపోవడమేనని రవాణా రంగ నిపుణులు అంటున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం
ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 13 , 2024 | 11:34 AM