YouTuber Harsha: రెచ్చిపోయిన యూట్యూబర్ హర్ష.. రంగంలోకి పోలీసులు
ABN, Publish Date - Aug 23 , 2024 | 10:46 AM
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి యూట్యూబర్లు పైత్యం చూపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిగా రీల్స్ చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి వారు మాత్రం చెలరేగిపోతున్నారు. తాజాగా యూట్యూబర్ హర్ష అనే వ్యక్తి తన రీల్స్ కోసం మరింతగా రెచ్చిపోయాడు.
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి యూట్యూబర్లు పైత్యం చూపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిగా రీల్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి వారు మాత్రం చెలరేగిపోతున్నారు. తాజాగా యూట్యూబర్ హర్ష అనే వ్యక్తి తన రీల్స్ కోసం మరింతగా రెచ్చిపోయాడు. తను అనుకున్నదే తడవుగా సోషల్ మీడియాలో రీల్స్ కోసం తెగించాడు. ఇదివరకు కూడా అతను ఇలాగే చేశాడు. కూకట్‌పల్లిలో నిన్న(గురువారం) డబ్బులను గాల్లోకి ఎగిరేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అతను డబ్బులను గాల్లోకి ఎగురవేయడంతో అక్కడున్న కొంతమంది ఆ పైసలను తీసుకోవడానికి అత్యుత్సాహం చూపించారు. ఇలా చేయడం వల్ల రోడ్లపై వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతను తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ విషయం సైబరాబాద్ పోలీసుల దృష్టికి రావడంతో రంగలోకి దిగి అతనిపై చర్యలకు ఉపక్రమించారు. ఇదే కాకుండా పలువురు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వారితో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలా చేసే యూట్యూబర్ల వింత చేష్టలు కొంతమేర తగ్గుతాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే, యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్‌లలో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హర్షపై సనత్‌నగర్‌లో ట్రాఫిక్ పోలీసులు ఓ కేసు, KPHB పోలీస్ స్టేషన్‌లో సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కాగా, ‘నేను టెలిగ్రామ్‌లో గంటకు వేల రూపాయలు సంపాదిస్తున్నా. మీరు కూడా జాయిన్ అవ్వండి’ అంటూ సోషల్ మీడియాలో హర్ష వీడియోలు పెట్టాడు. అతని యూట్యూబ్ అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు కూడా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయని పోలీసులు గుర్తించి అతనిపై చర్యలు చేపట్టారు.
Updated Date - Aug 23 , 2024 | 11:04 AM