Telangana: ట్రాఫిక్ విభాగంపై ప్రత్యేక దృష్టి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
ABN, Publish Date - Jan 31 , 2024 | 04:45 PM
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని.. మూడు నెలల్లోగా ఈ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించి ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లుసమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలి. ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలి. సరిపడా సంఖ్యలో సిబ్బంది ఉండేలా స్టేషన్లను పునర్వ్యవస్థీకరించాలి. సిటీలో రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలి. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్ లలో ఎల్బీనగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలి. ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకుండా ట్రాఫిక్ సిబ్బంది అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
- ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
నగరంలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నారు సీఎం రేవంత్. అందుకు అవసరమైన ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. కన్సలెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలని కోరారు. నెలకోసారి సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించాలని రేవంత్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 31 , 2024 | 04:46 PM