Telangana: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
ABN, Publish Date - Oct 17 , 2024 | 05:16 PM
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేశారు. అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు..
హైదరాబాద్, అక్టోబర్ 17: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేశారు. అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మూసీ సుందరీకరణ అంశంపై వివాదం మరింత చెలరేగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం మీడియా ముందుకు వచ్చారు. మూసీ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశించే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందన్నారు. 33 బృందాలు మూసీ పరివాహకంపై అధ్యయనం చేశాయని సీఎం తెలిపారు. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటి వారికి మెరుగైన జీవితం అందించాలని భావిస్తున్నామన్నారు.
విద్యావంతుల నుంచి నిరక్ష్యరాస్యుల వరకు అందరికీ హైదరాబాద్ ఉపాధి కల్పించాలన్నారు సీఎం. గత ప్రధానులు పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి చేశారని.. గత ప్రధానులు సంస్కరణలు తెచ్చిన ప్రతిసారీ కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిందని సీఎం గుర్తు చేశారు. 10 నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసీపై పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్లు ఎప్పుడూ ఉంటారని అన్నారు.
విషవలయంలో పేదలు ఉండాలనేది కొందరి ఆలోచన అంటూ విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్. భూగరిష్ట పరిమితి చట్టాన్ని వ్యతిరేకించిన వర్గం కూడా దేశంలో ఉండేదన్నారు. పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలని దొరలు, భూస్వాములు భావిస్తారన్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు రాష్ట్రాన్ని దోచుకున్నారని సీఎం ఆరోపించారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమం అని చెప్పారాయన. కొందరి మెదడులో మూసీలో ఉన్న మురికి కంటే.. ఎక్కువ విషం నింపుకున్నారంటూ విపక్ష నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విషపూరిత ఆలోచనలతోనే మూసీ ప్రాజెక్ట్‌పై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.
మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా సీఎం పేర్కొన్నారు. మల్లన్నసాగర్, వేములఘాట్‌లో ఏం జరిగిందో గుర్తుతెచ్చుకోవాలన్నారు. రాత్రికి రాత్రే పోలీసులతో కొట్టించి, గుర్రాలతో తొక్కించి.. తాము పేదలను ఖాళీ చేయించటం లేదని సీఎం తెలిపారు. రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మ.. ఇలా ఎక్కడికైనా తాను వస్తానని సీఎం రేవంత్ అన్నారు. మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి.. మెరుగైన జీవితం ఇవ్వాలనే ఈ ప్రాజెక్ట్ తలపెట్టామన్నారు.
ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
ఇదే సమయంలో ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, కిష్టాపూర్ ఎక్కడికైనా.. సెక్యూరిటీ లేకుండా తానువ స్తానని అన్నారు. విపక్ష నేతలు కూడా రావాలని సవాల్ విసిరారు. అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే తమ ఆలోచనగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. మూసీ బాధితులను ఆదుకోవడం కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ నరకకూపంగా మారిందన్నారు. మురికి కూపం నుంచి పేదలను కాపాడాలనేదే తమ యోచనగా పేర్కొన్నారు. మూసీ 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. సర్వమతాలకు ప్రతీక మూసీ నది అని చెప్పుకొచ్చారు సీఎం. వేల సంవత్సరాలుగా నదుల పక్కనే నాగరికత పెరిగిందన్నారు.
నదుల పక్కన ఉన్న నగరాల్లోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని సీఎం పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం కోసం 5 కన్సల్టెన్సీ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఈ కన్సల్టెన్సీ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్నది కేవలం రూ.141 కోట్లు మాత్రమేనని సీఎం చెప్పారు. రూ.141 కోట్ల ఒప్పందాన్ని రూ. లక్షన్నర కోట్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నో సమస్యలు.. ఎన్నో వెతలు..
విషతుల్యమైన మూసీ జలాలలతో నల్లగొండ ప్రజలు ఎంతో బాధపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ జలాలతో పండిన పంటలు ప్రమాదకరమని నిపుణుల నివేదికలు చెబుతున్నాయన్నారు. చెరువులు, నాలాలు ఇప్పటికే కబ్జాకు గురై ముంపు సమస్య పెరిగిందన్నారు. ఇటీవల వరదల్లో ముంబై, బెంగళూరు, చెన్నై, విజయవాడలో ఏం జరిగిందో చూశారని గుర్తు చేశారు. చినుకుపడితే చాలు.. హైదరాబాద్‌లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు. ‘రోడ్లపై పడిన వర్షపునీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా?.. అలాగే రోడ్లపై ఉండాలా? అని సీఎం ప్రశ్నించారు. వరదలు వచ్చి ట్రాఫిక్‌జామ్ అయినప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టడం లేదా? వరదలు వచ్చి నగరం మునిగిపోతే అప్పటికప్పుడు ఏమైనా చేయగలుగుతామా? హైదరాబాద్ సర్వనాశనమై పోతుంటే రాజకీయాలే ముఖ్యమా? మూసీ పునరుజ్జీవనంపై అపోహలు సృష్టిస్తున్నారు మూసీ సుందరీకరణ కాదు.. పునరుజ్జీవనం ప్రాజెక్ట్. సుందరీకరణ అనే పదం ఎక్కడి నుంచి తెచ్చారు..’ అంటూ విపక్ష నేతల తీరుపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.
అలా చేస్తే ఆ ప్రాజెక్టును ఆపేస్తా..
‘మల్లన్నసాగర్, కొండపోచమ్మ వద్దని ప్రజలు అడ్డుకోలేదా? ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి ప్రాజెక్టులు నిర్మించ లేదా? మూసీ సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ అనలేదా? అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు మూసీ ఒడ్డున జీవించాలి. కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల మూడునెలలపాటు మూసీ ఒడ్డున ఉండాలి. వాళ్లు ఉంటానంటే కావాల్సిన వసతులు అన్నీ కల్పిస్తాం. కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల 3 నెలలు అక్కడ ఉంటే.. ఈ ప్రాజెక్టును ఆపేస్తాను’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Also Read:
పొన్నవోలుకు ఏబీఎన్ ప్రతినిధి షాక్
రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్
అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన
For More Telangana News and Telugu News..
Updated Date - Oct 17 , 2024 | 05:45 PM