TG GOVT: వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ABN, Publish Date - Nov 17 , 2024 | 11:25 AM
మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్‌రెడ్డి మాటిచ్చారని.. చెప్పినట్లుగానే ఆయన మాటను నిలబెట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు.
కరీంనగర్: మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. 4,696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన వేములవాడలో.. సీఎం రేవంత్ పర్యటనకు ముందే ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డికి ముంపు గ్రామాల తరపున ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్వాసితులు అనేక ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే. ABN ఆంధ్రజ్యోతిలో నిర్వాసితుల కష్టాలపై వరుసగా కథనాలు ప్రసారం చేసింది. మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
మిడ్ మానేరు నిర్వాసితులకు హామీ...
కాగా.. గతంలో టీపీసీసీ చీఫ్‌గా (TPCC chief) రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో మిడ్ మానేరు (Mid Maneru) నిర్వాసితులకు అండగా ఉంటామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చారని.. చెప్పినట్లుగానే రేవంత్‌రెడ్డి మాటను నిలబెట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పరిహారం కోసం వేములవాడలో ధర్నా చేస్తున్న మిడ్ మానేరు నిర్వాసితులపై గతంలో దుర్మార్గంగా ప్రవర్తించారని గుర్తుచేసుకున్నారు.
ఈ నెల20న వేములవాడకు సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో నవంబర్ 20వ తేదీన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం సందర్శించే చైర్మన్ గెస్ట్ హౌస్ ,శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సమావేశం జరిగే హల్లో విద్యుత్ ఇబ్బందులు అదేవిధంగా మైక్ సౌండ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలపై ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Updated Date - Nov 17 , 2024 | 11:29 AM