Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

ABN, Publish Date - Jul 19 , 2024 | 12:25 PM

Telangana Crop Loan Waiver: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జులై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది.

Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..
Telangana

Telangana Crop Loan Waiver: తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ రుణాలు మాఫీ అయ్యాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనంద క్షణాల్లోనే రైతులను టార్గెట్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అమాయక రైతులను నిలువునా ముంచేందుకు సిద్ధమయ్యారు కేటుగాళ్లు. అందుకే అలర్ట్‌గా ఉండాలంటూ తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర పోలీసులు కీలక సూచనలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం జులై 18న రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే, రుణ మాఫీకి సంబంధించి రైతులు సంతోషంగా ఉండగా.. ఇదే ఛాన్స్‌గా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రైతుల అమాయకత్వాన్ని, ఆశను ఆసరాగా చేసుకుని.. వారి డబ్బులను కాజేసే కుట్రకు తెరలేపారు దుర్మార్గులు. రుణాలు మాఫీ కావాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయాలంటూ బ్యాంకుల ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని సందేశాలు పంపిస్తున్నారు. తద్వారా వారి ఖాతాల్లోని డబ్బులను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు.


రైతులకు అలర్ట్..

రుణమాఫీ నేపథ్యంలో రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉందని గుర్తించిన పోలీసులు.. రైతులను అలర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నిందితులు రైతులను టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున.. వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్, టెక్ట్స్ మెసేజ్‌లలో బ్యాంక్ లోగోతో లింక్స్ పంపిస్తున్నారు. ఈ APK లింక్స్‌పై క్లిక్ చేస్తేనే రుణమాఫీ అవుతుందంటూ నమ్మబలుకుతున్నారు. అయితే, ఈ లింక్స్‌ను అస్సలు క్లిక్ చేయొద్దని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు.


పోలీసుల ప్రకటన..

‘రుణమాఫీపై ఫేక్ లింక్‌లు, మెసేజ్‌లు వస్తుంటాయి. బ్యాంకుల లోగోలు పెట్టుకుని మరీ కొందరు కాల్స్, మెసేజెస్ చేస్తుంటారు. వాటిని రైతులెవరూ నమ్మవొద్దు. ఒకవేళ రైతులు ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీ ఖాతాల్లోంచి డబ్బులు మాయం అవుతాయి. రుణమాఫీ పేరుతో ఎవరు మెసేజ్ చేసినా.. కాల్ చేసి వివరాలు అడిగినా చెప్పొద్దు’ అని రైతులకు పోలీసులు స్పష్టం చేశారు.


మోసపోతే వెంటనే ఈ పని చేయండి..

కొందరు తెలియక సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్ క్లిక్ చేయడం గానీ.. బ్యాంక్ అధికారులని భావించి తమ ఖాతా వివరాలు చెప్పడం గానీ చేస్తారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరస్తులు బాధితుల అకౌంట్లను హ్యాక్ చేసి అందులోని డబ్బును దోచేస్తారు. ఎవరైనా రైతులు ఇలా మోసపోతే.. వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 1930 కి కాల్ చేయాలని, లేదంటే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. cybercrime.gov.inలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చని రైతులకు, ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 19 , 2024 | 12:42 PM

Advertising
Advertising
<