Hyderabad: తన ఇంటిపై వస్తున్న ఆరోపణలను ఖండించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..
ABN, Publish Date - Nov 24 , 2024 | 09:15 PM
నగరంలోని కృష్ణకాంత్ పార్కు ప్రాంతంలో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. బఫర్ జోన్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
హైదరాబాద్: నగరంలోని కృష్ణకాంత్ పార్కు ప్రాంతంలో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. బఫర్ జోన్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. 1980వ సంవత్సరంలో తన తండ్రి ఏపీవీ సుబ్బయ్య ఆ ఇంటిని నిర్మించారని రంగనాథ్ తెలిపారు. తన తండ్రి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ ఇంట్లోనే తాము ఇప్పటికీ ఉంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తమ నివాసం ఎటువంటి బఫర్ జోన్‌లోకి రాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం కృష్ణాకాంత్ పార్కుగా ఉన్న స్థలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం పెద్దచెరువు ఉండేదని, చెరువు ఉన్నప్పుడే తాము నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించామని రంగనాథ్ వెల్లడించారు. కృష్ణకాంత్ పార్కు దిగువున ఉన్న వేలాది ఇళ్ల తర్వాత తన ఇల్లు ఉందని ఆయన వెల్లడించారు. తమ ఇంటిపై సామాజిక మాధ్యమాలు, పేపర్లలో వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కమిషనర్ చెప్పుకొచ్చారు. ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. చెరువుకట్టకు దిగువున 10 మీటర్లు దాటితే కిందన ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. అయినప్పటికీ కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో తమ నివాసం ఉందని ఆయన చెప్పారు.
వాస్తవాలు కప్పిపుచ్చి కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా చెరువుకట్ట మీద, కట్టను ఆనుకుని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. తాము నివాసం ఉంటున్న ఇంటికి కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉందని రంగనాథ్ చెప్పారు. ఎక్కడైనా చెరువుకట్ట ఎత్తుపై ఆధారపడి దిగువ భాగంలో 5నుంచి10 మీటర్ల వరకూ ఉన్న స్థలాన్ని బఫర్ జోన్‌గా ఇరిగేషన్ శాఖ పరిగణిస్తుందని చెప్పారు. 25 ఏళ్ల క్రితమే కృష్ణకాంత్ పార్కుగా మారిన పెద్దచెరువుకి, తమ నివాసానికి కిలోమీటర్ దూరం ఉందని వెల్లడించారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదన్న వాస్తవాన్ని ప్రజలందరూ గ్రహించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తన ఇంటికి సంబంధించిన చిత్రాలను మీడియాకు రంగనాథ్ చూపించారు.
Updated Date - Nov 24 , 2024 | 09:16 PM