Hyderabad: టాలీవుడ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు.. కీలక వ్యాఖ్యలు చేసిన జానీ మాస్టర్..
ABN, Publish Date - Dec 09 , 2024 | 06:01 PM
టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తేల్చి చెప్పారు. తన కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ నుంచి ఓ అద్భుతమైన పాట రాబోతుందని, అది అందరికీ కచ్చితంగా నచ్చుతుందని జానీ మాస్టర్ చెప్పారు.
హైదరాబాద్: టాలీవుడ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ యూనియన్ నుంచి తనను తొలగించినట్టు వస్తున్న వార్తలపై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. తనను ఎవరూ తీసివేయలేరని ఆయన తేల్చి చెప్పారు. నిన్నటి నుంచి తనను తొలగించినట్లు మీడియాలో పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిర్ధారణ కాని లైంగిక ఆరోపణలను కారణంగా చూపిస్తూ శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రచారం చేయడంపై జానీ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా తన పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని జానీ చెప్పారు.
గేమ్ ఛేంజర్ నుంచి న్యూసాంగ్..
టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరని జానీ మాస్టర్ తేల్చి చెప్పారు. తన కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ నుంచి ఓ అద్భుతమైన పాట రాబోతుందని, అది అందరికీ కచ్చితంగా నచ్చుతుందని జానీ మాస్టర్ చెప్పారు. కాగా, జానీని కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారనే వార్త ఆదివారం నుంచి గుప్పుమంది. ప్రస్తుతం టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌కు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే జానీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆదివారం రోజు ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్‌ను ప్రకటించారు. దీనిపై స్పందిస్తూ ఆ వార్తలన్నీ పుకార్లే అని చెప్పారు జానీ మాస్టర్. ఇంకా తాను ఆ అసోసియేషన్‌లో మెంబర్‌గానే ఉన్నట్లు తెలిపారు. తాను 2023 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, తన మెంబర్ షిప్‌ను ఎవ్వరూ తొలగించలేరని ధీమా వ్యక్తం చేశారు.
అందుకే కుట్ర..
ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. శంకర్‌పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 9 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కొనుగోలు సమయంలో పలువురు కోట్ల రూపాయలు స్కామ్ చేశారని సమాచారం ఉంది. స్కామ్ మొత్తం బయటకు తీస్తునందుకే నాపై ఆరోపణలు వచ్చాయి. డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలోనూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే నాపై కుట్ర జరిగింది. దీనిపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా" అని చెప్పారు.
న్యాయ పోరాటం..
కాగా, అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ను కొన్ని రోజుల కింద గోవాలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి ఆయన ఇటీవల విడుదల అయ్యారు. 36 రోజులపాటు జానీ జైలులో ఉండగా.. అదే సమయంలో ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు సైతం క్యాన్సిల్ అయ్యింది. ఇప్పటికే తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై జానీ మాస్టర్ న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే కొరియోగ్రాఫర్ అసోసియేషన్ తాజాగా ఎన్నికలు నిర్వహించడంతో మరోసారి జానీ మాస్టర్‌కు షాక్ తగిలినట్లు అయ్యింది.
Updated Date - Dec 09 , 2024 | 06:02 PM