Ganesh Immersion: శోభాయాత్రకు రెడీ.. రూట్ మ్యాప్ ఇదే..
ABN , Publish Date - Sep 15 , 2024 | 09:17 AM
Ganesh Immersion in Hyderabad: వినాయక నవరాత్రోత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనానికి ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంటున్నాయి. విగ్రహాల ఊరేగింపు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర వైద్యసేవలు..
అటు బాలాపూర్.. ఇటు ఖైరతాబాద్
7 మార్గాల్లో విగ్రహాల తరలింపు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
18 కీలక జంక్షన్ల వద్ద పారామిలటరీ బలగాలు
సీసీ కెమెరాల నిఘా.. అనుక్షణం పర్యవేక్షణ
రూట్‌మ్యాప్ విడుదల చేసిన నగర సీపీ ఆనంద్
Ganesh Immersion in Hyderabad: వినాయక నవరాత్రోత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనానికి ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంటున్నాయి. విగ్రహాల ఊరేగింపు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర వైద్యసేవలు.. ఇలా కీలక విభాగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈనెల 17న జరిగే గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ సహా నగరంలోని విగ్రహాల శోభాయాత్ర, ప్రధాన ఊరేగింపు, నిమజ్జనం రూట్‌మ్యాప్‌ను సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం విడుదల చేశారు. అత్యంత ప్రధానమైన బాలాపూర్ గణేశ్ విగ్రహం మొదలుకొని హుస్సేన్‌సాగర్ వరకు 19 కిలోమీటర్ల మేర సాగే శోభాయాత్ర వివరాలను సీపీ వెల్లడించారు. బాలాపూర్ గణనాథుడు గుర్రం చెరువు కట్టమైసమ్మ వద్ద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందని, అక్కడి నుంచి 18 ముఖ్యమైన జంక్షన్ల మీదుగా వెళ్లే ప్రాంతాల్లో పోలీస్, పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నట్టు పేర్కొన్నారు. చార్మినార్, తెలుగుతల్లి వంతెన సమీపంలోని ఊరేగింపు మార్గాలను పరిశీలించి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు ఆధారంగా పలు సూచనలు చేశామని చెప్పారు.
👉 బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర బాలాపూర్ నుంచి కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఎంబీఎన్‌ఆర్ ఎక్స్‌రోడ్డు, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, నాగుల్‌చింత, చార్మినార్ అఫ్జల్ బగూర్జాల్, ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్, అంబేడ్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్డు వరకు సాగుతుంది.
👉 సౌత్ జోన్ (రూట్ నం-2) హుస్సేనీఆలం, బహదూర్‌పురా మీదుగా..
👉 ఈస్ట్ జోన్ (రూట్ నంబర్-3) శోభాయాత్ర రామంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, చిలకలగూడ ఎక్స్‌రోడ్డు, కాచిగూడ, ఇస్మాయిబజార్ మీదుగా.
👉 సౌత్ వెస్ట్ (రూట్ నంబర్-4) శోభాయాత్ర ధూల్‌పేట, టప్పాచబుత్రా, రేతిబౌలి మీదుగా.
👉 వెస్ట్‌జోన్ (రూట్ నంబర్-5) శోభాయాత్ర ఎర్రగడ్డ, బల్కంపేట, యూసఫ్‌గూడ, ఎన్టీఆర్ భవన్, అగ్రసేన్ జంక్షన్ మీదుగా హుస్సేన్‌సాగర్ చేరుతుంది.
👉 నార్త్‌జోన్ (రూట్ నంబర్-6) శోభాయాత్ర గణేశ్ టెంపుల్ సికింద్రాబాద్ (వైఎంసీఏ), బేగంపేట మీదుగా..
👉 (రూట్-7) ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర సాగుతుంది.
ఉదయం 6:30కి మహాగణపతి పూజ పూర్తి.
ఖైరతాబాద్ మహాగణపతి పూజా కార్యక్రమాలను ఉదయం 6:30 గంటల్లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని సీపీ ఆనంద్ వెల్లడించారు. ఇందుకు ఉత్సవ కమిటీ సభ్యులు అంగీకరించారన్నారు. బడా గణపతి శోభాయాత్ర, నిమజ్జనం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్‌కు రానుండడంతో మహిళలు, చిన్నారులకు అసౌకర్యం కలుగకుండా షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉంటారని సీపీ పేర్కొన్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు, యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ రంగంలోకి దింపామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఐటీ సెల్ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా భద్రత, బందోబస్తును అనుక్షణం పర్యవే క్షిస్తారని చెప్పారు.
ట్రాఫిక్ మళ్లింపు..
నిమజ్జనం సందర్భంగా 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులకు ప్రత్నామ్నాయ మార్గాలు సూచించామని, కొన్ని జంక్షన్లలో బస్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు.
నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు : ఆమ్రపాలి
17న జరిగే గణేష్ నిమజ్జనాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. శోభాయాత్ర నుంచి నిమజ్జనం చేసే ప్రదేశం వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మండపం నుంచి నిమజ్జనం జరిగే కొలనులు, చెరువుల వరకు భక్తులకు సమస్యలు లేకుండా రహదారి మరమ్మతులు, స్ర్టీట్‌లైట్, ట్రీ ట్యూనింగ్ చర్యలు చేపట్టేందుకు పోలీస్, డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లు కమిటీగా ఏర్పడ్డారని, మండపం నిర్వాహకుల సూచన మేరకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నారని కమిషనర్ వివరించారు.
బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న డీజీపీ..
వినాయక నిమజ్జనంలో అత్యంత కీలకమైన బాలపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీగా పోలీసులను మోహరిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కలెక్టర్ అనుదీప్, అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్, పలువురు డీసీపీలతో కలిసి డీజీపీ బాలాపూర్ గణపతిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 19 కిలోమీటర్లు సాగే శోభాయాత్ర రూట్‌మ్యా్‌పను పరిశీలించారు.
73 కొలనులు
👉 27 బేబీ పాండ్స్
👉 24 పోర్టబుల్ పాండ్స్
👉 22 ఎస్కలేటర్ పాండ్స్
5 పెద్ద చెరువులు
👉 సరూర్‌నగర్, కాప్రా, బహదూర్‌పుర, మీరాలం, జీడిమెట్ల ఫాక్స్ సాగర్
బల్దియా ఏర్పాట్లు ఇలా..
👉 రోడ్డు పనులు 172
👉 ట్రాన్స్‌పోర్ట్ క్రేన్లు 36
👉 స్టాటిక్ క్రేన్లు140
👉 మొబైల్ క్రేన్లు 295
👉 గణేశ్ టీమ్స్ 160
👉 జేసీబీలు 125
👉 మొబైల్ టాయిలెట్లు 308
👉 తాత్కాలిక వీధిదీపాలు 52,270
👉 ఫ్లడ్‌లైట్లు 16,500
👉 డీజీ సెట్లు 130
👉 మొబైల్ జనరేటర్లు 80