Kodanda Reddy: బీఆర్ఎస్ పాఠాలు నేర్పాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత కోదండరెడ్డి
ABN, Publish Date - Jul 16 , 2024 | 04:31 PM
రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ(BRS party) రైతులను గందరగోళానికి గురి చేస్తోందంటూ కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి (Kodanda Reddy) మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు సోమవారం విడుదల చేసినట్లు కోదండరెడ్డి చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ(BRS party) రైతులను గందరగోళానికి గురి చేస్తోందంటూ కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి(Kodanda Reddy) మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు సోమవారం విడుదల చేసినట్లు కోదండరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు రుణమాఫీ అంశంలో రైతులను పరేషాన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబీ నేతలు మాకు పాఠాలు నేర్పుతున్నారని, దేశంలో మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కారే అని ఆయన గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ పథకాన్ని తీసుకొచ్చారు. పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎదుట ఆయన పెట్టారు. దాన్నే అప్పటి యూపీఏ సర్కార్ దేశవ్యాప్తంగా అమలు చేసిందని కోదండరెడ్డి గుర్తు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిసార్లు రుణమాఫీ చేసిందో చెప్పాలని, వారికి బకాయిలు చెల్లించడమే సరిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తాము పకడ్బందీ విధానాలతో ఒకేసారి రూ.2లక్షలు మాఫీ చేస్తూ రైతులను ఆదుకుంటున్నట్లు చెప్పారు. అర్హులకు లబ్ధి అందలేదంటూ బీఆర్ఎస్ వాళ్లు గోల్‌మాల్ చేస్తూ మమ్మల్ని తప్పుపడుతున్నారు. గత పదేళ్లల్లో ఎంతమందికి రుణమాఫీ చేశారో గులాబీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆర్బీఐ కూడా వ్యవసాయానికి పెద్దపీట వెయ్యాలని చెబుతోందని కోదండరెడ్డి చెప్పుకొచ్చారు. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అని పెట్టాం. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని దాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. లబ్ధిపై రైతులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించవచ్చని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి:
Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్
TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..
Updated Date - Jul 16 , 2024 | 04:31 PM