KTR: ఆ వివరాలు చెప్పొద్దు.. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి..
ABN, Publish Date - Jan 09 , 2024 | 08:28 PM
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలు కోసం ‘‘అభయహస్తం’’ పేరిట దరఖాస్తులను స్వీకరించింది. అయితే కొంతమంది సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులను మోసం చేస్తున్నారు.
హైదరాబాద్: ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై కనిపించడం, అనామక వ్యక్తుల వద్ద కుప్పలు కుప్పలుగా అప్లికేషన్ ఫామ్స్ కనిపించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు పలు సూచనలు చేస్తూనే.. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
'ప్రజాపాలన అప్లికేషన్‌లను ప్రైవేట్ వ్యక్తులు నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేస్తున్న అనేక సంఘటనలను, వీడియోలను నేను చూస్తున్నాను. అనేక మంది నుంచి కూడా నాకు సమాచారం అందుతోంది. ఈ దరఖాస్తుల్లో కోట్లాది మంది తెలంగాణ పౌరులు తమకు సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్త సమాచారాన్ని పేర్కొనడం జరిగింది. ఈ రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తెలంగాణ ప్రజలు ఎవరూ మీకు పింఛను, ఇల్లు లేదా.. 6 గ్యారెంటీలల్లో దేనినైనా ఇస్తామని కాల్ చేస్తే OTP గానీ, బ్యాంక్ వివరాలను షేర్ చేయవద్దు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి. సైబర్ నేరగాళ్ల బారిన పడకండి' అని కేటీఆర్ సూచించారు.
ఓటీపీ అని కాల్ చేస్తే చెప్పకండి..
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ‘‘అభయహస్తం’’ పేరిట దరఖాస్తులను స్వీకరించింది. అయితే కొంతమంది సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. ‘ప్రజాపాలన ఫాంలను వెరిఫై చేస్తున్నామని.. మీ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తుందని దానిని చెబితే మీ దరఖాస్తు పూర్తవుతుంది’ అని అధికారుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 09 , 2024 | 09:22 PM