Minister PonnamPrabhakar: సమగ్ర కుటుంబ సర్వేపై ఆందోళన వద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 10 , 2024 | 11:16 AM
సమగ్ర కుటుంబ సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందని, అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే సర్వే చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
సిద్దిపేట: ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణలో చరిత్మాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏపీవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ(ఆదివారం) కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందని, అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే సర్వే చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల కొందరు ఇబ్బందులు కలిగించారు, అది సరైనది కాదని అన్నారు. కేవలం కులాల జనాభా తెలుసుకునేందుకే ఈ సర్వే చేస్తున్నామని తెలిపారు. సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగ స్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
సర్వే ఫారంలో చేర్పులు, మార్పులు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫారంలో పలు అంశాలకు సంబంధించి చేర్పులు, మార్పులు చేశారు. కుల, మతాలు, సామాజిక వర్గానికి సంబంధించి ‘ఏమి లేదు’ అనే అంశాన్ని చేర్చడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కులగణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ, ఒక కులగణన కాకుండా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఈనెల 6వ తేదీ నుంచి సర్వే చేయాలని షెడ్యూల్ ఖరారు చేశారు. ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పార్ట్ 1, పార్ట్ 2లో అనుబంధ ప్రశ్నలతో కలిపి 75 ప్రశ్నలను చేరుస్తూ రూపొందించిన సర్వే ఫారాన్ని గతనెల 29వ తేదీన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు.
మొదట పంపిన సర్వే ఫారాన్ని ప్రింటింగ్ చేయించవద్దని, మరొక ఫారం పంపిస్తామని జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. ఈ సర్వే ప్రత్యేకించి కుల గణన చేసేందుకేనని ప్రజలంతా భావిస్తున్నప్పటికీ కాలం నంబర్ 6లో ఉన్న 01 ఎస్సీ, 02, ఎస్టీ, 03 బీసీ, 04 ఓసీ అని ఉంటే మాత్రం దానిపై స్టిక్కర్ వేయాలని ఆదేశించారు. 5వ కాలంలో మతం, 6వ కాలంలో సామాజిక వర్గం, 7వ కాలంలో కులం అని ఇచ్చారు. ఎన్యూమరేటర్లకు ఇచ్చిన బుక్‌లెట్‌లో పేర్కొన్న కోడ్ నంబర్లను నమోదు చేయాలన్నారు. ఇందులో కొత్తగా 5వ కాలం 01లో ఏ మతం లేదు, 6వ కాలం 01లో ఏ సామాజిక వర్గం లేదు, 7వ కాలంలో కులానికి సంబంధించి ఏ కులం లేదు అనే అంశానికి కోడ్ 999 వేయాలని బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వం ఏ మతం లేదు, ఏ సామాజిక వర్గం లేదు, ఏ కులం లేదు అని పేర్కొనడంలో ఆంతర్యమేమిటని పలువురు అంటున్నారు. అలాగే రాజకీయ నేపథ్యానికి సంబంధించి 46వ కాలంలో నాలుగు ప్రశ్నలను తొలగించారు. ఆఫీస్ బేరర్‌లో మినిస్టర్, చైర్మన్, స్పీకర్, మొదలగు అనే అంశాలు, ఎన్ని టర్ములనే అంశాన్ని తొలగించారు.
Updated Date - Nov 10 , 2024 | 11:24 AM