Share News

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

ABN , Publish Date - Dec 06 , 2024 | 07:24 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు అయింది. గురువారం కౌశిక్‌రెడ్డి పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. రాత్రి ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy)కి న్యాయమూర్తి బెయిల్‌ (Bail) మంజూరు చేశారు. రూ. 5 వేల జరిమానాతో పాటు రెండు షూరిటీలతో బెయిల్‌ మంజూరు చేశారు. గురువారం ఉదయం కౌశిక్ రెడ్డిని కొండాపూర్‌‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు అయింది. గురువారం కౌశిక్‌రెడ్డి పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు. విచారణ అనంతరం కౌశిక్‌కు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు.

తన ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొంటూ రెండు రోజుల క్రితం కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు. ఫిర్యాదు ఇచ్చినా పట్టిచుకోవడం లేదని పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్‌‌లో విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు 20 మంది మీద పోలీసులు పలు సెక్షన్లతో కేసు ఫైల్ చేశారు. ఈ క్రమంలో నిన్న కౌశిక్ రెడ్డిని కొండాపూర్‌‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.


కాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని గురువారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు ముందు, తర్వాత హైడ్రామా నెలకొంది. కౌశిక్‌ రెడ్డి అరెస్టును అడ్డుకొనేందుకు కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలను వచ్చినవారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతోందని.. ఇందుకు సీఎం రేవంత్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డి కారణమని ఫిర్యాదు చేసేందుకు బుధవారం కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్‌ ఠాణాకు చేరుకున్నారు. అదే సమయంలో సీఐ రాఘవేంద్ర తన వాహనంలో బయటకు వెళుతున్నారు. గమనించిన కౌశిక్‌రెడ్డి తన కారుతో సీఐ వాహనాన్ని అడ్డుకున్నాడు. తన ఫిర్యాదు స్వీకరించాలని కోరారు. ముఖ్యమైన పనిమీద బయటకు వెళుతున్నానని స్టేషన్‌లో మిగతా సిబ్బందికి ఫిర్యాదు ఇవ్వాలని సీఐ సమాధానమిచ్చినా కౌశిక్‌రెడ్డి వినిపించుకోలేదు. ఆయనతో వాగ్వావాదానికి దిగారు. దీనిపై సీఐ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు బీఎన్‌ఎస్ 57,126(2), 127(2), 132, 224, 333, 451(3), 191(2) రెడ్‌ విత్‌ 190,3(5) కింద కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం పోలీసులు భారీ బందోబస్తుతో కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను, మరో 20 మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు... విషయం తెలియడంతో కౌశిక్‌రెడ్డి ఇంటికి హరీశ్‌ రావు వెళ్లారు. మీ దగ్గర ఎఫ్‌ఐఆర్‌ ఉందా.. నోటీసులు ఇచ్చారా.. అని పోలీసులను హరీశ్‌ ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ ఉన్నందున నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ చూపించాలని అడగగా.. ప్రస్తుతం తమ దగ్గర లేదని చెప్పిన పోలీసులు అక్కడి నుంచి హరీశ్‌ను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కౌశిక్‌ ఇంటివద్ద హరీశ్‌ అభిమానులు ఆందోళన చేయడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. ఇక కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి రాగా వారినీ పోలీసులు అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌ అరెస్టు విషయం తెలియడంతో పార్టీ శ్రేణులు అక్కడికి తరలివచ్చాయి. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని స్టేషన్‌ ముందు బైఠాయించారు. కాగా గచ్చిబౌలి పీఎస్‌లో ఉన్న హరీశ్‌ను కలిసేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు తరలివచ్చారు.


ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాగంటి గోపినాథ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు హరీశ్‌ను కలిశారు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లోని జగదీశ్వర్‌రెడ్డిని పలువురు నేతలు కలిశారు. హరీశ్‌ను కలిసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కౌశిక్‌రెడ్డిపై కేసు పెట్టడం దారుణమన్నారు. ఉదయం నుంచి అరగంటకో సెక్షన్‌ మారుస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా, ఎర్రబెల్లి మాట్లాడుతూ రేవంత్‌ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు నేరవేర్చడంలో విఫలమయ్యారని, దానిని ప్రశించినందుకు బీఆర్‌ఎస్‌ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాగా హరీశ్‌ అరెస్టును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దహనం చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి, సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, హరీశ్‌ అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఇందుకు నిరసనగా శుక్రవారం నెక్ల్‌సరోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టేందుకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

ప్రముఖ హాస్యనటుడికి యాక్సిడెంట్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 06 , 2024 | 09:23 AM