Rahul Gandhi: అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 05 , 2024 | 07:20 PM
భారతదేశంలో ఎప్పుడూ అగ్రకులాలకు నిమ్న కులాలు కనిపించవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కులగణన ద్వారా ఏళ్లుగా నష్టపోతున్న వారికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన ద్వారా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. కులాల వారీగా జనాభా లెక్కిస్తే తరాలుగా నష్టపోతున్న వారికి తగిన ప్రాతినిధ్యం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనకు సంబంధించి పౌరహక్కులు, మేధావులతో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, మేధావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతదేశంలో కులవ్యవస్థ చాల బలంగా ఉందని అన్నారు. అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ అనేది కనిపించదని చెప్పారు. కులగణన ద్వారా ఏళ్లుగా నష్టపోతున్న వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. కుల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉందని.. రాజకీయ, న్యాయ వ్యవస్థలోనూ అది బలంగా పాతుకుపోయిందని చెప్పుకొచ్చారు. కుల వ్యవస్థ అనేది కొంత మంది ఆత్మ విశ్వాసం దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల యువత సైతం ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా లేని ఈ కులవ్యవస్థ ఇండియాలోనే ఉందని రాహుల్ మండిపడ్డారు. కుల వివక్షత వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోగలనని చెప్పారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కులగణనపై మాట్లాడి సూచనలు చేశారు. ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ స్వయంగా నోట్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad: ఆటో డ్రైవర్ల బాధలు కలచివేశాయి: కేటీఆర్..
ఖండాలుదాటిన ప్రేమ.. ఒక్కటి కాబోతున్న కోనసీమ అబ్బాయి,కెనడా అమ్మాయి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 05 , 2024 | 08:13 PM