TG News: గోషామహల్ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి కుంగిన రోడ్డు..
ABN, Publish Date - Jul 28 , 2024 | 10:12 PM
గోషామహల్ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి డీసీఎం వాహనం కిందపడిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్: గోషామహల్ చాక్నవాడి ప్రాంతంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి డీసీఎం వాహనం కిందపడిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2022 చివరిలోనూ ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు అభద్రతా భావానికి గురవుతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో రూ.5కోట్లు ఖర్చు పెట్టి నాలాపై రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయినా ఏడాది కాకముందే మరోసారి రోడ్డు కుంగిపోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాసిరకం పనులు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు.
2022చివరిలోనూ చాక్నవాడిలో నాలాపై ఉన్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీని వల్ల పెద్ద గుంత ఏర్పడి అందులో పదుల సంఖ్యలో కార్లు, ఆటోలు పడిపోయాయి. అదే సమయంలో సంత జరుగుతుండడంతో కూరగాయల దుకాణాలు సైతం గోతిలో పడిపోయాయి. పలువురి దుకాణదారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పురాతన నాలాలు ఉన్నాయని, స్థానికులు సైతం ఆక్రమణలకు పాల్పడి నిర్మాణాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. పోలీసులు సైతం ఆ మార్గంలో రాకపోకలు నిలిచివేసి సహాయక చర్యలు చేపట్టి పలువురి కాపాడారు. మెుత్తం ఘటనకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు మరోసారి రోడ్డు కుండిపోయి డీసీఎం వాహనం పడిపోవడంతో బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని చాక్నవాడి ప్రాంత వాసులు కోరుతున్నారు. నాలాలపై పటిష్ఠ రోడ్లు నిర్మించి తమ ప్రాణాలు కాపాడాలంటూ వేడుకుంటున్నారు.
Updated Date - Jul 28 , 2024 | 10:12 PM