Sabitha Indra Reddy: వరస అత్యాచార ఘటనలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..
ABN, Publish Date - Jul 31 , 2024 | 11:04 AM
తెలంగాణ రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థ కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళల గురించి మాట్లాడి 48గంటలు కాకముందే వరస అత్యాచార ఘటనలు వెలుగు చూడడం విచారకరమని సబితా అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థ కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళల గురించి మాట్లాడి 48గంటలు కాకముందే వరస అత్యాచార ఘటనలు వెలుగు చూడడం విచారకరమని సబితా అన్నారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలచివేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటూ ఆగ్రహించారు. ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయని ఆమె చెప్పారు.
వనస్థలిపురం పీఎస్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారం దారుణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పార్టీ పేరుతో మద్యం మత్తులో యువతి స్నేహితుడు, మరో వ్యక్తి కలిసి ఆమెపై అత్యాచారం చేయడాన్ని మాజీ మంత్రి ఖండించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఓయూ పీఎస్ పరిధిలో ప్రయాణీకురాలిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్ డ్రైవర్ అఘాయిత్యం చేయడాన్ని సబితా దుయ్యబట్టారు. నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ అత్యాచారం చేయడంపై ఆమె ఆగ్రహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగురాలిపై అత్యాచార ఘటనను కూడా మాజీ మంత్రి ఖండించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిచి అత్యాచార ఘటన జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో స్వామి అనే వ్యక్తి యువతిని అత్యాచారం చేసి ముఖం చాటేయడంపై మాజీ మంత్రి ఆగ్రహించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతిని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని హైదరాబాద్ రప్పించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెను మోసం చేసి ఆస్ట్రేలియా వెళ్తుండగా పోలీసులు నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మాజీ మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 31 , 2024 | 11:04 AM