TS Assembly: ‘భాషపై రగడ’.. హాట్‌హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ
ABN, Publish Date - Feb 14 , 2024 | 12:48 PM
Telangana: అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్ల ప్రతిసవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ హాట్‌హాట్‌గా నడుస్తోంది. నిన్న నల్గొండ సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ అధినేతకు సవాళ్లు విసిరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్ల ప్రతిసవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) హాట్‌హాట్‌గా నడుస్తోంది. నిన్న (మంగళవారం) నల్గొండ సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ అధినేతకు సవాళ్లు విసిరారు. నల్గొండ సభలో కేసీఆర్ భాష అభ్యంతరకరమని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సీఎంను ఉద్దేశించి ‘‘కాళేశ్వరం ఏం పీకనీకి పొయ్యారు’’ అనడం సబబా అంటూ ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. సభకు రాకుండా కేసీఆర్ పారిపోయారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యంత్రి రేవంత్ భాషపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. సీఎంగా నిండు సభలో మట్లదకూడని భాష మాట్లాడటం సబబు కాదు అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
సచ్చిన పామును ఎవరైనా చంపుతారా?: సీఎం రేవంత్
‘‘కేసీఆర్ నిన్న మాట్లాడిన భాషపై చర్చ చేద్దామా?. కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు మేం సిద్దం. రేపు సాయంత్రం వరకైనా సమయం ఇస్తున్నాం. కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొనాలి. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సభకి వచ్చి చర్చ చేయాలి. సచ్చిన పామును ఎవరైనా చంపుతారా? కేసీఆర్ పారిపోయి ఫామ్ హౌజ్‌లో దాకున్నారు. కేసీఆర్ నిన్న మాట్లాడింది ఏం భాష? ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకడానికి వెళ్ళాడు అని అంటారా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పాంటు లాగారు. ఇక జనం కేసీఆర్ చొక్కా కూడా లాగేస్తారు. సభకి రావాల్సిన నాయకుడు సభకి రాకుండా ముఖ్యమంత్రిని తిడుతాడా?. మా ప్రభుత్వమే తప్పు చేసినట్టు గత ప్రభుత్వ మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అయ్యాయి’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మేము సిద్ధమే: కడియం శ్రీహరి
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై శ్వేత పత్రం విడుదల చేస్తే చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. సీఎం భాష పట్ల తమకు అభ్యంతరం ఉందన్నారు. సీఎంగా నిండు సభలో మట్లదకూడని భాష మాట్లాడటం సబబు కాదన్నారు. సీఎం గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. సీఎం... రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చీడ పురుగు రాజగోపాల్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను చీట్ చేసింది రాజగోపాల్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 14 , 2024 | 12:59 PM