Telangana: పక్కా ఆధారాలు.. కీలక నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్: మంత్రి పొంగులేటి
ABN, Publish Date - Oct 25 , 2024 | 08:51 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే బాంబులు పేలతాయని ..
నంబర్ 1–8 వరకు అరెస్టులు!
గత ప్రభుత్వంలోని కీలక నేతలు జైలుకే
స్కాంల్లో ఒకటి దీపావళిలోపే పేలుతుంది
బీఆర్‌ఎస్ ముఖ్యుల అక్రమాలపై ఫైళ్లు సిద్ధం
ఎవరినీ వదలం.. సినిమా ముందుంది..
మీరు హైదరాబాద్‌లో దిగేటప్పటికే సంచలనం
కొరియాలో మీడియాతో మంత్రి పొంగులేటి
సియోల్ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే బాంబులు పేలతాయని బుధవారం ప్రకటించిన పొంగులేటి.. గురువారం నాటి సియోల్ పర్యటనలోనూ ఈ అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన ప్రముఖులకు సంబంధించిన ఫైళ్లు సిద్ధం అయ్యాయన్నారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందన్నారు. మీరు సియోల్ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే (26వ తేదీ ఉదయం) కొన్ని బాంబులు పడతాయని మీడియా ప్రతినిధులతో చెప్పారు. అన్నింటికీ పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఫోన్‌ట్యాపింగ్, ధరణి, భూ అక్రమాలు, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారని.. వీటిలో ఏదో ఒకటి దీపావళికి ముందే పేలుతుందని తెలిపారు. అక్రమార్కులను ఎలా శిక్షించాలన్నది చట్టం చూసుకుంటుందన్నారు. కుంభకోణాలు, అవినీతిలోని ఆస్తుల రికవరీని కూడా చట్టమే చూసుకుంటుందని చెప్పారు. ఇందులో తమ నిర్ణయం ఏమీ ఉండదన్నారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లా చట్టాలను అతిక్రమించి సంపాదించారని ఆరోపించారు. మాజీ మంత్రులు, వారి తొత్తులు మూసీ వెంట కబ్జాలు చేశారని, అవి ఖాళీ చేయిస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని నటిస్తున్నారని ధ్వజమెత్తారు.
బావ, బావమరిది ఇద్దరూ పబ్లిసిటీతో పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేస్తే ఉపేక్షించడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. చట్టాలు ఉల్లంఘించి చేసిన పనుల రికార్డులను సిద్ధం చేశామని.. రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని మంత్రి పేర్కొన్నారు. ఎవరూ తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సాక్ష్యాల ధ్రువీకరణ కోసం ఆగామని.. అసలు సినిమా ముందుందని అన్నారు.
భూ అక్రమాల కేసేనా?
ఏ కేసులో రాష్ట్ర ప్రభుత్వం బాంబులు పేలుస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ధరణి–భూముల అక్రమాలకు సంబంధించిన అంశాలనే వెలుగులోకి తెచ్చి కేసులు పెడతారని సమాచారం. ధరణి చట్టం వచ్చాక అనేక భూ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంలో సీసీఎల్‌ఏ స్థాయిలో క్లియర్ చేయాల్సిన కొన్ని భూములకు సంబంధించిన అంశాలను.. కలెక్టర్ల స్థాయిలోనే చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ధరణి వ్యవహారాలను ఒక ప్రైవేటు సంస్థ టెరాసిస్‌కు ఇచ్చి, దాన్ని అడ్డుపెట్టుకుని కూడా కొన్ని లావాదేవీలు అక్రమంగా చేశారన్న సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:
తీరం దాటిన ‘దాన’ తీవ్ర తుఫాన్..
రామ ఏకాదశి రోజు ఈ పనులు అస్సలు చేయెుద్దు..
నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
For More Telangana News and Telugu News..
Updated Date - Oct 25 , 2024 | 08:51 AM