కమలం ప్రచారం ఇక ఉధృతం
ABN, Publish Date - Apr 13 , 2024 | 03:42 AM
రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ..
15 భారీ బహిరంగ సభలు, 2-3 రోడ్డు షోలు
పాల్గొననున్న మోదీ, అమిత్ షా, నడ్డా
ఎక్కడ జరపాలన్న దానిపై బీజేపీ కసరత్తు
ఇప్పటికే ముమ్మరంగా ఇంటింటి ప్రచారం
మోదీ హ్యాట్రిక్ కోసం చెమటోడుస్తున్న శ్రేణులు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేయబోతోంది. పెద్దసంఖ్యలో బహిరంగసభలు, రోడ్డు షోలు నిర్వహించి సత్తాచాటేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి ప్రచారం చేయనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఈనెల 18న నోటిఫికేషన్ జారీ కానున్న సంగతి తెలిసిందే. బీజేపీ సన్నద్ధతపై ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియను పెద్దఎత్తున నిర్వహించి క్షేత్రస్థాయిలో కేడర్‌లో మరింత జోష్ తీసుకురాబోతున్నాం. నామినేషన్‌ల దాఖలు సందర్భంగా పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అగ్రనేతల ప్రచార సభలు ఉంటాయి. మే 11 వరకూ వీటిని నిర్వహిస్తాం. మోదీ, అమిత్‌షా, నడ్డాలతో కనీసం 15 బహిరంగసభలు, రెండు లేదా మూడు భారీ రోడ్డు షోలు నిర్వహించాలని భావిస్తున్నాం. వీటిని ఏయే ప్రాంతాల్లో జరపాలి అన్నదానిపై కసరత్తు జరుగుతోంది’ అని తెలిపారు. కాగా, ప్రధాని మోదీ గత నెల 15వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ రోడ్డు షోతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొన్నదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
కార్యరూపంలోకి అమిత్ షా ఆదేశాలు
గత నెల 12వ తేదీన హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షా, పార్టీ సంస్థాగత పటిష్ఠతపై కేడర్‌కు, నేతలకు పలు సూచనలు చేశారని, ఇందుకు అనుగుణంగా పోలింగ్‌బూత్ స్థాయి కార్యక్రమాలు, పార్లమెంటు సెగ్మెంటు సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే నాటికే పార్లమెంటు సెగ్మెంట్ల సమ్మేళనాలు పూర్తి చేస్తామని, ఆ తర్వాత నుంచి ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించి ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎక్కడికక్కడ ఇంటింటి ప్రచారం జరుపుతున్నారని, ప్రధానిగా మూడోసారి మోదీ ఎందుకు రావాలో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే.. బీజేపీని ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలను వివరిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అగ్రనేతల ప్రచారం తమ విజయావకాశాలను మరింత మెరుగుపరుస్తుందని బీజేపీ మరో నాయకుడు ధీమా వ్యక్తం చేశారు.
మోదీ సభలపై కసరత్తు
ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటి వరకు పాల్గొనని పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు. గత నెల మొదటివారంలో రాష్ట్రంలో పర్యటించిన మోదీ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో ఈ సభలు జరిగాయి. అనంతరం, గత నెల 15వ తేదీన మల్కాజ్‌గిరి, 16న నాగర్‌కర్నూలు, 18న నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాలలో నిర్వహించిన ఎన్నికల సభల్లో మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, వీటిని మినహాయించి మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల పరిధుల్లో మోదీ సభలు ఏర్పాటు చేయబోతున్నట్లు బీజేపీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఏయే కేంద్రాల్లో వీటిని నిర్వహించాలన్నదానిపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. అమిత్‌షా, జేపీ నడ్డాల సభలు కూడా మోదీ హాజరుకాని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు.
Updated Date - Apr 13 , 2024 | 03:42 AM