Share News

అసలు టార్గెట్‌ ఆ ఇద్దరే! రేవంత్‌, ఈటల రాజేందర్‌పై స్పెషల్‌ టీంల ఫోకస్‌

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:29 AM

బీఆర్‌ఎస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలనే ఏకైక ఏజెండాతో పనిచేసిన ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు అండ్‌ టీం..

అసలు టార్గెట్‌ ఆ ఇద్దరే! రేవంత్‌, ఈటల రాజేందర్‌పై స్పెషల్‌ టీంల ఫోకస్‌

20 మందికిపైగా సిబ్బందితో రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఫోన్ల ట్యాపింగ్‌

రాధాకిషన్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా దర్యాప్తు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలనే ఏకైక ఏజెండాతో పనిచేసిన ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు అండ్‌ టీం.. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేశారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్‌ను టార్గెట్‌గా చేసుకుని స్పెషల్‌ టీములు పనిచేశాయి. ముఖ్యంగా.. రేవంత్‌, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రతి కదలికా తెలుసుకునేందుకు, వారు మాట్లాడుకునే ప్రతి మాటా వినేందుకు 20 మందికిపైగా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి ఫోన్లు ట్యాప్‌ చేయడంతోపాటు ఎక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? వంటి వివరాలను ఆ బృందం సేకరించి ఎప్పటికప్పుడు నాటి ప్రభుత్వ పెద్దలకు చేరవేసింది. ముఖ్యంగా, రేవంత్‌కు ఆర్థిక సాయం అందించేవారిని గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టింది. అలాగే.. ఇంటి గుట్టు మొత్తం తెలిసిన ఈటెల బీజేపీలోకి వెళ్లడంతో.. ఆయనపైనా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈటల ఫోన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసేవారి ఫోన్లు సైతం ప్రణీత్‌ రావు నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్‌ టీం నిరంతరం ట్యాపింగ్‌లో ఉంచినట్లు తెలిసింది. వీరిద్దరిపైనా కాక.. ప్రతిపక్ష, స్వపక్ష పార్టీలోని నాయకుల ఫోన్లనూ అప్పటి బీఆర్‌ఎస్‌ కీలక నేతల ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావు అంట్‌ టీం ట్యాప్‌ చేసింది.

మా పేరు చెప్పి ఉంటారా?

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌, ట్రాకింగ్‌, బెదిరింపులు, వసూళ్ల కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌ రావు స్టేట్‌మెంట్‌ ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు సాగుతున్నారు. తమ టీం ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి కోసం పనిచేసింది, ఎన్నికల సమయంలో నేతల డబ్బును పోలీస్‌ వాహనాల్లో ఎలా తరలించిందీ.. ఈ వివరాలన్నింటినీ రాధాకిషన్‌రావు పూసగుచ్చారు. ఆ సమాచారం మేరకు పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా అధికారంలో ఉన్నప్పుడు రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావుతో పనులు చేయించుకున్న, వారితో టచ్‌లో ఉన్న రాజకీయ నాయకుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. కస్టడీలో వారు తమ పేరు చెప్పి ఉంటారా? చెబితే ఏం చెప్పి ఉంటారు? అని భయపడుతున్నారు. అలాగే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఎన్నికల డబ్బు తరలింపులో కీలకపాత్ర పోషించారని, ఒక ఎస్సై బీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బును టాస్క్‌ఫోర్స్‌ వాహనంలో తరలించారని రాధాకిషన్‌ రావు పోలీసులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని విచారించి, స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి, చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

బెయిలివ్వండి ప్లీజ్‌..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న తిరుపతన్న.. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీ ముగిసినందున తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌ సోమవారం నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బలమైన వాదనలు వినిపించేందుకు దర్యాప్తు అధికారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్పెషల్‌ పీపీని ఏర్పాటు చేసింది.

Updated Date - Apr 13 , 2024 | 03:29 AM