Telangana Lok Sabha Elections: ఆ నలుగురెవరు ?
ABN, Publish Date - May 31 , 2024 | 04:11 PM
ఓట్ల లెక్కింపు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగగా, జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. గెలుస్తామా ? లేదా ? అని ద్వితీయ శ్రేణి నేతల వద్ద ఆరా తీస్తున్నారు. గ్రేటర్‌లో ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపెవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు.
ఉత్కంఠ పోరులో విజేతలెవరో
గ్రేటర్ నేతల్లో జోరుగా చర్చ
లష్కర్‌లో త్రిముఖ పోరు
హైదరాబాద్‌లో మజ్లిస్, బీజేపీ ఢీ
మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలపై కాంగ్రెస్, బీజేపీ ఆశలు
సానుభూతిపై బీఆర్‌ఎస్ బోలెడు అంచనా
హైదరాబాద్ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగగా, జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. గెలుస్తామా ? లేదా ? అని ద్వితీయ శ్రేణి నేతల వద్ద ఆరా తీస్తున్నారు. గ్రేటర్‌లో ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపెవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు.
గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఈ సారి ప్రత్యర్థి వర్గాన్ని ఏ పార్టీ కూడా తక్కువ అంచనా వేయడం లేదు. హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ, సికింద్రాబాద్‌లో బీజేపీ పైకి గంభీరంగా ఉంటున్నప్పటికీ ఈనెల 11 వరకు జరిగిన ప్రచార హోరు, పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరు అన్ని పార్టీ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేతలందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోపలి నుంచి ఎండాకాలంలో సైతం వణుకు పుడుతోందనడంలో సందేహం లేదు.
ఓటమెరుగని నేత అసదుద్దీన్..
ఓటమెరుగని నేతగా.. ఇప్పటివరకు పోటీ చేసిన ప్రతిసారీ గెలిచిన హైదరాబాద్ మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఈ సారి ఎన్నికల్లో చెమటోడ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల వరకు గట్టి పోటీ లేదు... పోటీ చేసినప్పుడల్లా... గెలుపు నల్లేరు మీద నడకలా ఉన్న మజ్లిస్ వర్గాల్లో 2024 ఎన్నికలు మాధవీలత రూపంలో ఎంఐఎంలో ప్రకంపనలు సృష్టించాయి. బీజేపీ తరపున పోటీ చేసిన ఆమె హైదరాబాద్ సీటును సొంతం చేసుకుంటన్నానన్న ధీమాతో ప్రచారం చేయడం... ఇంటింటా తిరగడంతో మజ్లిస్ వర్గాల్లో వణుకు పుట్టింది. ఆమె ప్రచారం... పాత నగరానికి ఢిల్లీ పెద్దల రాకపోకల నేపథ్యంలో ఈ సారి ఓటర్లు ఎటు వైపు మొగ్గారోనని మజ్లిస్ వర్గాలు ఇప్పటికీ లెక్కలు చూసుకుంటున్నాయి. అలాగే బీజేపీ శిబిరం కూడా ఉత్సాహంగా ఉంది. దానికి తోడు ఓటింగ్ శాతం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో మజ్లిస్‌కు నష్టం వాటిల్లడం ఖాయమని మాధవీలత వర్గం భావిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తమ సీటును కాపాడతాయో లేదోనని అసదుద్దీన్ వర్గం, ఈ సారి తమ విజయం ఖాయమనే ధీమా మాధవీలత వర్గీయులు భావిస్తుండటంతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తొలిసారి గట్టి పోటీ నెలకొందని చెప్పవచ్చు.
త్రిముఖ పోరులో విజేతెవరో !
సికింద్రాబాద్‌లో ఈసారి విజయం తమదేనని మూడు పార్టీలు ధీమాగా ఉన్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద నేతలే కావడం.. ఇద్దరు మంత్రి స్థాయిలో ఉన్న నేతలు కాగా... ఒకరు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అంతటి హేమాహేమీల మధ్య సాగుతున్న పోరు రసవత్తరంగా మారిందనడంలో డౌట్ లేదు. 2019 ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఉన్నప్పటికీ... అప్పటి ఢిల్లీ నేతల చరిష్మా.. కిషన్‌రెడ్డికి అప్పట్లో లభించిన ఓటర్ల సహకారంతో విజయం ఆయన్ను వరించింది. అయితే అభివృద్ధికి కృషి చేయలేదనే ఆరోపణలు.. నియోజకవర్గం అభివృద్ధిలో విఫలమయ్యారనే ఆరోపణలను ప్రచారాస్త్రంగా మార్చుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు లబ్ధిపొందాలని భావించాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఓటర్ల మద్దతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్‌ఎస్‌కు ఓటర్ల సానుభూతి ఉందని ఆ నేతలు భావిస్తున్నారు.
For More Telangana News and Telugu News..
Updated Date - May 31 , 2024 | 04:33 PM