HYDRA: హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:45 AM
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శించింది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది.
మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాల కూల్చివేత
చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో 18 విల్లాలు
ఐదింటిలో నివసిస్తుండడంతో కూల్చివేత వాయిదా!
సున్నం చెరువులో రెండు నాలుగంతస్తుల భవనాలు,
మరో రెండు రెండంతస్తుల భవనాలు నేలమట్టం
20 రేకుల షెడ్లు, 10 గుడిసెల తొలగింపు
అమీన్‌పూర్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాంభూపాల్‌రెడ్డి ఫాంహౌస్ ప్రహరీ, షెడ్ల కూల్చివేత
సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత.. ఒంటిపై కిరోసిన్
పోసుకొని బాధితుల ఆత్మహత్యాయత్నం
మల్లంపేటలో విల్లాల కొనుగోలుదారుల ఆవేదన
ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు
‘ఎన్నారై లేడీ డాన్’ భూకబ్జాలు బట్టబయలు!
కత్వా చెరువులో కూల్చిన విల్లాలు ఆమె కట్టినవే
నిందితురాలిపై పోలీసు కేసులున్నా చర్యలు నిల్
హైదరాబాద్ సిటీ/మియాపూర్/దుండిగల్/అల్లాపూర్/మాదాపూర్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శించింది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది. దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట గ్రామ పరిధిలోని కత్వ చెరువులో శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్మించిన 13 విల్లాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. నిర్మాణ సంస్థ ఈ విల్లాలను ఒక్కో దానిని రూ.1.50 కోట్లకు విక్రయించింది. ఈ సంస్థ నిర్మించిన విల్లాల్లో 18 విల్లాలు కత్వ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉండగా.. ఐదింటిలో ప్రస్తుతం కుటుంబాలు నివాసముంటుండడంతో వాటి కూల్చివేతను వాయిదా వేశారు.
కాగా, ఆదివారం ఈ 13 విల్లాలతోపాటు మాదాపూర్‌లోని సున్నం చెరువు, అమీన్‌పూర్ చెరువుల్లో ఆక్రమణలు, నిర్మాణ దశలో ఉన్న అనుమతి లేని భవనాలను కూల్చివేశారు. ఎప్పటిలానే తెల్లవారుజామున 5గంటలకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆయా ప్రాంతాలకు చేరుకున్న హైడ్రా బృందాలు.. ఆపరేషన్ డిమాలిషన్‌కు శ్రీకారం చుట్టాయి. అమీన్‌పూర్ చెరువులో వైసీపీ నేత, ఏపీలోని పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్ ప్రహరీ గోడలు, షెడ్లను కూల్చివేశారు. కత్వ చెరువు ఆక్రమణపై శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి, అమీన్‌పూర్ కబ్జాపై రాంభూపాల్‌రెడ్డి, సున్నం చెరువు ఆక్రమణలకు సంబంధించి గోపాల్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత..
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి మండలాల పరిధిలోని అల్లాపూర్, గుట్టల బేగంపేట గ్రామాల రెవెన్యూ పరిధిలో సున్నం చెరువు 26 ఎకరాల్లో విస్తరించి ఉంది. కాలగమనంలో చెరువు భారీగా ఆక్రమణకు గురైంది. శిఖం పట్టాల భూములను యజమానులు విక్రయించగా.. కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే చెరువు ఎఫ్‌టీఎల్‌లో నివాస సముదాయాలు వెలిశాయి. ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్‌లో ఖరీదైన విల్లాలూ ఉన్నాయి. వీటిలో ఇప్పటికే పౌరులు నివాసముంటున్న నేపథ్యంలో.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలు, తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. గుట్టల బేగంపేట గ్రామ సర్వే నంబర్లు 11, 12, 13, 14, 15, 16లలో 10 ఎకరాలకుపైగా చెరువు ఆక్రమణల పాలైంది. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు చెరువును పరిశీలించారు.
పలు నిర్మాణాలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో నాలుగు అంతస్తుల భవనాలు రెండు, రెండంతస్తుల భవనాలు రెండింటిని నేలమట్టం చేశారు. వీటితోపాటు ఓ హోటల్, నీటి వ్యాపారం, దుకాణాలు నిర్వహిస్తున్న దాదాపు 20 షెడ్లను కూల్చివేశారు. పది గుడిసెలనూ తొలగించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఉన్నపళంగా పంపిస్తే ఎక్కడకు వెళ్లాలంటూ వికారాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వారిపై నీళ్లు పోసి అడ్డుకున్న అధికారులు.. అనంతరం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. గుడిసెల కూల్చివేత సమయంలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. కూల్చివేతల సమాచారం ముందే అందడంతో స్థానికులు, భవనాల యజమానులు, వారి బంధువులు, స్నేహితులు పెద్దసంఖ్యలో వచ్చారు. వారు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
భూమిని ఆక్రమించి షెడ్లు..
సున్నం చెరువు పక్కన దాదాపు 50 గుడిసెల్లో పదేళ్ల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు నివాసముంటున్నారు. గోపాల్ అనే వ్యక్తి.. భూమిని ఆక్రమించి షెడ్లు నిర్మించడంతోపాటు అక్రమంగా నిర్వహిస్తున్న నీటి దందాలో బిహార్, ఇతర రాష్ర్టాల నుంచి తీసుకువచ్చిన కార్మికుల కోసం గుడిసెలు వేయించారని అధికారులు చెబుతున్నారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా గుడిసెలు తొలగించడంతో రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు ధ్వంసం చేశారంటూ యజమాని ఒకరు వాపోయారు. వాస్తవానికి సున్నం చెరువులో పదేళ్ల క్రితమే అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న ఐదంతస్తుల భవనాలు కొన్నింటిని కూల్చివేశారు. అనంతరం కూల్చివేతలు అర్ధంతరంగా నిలిచిపోవడంతో తిరిగి ఆక్రమణల పర్వం మొదలైంది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో గతంలో బడా నిర్మాణ సంస్థకు చెందిన విల్లాలకు జీహెచ్‌ఎంసీ అనుమతినిచ్చింది. సర్వే నెంబర్-17లో ఈ విల్లాలు ఉన్నాయి. గతంలో మార్కింగ్ చేసి.. కొన్ని విల్లాలు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని నిర్ధారించిన రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వంలో మంత్రి బంధువులకు చెందిన సంస్థ ప్రాజెక్టు కావడమే ఇందుకు కారణమనే ప్రచారం జరిగింది.
కత్వలో విల్లాలు...
దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట గ్రామ పరిధిలోని కత్వ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నాయంటూ శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ నిర్మించిన 13 విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది. సర్వే నం.170/5లో శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ 60విల్లాలకు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకుంది. అనంతరం సర్వే నం.170/4లో మరికొంత భూమిని కొనుగోలు చేసి.. మొత్తం 325 విల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో విల్లాను రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లకు విక్రయించారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు మొదలైన నాటి నుంచీ స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా నిర్మాణ సంస్థ అన్ని శాఖ ల అధికారులను మేనేజ్ చేస్తూ నిర్మాణాలను కొనసాగించింది. కత్వచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ స్ధలంలో రెం డున్నర ఎకరాలకు పైగా ఆక్రమించి అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శుల ద్వారా అనుమతులు తెచ్చుకున్నారు. కత్వచెరువు ఎఫ్‌టీఎల్‌లో 16గుంటలు, బఫర్‌జోన్‌లో 1ఎకరం 4గుంటల భూమిని ఆక్రమించిన నిర్మాణ సంస్థ 23 విల్లాలు నిర్మించి విక్రయించింది. వారికి దగ్గరుండి రుణాలూ మంజూరు చేయించింది. కానీ, చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో 18 విల్లాలున్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. 5 విల్లాల్లో కుటుంబాలు ఉంటుండగా.. మిగతా 13 విల్లాలను నేలమట్టం చేశారు. కాగా, విల్లాలు కొనుగోలు చేసిన కుటుంబాలు కూల్చివేతలతో బోరుమన్నాయి. మరోవైపు కత్వ చెరువులో విల్లాలు నిర్మించిన శ్రీ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి కూల్చివేతల సమయంలో పత్తా లేకుండా పోయారు.
వైసీపీ నేత ఫాంహౌ్‌సలో కూల్చివేతలు
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలో పెద్దచెరువు పక్కనే ఏపీలోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్ వద్ద కూడా ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పెద్ద చెరువును ఆనుకుని ఉండే కొత్తచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే సర్వే నంబర్లలోని భూములను రాంభూపాల్‌రెడ్డి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పట్టా భూములే అయినా.. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో అనేక ఏళ్లుగా భారీగా మట్టిపోసి ఎత్తు పెంచారు. దీంతో కొత్తచెరువు ఆనవాళ్లు కోల్పోయింది. తాజాగా ఇరిగేషన్ శాఖ నిర్వహించిన సర్వేలో సదరు చెరువు పరిధిలోకి వచ్చే భూముల్లో ప్రహరీ, నిర్మాణాలు ఉన్నట్లు తేలింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆదివారం ఉదయం 8 గంటలకు ఫాంహౌస్ వద్దకు హైడ్రా డీఎస్పీ శ్రీనివాస్ తన బృందం, ఎక్స్‌కవేటర్లతో వచ్చారు. భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేత ప్రారంభించారు. వాస్తవానికి రాంభూపాల్‌రెడ్డి వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా.. ప్రభుత్వ శాఖలు ఏనాడూ స్పందించలేదని చెరువు పక్కనే ఉండే హెచ్‌ఎంటీ కాలనీవాసులు తెలిపారు. అయితే రాంభూపాల్‌రెడ్డి చెరువును కబ్జా చేయలేదని ఆయన తరఫున రమేశ్‌గౌడ్ అనే వ్యక్తి విలేకరులకు తెలిపారు. గతంలో ఇరిగేషన్ అధికారులు హద్దులు చూపించిన తర్వాతే ప్రహరీని నిర్మించామని, వ్యవసాయ కూలీల కోసం, పనిముట్లను పెట్టుకునేందుకు నిర్మించిన రేకుల షెడ్లను సైతం కూల్చివేశారన్నారు. తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఆక్రమణలు నిర్ధారణ అయ్యాకే కూల్చివేశాం..
రాంభూపాల్‌రెడ్డి నిర్మించిన ప్రహరీ మొత్తం కొత్తచెరువు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిఽధిలోకే వస్తుందని అమీన్‌పూర్ తహసీల్దార్ రాధ, పటాన్‌చెరు ఇరిగేషన్ డీఈ రామస్వామి .తెలిపారు. సర్వే ద్వారా నిర్ధారణ అయిన తర్వాతే హైడ్రా ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టామన్నారు. ఇదిలా ఉండగా సర్వే నంబరు 323, 193, 194లో గతంలో చేసిన పద్మావతి లేఅవుట్‌లోని అనేక ప్లాట్లను కాటసాని రాంభూపాల్‌రెడ్డి మనుషులు కబ్జా చేశారంటూ ఆయా ప్లాట్ల యజమానులు ఆ స్థలం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో రాంభూపాల్‌రెడ్డి మనుషులకు ప్లాట్ల యజమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మేం ఎక్కడికి పోవాలె?
- కామేశ్వర్, వనిత దంపతులు,
ఇల్లు కోల్పోయిన బాధితులు
మాది ఒడిసా రాష్ట్రంలోని బాంజ్‌నగర్. పొట్ట కూటి కోసం ఇక్కడకు వచ్చాం. కూలి, నాలి చేసుకుంటూ గుడిసెలో ఉంటున్నాం. ఉన్నపళంగా కూల్చివేస్తే మా కుటుంబం ఏం కావాలి..? ఊరు కాని ఊరులో పిల్లలను పట్టుకొని వర్షాకాలంలో ఎక్కడికి వెళ్లాలి? ఎవరి వద్ద ఉండాలి?
తినడానికి తిండి కూడా లేదు?:
- శిరీష, భూత్‌పూర్ తండా, మహబూబ్‌నగర్
ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఈ రోజు మొత్తం నాశనం చేశారు. కుటుంబం రోడ్డున పడింది. మేం టిఫిన్ కూడా చేయకముందే కూల్చివేస్తామని వచ్చారు. తినడానికి తిండి కూడా లేదు. ఎంత వేడుకున్నా అధికారులు కరుణించలేదు. బడా బాబుల నిర్మాణాల జోలికి వెళ్లని యంత్రాంగం.. మాపై విరుచుకు పడడం న్యాయమా?
Updated Date - Sep 09 , 2024 | 04:45 AM