Illegal Activities: కబ్జాలమయం.. కలుషితం!
ABN, Publish Date - Sep 05 , 2024 | 03:06 AM
వానను, వరదను తమలో ఇముడ్చుకొని.. భూగర్భ జలాలను పెంచే చెరువులను కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు.
ఆక్రమణల బారిన చెరువులు
అసంపూర్తిగా మురుగునీటి మళ్లింపు పనులు
రక్షణ చర్యలు కరువు.. సీసీ కెమెరాలు లేవు
కాలుష్య కాసారంగా హస్మత్‌పేట్ జలాశయం
దుర్గంధభరితంగా కూకట్‌పల్లి అంబీర్ చెరువు
హైదరాబాద్‌లోని చెరువులపై అధ్యయనానికి కమిటీని నియమించిన హైకోర్టు
13 చెరువులను పరిశీలించి నివేదిక ఇచ్చిన కమిటీ
నగర చెరువులపై హైకోర్టుకు కమిటీ నివేదిక
13 చెరువులను పరిశీలించిన కమిటీ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వానను, వరదను తమలో ఇముడ్చుకొని.. భూగర్భ జలాలను పెంచే చెరువులను కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు. ప్రజలకు సాగు, తాగునీటికి దోహదపడే జలాశయాలను కాలుష్యానికి కేరా్‌ఫగా మారుస్తున్నారు. మురుగునీటి వ్యర్థాలు, రసాయనాలతో విషతుల్యం చేస్తున్నారు. జలాశయాలను పరిరక్షించేందుకు అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారిందని.. హైకోర్టు నియమించిన కమిటీ వెల్లడించింది.
చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి హైకోర్టుకు ఈ మేరకు నివేదికను సమర్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 16 చెరువులు ఆక్రమణకు గురవుతున్నా జీహెచ్‌ఎంసీ కమిషనర్, అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ 2007లో హైకోర్టులో మాదాపూర్‌కు చెందిన ‘గమన’ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి.దయాకర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయా జిల్లాల అధికారులు సంయుక్త నివేదిక అందించాలని 2013 జూన్ 10న ఒకసారి, 2023 డిసెంబరు 12న మరోసారి, 2023 డిసెంబరు 27న, ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 2న పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని చెరువులను పరిశీలించి వాస్తవాలతో నివేదికను సమర్పించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఓ కమిటీని నియమించింది.
న్యాయవాదులు గాది ప్రవీణ్‌కుమార్, టి.శ్రీకాంత్‌రెడ్డి సభ్యులుగా నియమితులైన ఈ కమిటీ.. జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటన్నది పరిశీలించింది. ఈ రెండు జిల్లాల్లోని 13 చెరువులను పరిశీలించి తమ నివేదికను ఈ ఏడాది మార్చి 5న హైకోర్టుకు సమర్పించింది. హైకోర్టు నియమించిన కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరి 12న జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులతో సమావేశమై ప్రాథమిక సమాచారం తెలుసుకుంది. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 13 చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లేచెరువులు ఆక్రమణకు గురయ్యాయని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ చెరువుల కాలుష్యం కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా.. ప్రజా ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని తెలిపింది. ఆక్రమణలు, కాలుష్యం కారణంగా చెరువులపై ఆధారపడిన పక్షులు, జంతుజాలం, జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
చెరువుల వారీగా నివేదికలోని కీలకాంశాలు హస్మత్‌పేట్ బోయిని చెరువు..
హస్మత్‌పేట్ బోయిని చెరువు అత్యంత కలుషితంగా ఉంది. ఇక్కడ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో పలు నిర్మాణాలు కనిపించాయి. మురుగునీటి మళ్లింపు ఏర్పాట్లు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో వ్యర్థాలతో నిండిపోయింది. ఇక్కడ కొద్దిసేపు కూడా నిలబడటం కష్టంగా ఉంది. చెరువు వద్ద ఫెన్సింగ్ రెండు వైపుల మాత్రమే వేశారు. లేక్ గార్డులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. చెరువులో వ్యర్థాలను అధికంగా పారబోస్తున్నారు. మురుగునీరు చెరువులో చేరుతుండడం వల్ల దుర్గంధం వెదజల్లుతోంది.
గంగారం పెద్ద చెరువు-చందానగర్
ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాట్లు ఏమీ లేవు. రింగ్ బండ్/వాకింగ్ ట్రాక్ కూడా అందుబాటులో లేదు. సీసీ టీవీలు, లేక్ గార్డ్ లేరు. మురుగునీటి మళ్లింపు ఏర్పాట్లు కూడా లేవు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో ఆక్రమణలు జరిగాయి. ఈ చెరువు మురుగు నీటి వ్యర్థాలతో పూర్తిగా కలుషితమయింది. వరదల సమయంలో మురుగునీటిని మొత్తం కాలనీల్లోకి వదిలేస్తున్నారు. పక్కనే ఉన్న నాలాల ద్వారా శుద్ధి చేయని జలాలను చెరువులోకి మళ్లించడంతో నీరు కలుషితమవుతోంది.
చిన్న దామెర చెరువు-దుండిగల్
ఈ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ ప్రాంతాల్లో గణనీయంగా ఆక్రమణలు జరిగాయి. పలు కాలేజీలూ, ఇన్‌స్టిట్యూట్‌లు కూడా చెరువు చుట్టూ ఉన్నాయి. వీరు వ్యర్థాలను చెరువులో వేసి దానిని పూడ్చివేసే పనులు కూడా చేస్తున్నారు. దీని కారణంగా చెరువులోని నీరు రైతుల పొలాల్లోకి వెళ్తోంది. రెసిడెన్షియల్ కాలేజీల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా చెరువులోకి వెళ్లే ఏర్పాట్లు చేయడం ద్వారా చెరువులోని చేపలు చనిపోతున్నాయి. మురుగునీటి మళ్లింపు ఏర్పాట్లు లేవు..
మద్దెలకుంట చెరువు- బైరామల్‌గూడ
ఈ చెరువులో అధిక భాగం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఆక్రమణకు గురైంది. మెయిన్ బండ్ వైపు మాత్రమే ఫెన్సింగ్ పనులు జరిగితే, మిగిలిన మూడు వైపులా, పక్క ఆస్తుల యజమానులు గోడలు కట్టుకున్నారు. రింగ్ బండ్, వాకింగ్ ట్రాక్ లేదు. సీసీ టీవీలు కూడా లేవు. ఇక్కడ ఒకే ఒక్క లేక్ గార్డ్ మాత్రమే కనిపించాడు. మురుగునీటి మళ్లింపు పనులు పూర్తయినా.. అది పనిచేస్తున్నట్లుగా మాత్రం కనిపించలేదు. ఈ చెరువు, చెత్తా చెదారంతో నిండి పోయింది. చెరువు దుర్గంధం వ్యాపింపజేస్తోంది.
నల్లగండ్ల చెరువు- నల్లగండ్ల
ఈ చెరువు వద్ద ఫెన్సింగ్ పనులు చేపట్టడంతో రక్షణ కనిపిస్తోంది. మురుగునీటి పారుదల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వాకింగ్ ట్రాక్ పనులు మాత్రం అసంపూర్తిగా ఉన్నాయి. సీసీ కెమెరాలు అందుబాటులో లేవు. చెరువును పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి.
పెద్ద చెరువు- ఫీర్జాదిగూడ
పెద్ద చెరువుకు న్యాయ పరమైన చిక్కుల కారణంగా ఫెన్సింగ్ పనులు కొంతమేరకే పూర్తయ్యాయి. రింగ్‌బండ్/వాకింగ్ ట్రాక్ పనులూ అసంపూర్తిగా ఉన్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. లేక్ గార్డులు కూడా అందుబాటులో లేరు. కోర్టులో కేసు నడుస్తున్న కారణంగా మురుగునీటి మళ్లింపు పనులు జరగడం లేదు.
అంబీర్ చెరువు-కూకట్‌పల్లి
ఇక్కడ మెయిన్ రోడ్ వైపు కూడా ఫెన్సింగ్ వర్క్ పూర్తి కాలేదు. రింగ్ బండ్ పూర్తయింది. కానీ, వాకింగ్ ట్రాక్ వేయలేదు. సీసీ టీవీ కెమెరాలు, లేక్ గార్డుల ఏర్పాట్లు కనిపించలేదు. మురుగునీటి మళ్లింపు పనులు పూర్తి కాలేదు. సరైన పెట్రోలింగ్, నిఘా లేకపోవడంతో ఈ చెరువు మరింతగా ఆక్రమణకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
చిన్నరాయుని చెరువు- అల్వాల్
ఈ చెరువులో వ్యర్థాలు అధికంగా పారబోస్తున్నారు. మురుగునీటి మళ్లింపు పనులు పూర్తయ్యాయి. అయితే దానిని ఇప్పటివరకు సరిగా నిర్వహించడం లేదు.
మాదాపూర్ దుర్గం చెరువు..
దుర్గం చెరువులో మురుగునీటి శుద్ధికి కేవలం 12 ఎంఎల్‌డీ సామర్థ్యంలో మాత్రమే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి అంతకంటే ఎక్కువగానే వ్యర్థ జలాలు ఈ చెరువులో చేరుతున్నాయి. దీంతో చెరువు కలుషితమయింది. ఈ చెరువులో 146 నిర్మాణాలు బఫర్‌జోన్‌లో ఉంటే, 78 నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. చెరువు పునరుద్ధరణతోపాటు ఇన్‌లెట్, ఔట్‌లెట్‌లు సరిగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి.
ఉప్పల్ నల్లచెరువు..
ఉప్పల్ నల్లచెరువును కొందరు నాశనం చేస్తున్నారు. ఈ చెరువులో ఫెన్సింగ్ కేవలం మెయిన్ బండ్ వైపు మాత్రమే ఉంది. మిగిలిన మూడు వైపులా పక్క ఆస్తుల యజమానులు గోడలు నిర్మించుకున్నారు. మురుగునీటి మళ్లింపు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఏమాత్రం కనిపించలేదు. ఈ చెరువు మొత్తం చెత్తాచెదారం, మురుగునీటితో నిండిపోయి దుర్గంధం వ్యాపింపజేస్తోంది. చెరువు మొత్తం తూడుతో నిండిపోయింది. కొంతమంది రైతులు, స్థానిక సాగుదారులు కాలుష్య జలాలతోనే కూరగాయల సాగు చేస్తున్నారు. ఈ అంశం ఆరోగ్యపరంగా తీవ్ర ప్రమాదాన్ని కలిగించే విధంగా ఉంది. చెరువును కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు సంభావ్య ఆరోగ్య ప్రమాదాల నివారణ కోసం కూడా తగిన చర్యలు చేపట్టాలి.
సున్నం చెరువు-అల్లాపూర్
ఈ చెరువుకు ఫెన్సింగ్ అసంపూర్ణంగా వేశారు. అలాగే రింగ్ బండ్/ వాకింగ్ ట్రాక్ పనులు కూడా అంతంతమాత్రంగా చేశారు. ఈ చెరువును అక్రమార్కుల చెర నుంచి పరిరక్షించేందుకు లేక్ గార్డులు, సీసీ టీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయలేదు. మురుగు నీరు బయటకు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Updated Date - Sep 05 , 2024 | 03:06 AM