Anganwadi Centers: అమ్మమాట.. అంగన్‌వాడీ బాట
ABN, Publish Date - Jul 15 , 2024 | 03:40 AM
అందీ అందని పౌష్టికాహారం.. చిన్నారులపై మొక్కుబడి పర్యవేక్షణ.. పారిశుధ్య లోపం..! ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల స్వరూపం ఇది. ఇకపై మాత్రం.. చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు.. బోధనలోనూ కొత్త పద్ధతులతో సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి.
చదువు.. ఆరోగ్యం.. క్రీడలు..
సామూహిక అక్షరాభ్యాసాలు
నేటి నుంచి 6 రోజుల పాటు
పలు కార్యక్రమాలుపేద పిల్లలకు ప్రైవేటు తరహా
ప్రీ స్కూల్ విద్య: మంత్రి సీతక్క
ఐదేళ్లు పూర్తయున విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేత
హైదరాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): అందీ అందని పౌష్టికాహారం.. చిన్నారులపై మొక్కుబడి పర్యవేక్షణ.. పారిశుధ్య లోపం..! ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల స్వరూపం ఇది. ఇకపై మాత్రం.. చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు.. బోధనలోనూ కొత్త పద్ధతులతో సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి. రెరడున్నరేళ్ల వయసు వారి నుంచి ఐదేళ్ల పిల్లల వరకు ఆకర్షితులయ్యేలా ప్రతి అంశంలోనూ మెరుగుపడనున్నాయి. ఓవైపు కేంద్రాలను కొత్త విధానంలోకి తీసుకురావడంతో పాటు, మరోవైపు బలోపేతం చేసేందుకు సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘అమ్మమాట-అంగన్‌వాడీ బాట’ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోజూవారీ నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీనిలోభాగంగా బోధించే విద్య, అందించే సేవల గురించి టీచర్లు.. పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తారు. కొత్తగా చేరబోయే పిల్లలకు 20న సామూహిక అక్షరాభ్యాసాలు చేయించనున్నారు. ఐదేళ్లు పూర్తయి అంగన్‌వాడీ నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులకు ‘ప్రి స్కూల్ సర్టిఫికెట్’ను ప్రదానం చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం ములుగు జిల్లా ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్‌పల్లిలో అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట ప్రారంభంలో పాల్గొంటారు.
ఇదీ షెడ్యూల్
సోమ, మంగళవారాల్లో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, స్వయం సహాయక బృందాలు, పాఠశాలల టీచర్లు, యువత, ఎన్జీవోలతో ర్యాలీ నిర్వహిస్తారు. రెండున్నరేళ్ల వయసున్న చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సంబంధిత సిబ్బంది కోరుతారు.
18న: అంగన్‌వాడీ సిబ్బంది గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి రెండున్నరేళ్ల వయసు దాటిన పిల్లలను గుర్తిస్తారు. తాము అందిస్తున్న బోధన, పాఠశాల విద్యకు సమాయత్తం చేయడం తదితర అంశాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.
19న: స్వచ్ఛ అంగన్‌వాడీ కింద కేంద్రాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు. ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటుతారు. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం, కిచెన్ గార్డెన్ సదుపాయాలను కల్పిస్తారు. జూలైలో బోధించబోయే, నిర్వహించే కార్యక్రమాలను వెల్లడిస్తారు.
20న: అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసాలు చేయిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, తాత, నాయనమ్మ, అమ్మమ్మలను ముఖ్య అతిథులుగా పిలిచి బోధనా విధానం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తారు. పిల్లలను రోజూ అంగన్‌వాడీకి పంపుతున్న తల్లిదండ్రులకు బహుమతులు అందించనున్నారు.
మంత్రి సూచించిన పేరుతోనే..
రాష్ట్రంలోని అంగన్‌వాడీలను బలోపేతం చేసేందుకు, పిల్లలను కేంద్రాల్లో చేర్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల మంత్రి సీతక్క, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ఏ పేరు పెట్టాలనేదానిపై అందరూ ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో ‘అమ్మమాట-అంగన్‌వాడీ బాట’ అంటూ మంత్రి సీతక్క పేరును సూచించినట్లు తెలిసింది.
ప్రీ స్కూల్ విద్య అందేలా
రెండున్నరేళ్లు దాటిన పిల్లలందరినీ అంగన్‌వాడీల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసమే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేదల పిల్లలకు కూడా ప్రైవేటు తరహాలోనే ప్రి స్కూల్ విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే చేపట్టాం.
- మంత్రి సీతక్క
Updated Date - Jul 15 , 2024 | 03:40 AM