ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Seed Subsidies: విత్తన రాయితీలకు మంగళం..

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:56 AM

గిరిజన రైతులకు ఇవ్వాల్సిన విత్తన సబ్సిడీలకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) మంగళం పాడేసింది. చివరిగా 2016లో రాయితీ విత్తనాలు అందుకున్న రైతులకు ఎనిమిదేళ్లుగా ఐటీడీఏల సాయం అందడం లేదు.

  • ఎనిమిదేళ్లుగా గిరిజన రైతులకు ఎగనామం

  • నిధుల కొరతే కారణమంటున్న ఐటీడీఏ

  • సాగు పనిముట్ల సబ్సిడీ కూడా బంద్‌

  • అటకెక్కిన ట్రైకార్‌ సంక్షేమ పథకాలు

  • ప్రభుత్వ సాయం లేక రైతులు సతమతం

భూపాలపల్లి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులకు ఇవ్వాల్సిన విత్తన సబ్సిడీలకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) మంగళం పాడేసింది. చివరిగా 2016లో రాయితీ విత్తనాలు అందుకున్న రైతులకు ఎనిమిదేళ్లుగా ఐటీడీఏల సాయం అందడం లేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, తిరిగి చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూర్‌ ఐటీడీఏల పరిధిలోని ములుగు, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, అసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం లాంటి 11 జిల్లాల్లో సుమారు 2.78 లక్షల మందికి పైగా గిరిజన రైతులు దాదాపు 5లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వీరికి 2016 వరకు ఎస్టీ సబ్‌ ప్లాన్‌ స్పెషల్‌ కాంపోనెంట్‌ కింద సబ్సిడీపై చిరుధాన్యాలు, మొక్కజొన్న, సోయా, పత్తి, కంది, నువ్వులు మినుములు తదితర విత్తనాలను అందించేవారు.


అయితే టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో కాగితాలపై బడ్జెట్‌ చూపించినా.. ఆచరణలో మాత్రం గిరిజన రైతాంగానికి మొండిచేయి చూపింది. 2016 నుంచి ప్రభుత్వం రాయితీ విత్తనాల సరఫరాను నిలిపివేసింది. గిరిజన సంఘాలు ఎనిమిదేళ్లుగా ప్రతీ సీజన్‌లో ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారుల వద్దకు వెళ్లి ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని సమాధానం వస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన పోడు పట్టాల సమస్య పరిష్కారమైనా ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాలపై వాణిజ్య బ్యాంకులు.. చివరకు సహకార బ్యాంకులు కూడా పంట రుణాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించక గిరిజన రైతులు సతమతమవుతున్నారు. విత్తనాలే కాకుండా వ్యవసాయ పనిముట్లు, యాంత్రిక పరికరాల సబ్సిడీ లాంటివి కూడా పూర్తిగా నిలిచిపోయాయని వాపోతున్నారు.


సమగ్ర భూ అభివృద్ధి పథకం కింద ఇవ్వాల్సిన కాంపోనెంట్లను కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ట్రైకార్‌ ద్వారా లభించాల్సిన సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా అటకెక్కించారని పేర్కొంటున్నారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు 5వ షెడ్యూల్‌ పరిధిలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనూ అన్ని సంక్షేమ పథకాలు యధాతథంగా కొనసాగుతున్నా తెలంగాణలో మాత్రమే నిలిపివేశారని అంటున్నారు. ఈసారి బడ్జెట్‌లోనైనా గిరిజన రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆశించినా మొత్తం గిరిజన సంక్షేమానికి రూ.17 కోట్ల ఎస్డీఎఫ్‌ నిధులను మాత్రమే కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ప్రకారం రూ.119 కోట్లు కేటాయించాల్సి ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వం మారిందే తప్ప గిరిజన రైతుల పట్ల సర్కారు తీరు మారడం లేదని ఆదివాసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.


  • లెక్కలన్నీ కాగితాలపైనే..

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశాయి. ప్రతి బడ్జెట్‌లో అంకెల గారడీ చేస్తూ కాగితాలపైనే పథకాలను అమలు చేస్తున్నాయి. గిరిజన రైతులకు రాయితీలపై విత్తనాలకు సంబంధించి ఏటా ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతున్నా ఫలితం లేదు. ఈ విషయమై మంత్రులను కలిసినా స్పందన లేదు. ముఖ్యంగా ఆదివాసీ తెగల సంక్షేమానికి సంబంధించిన ఏ ఒక్క పథకమూ ఆచరణలో లేదు. మొన్నటి బడ్జెట్‌పై కొండంత ఆశ పెట్టుకున్నా.. ఈ ప్రభుత్వం కూడా మొండి చేయి చూపింది.

- దాట్ల నాగేశ్వరరావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నేత

Updated Date - Aug 05 , 2024 | 04:56 AM

Advertising
Advertising
<