JNTU: జేఎన్‌టీయూలో ‘హై-ఫై’ ఫెసిలిటీ..
ABN, Publish Date - Dec 18 , 2024 | 08:20 AM
జేఎన్‌టీయూ(JNTU) విద్యార్థులకు కొత్త సంవత్సరంలో సరికొత్త సదుపాయాలు అందుబాట్లోకి రానున్నాయి. వర్సిటీలోని వివిధ విభాగాలతో పాటు అన్ని హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నిరంతరాయమైన ఇంటర్నెట్ (హై-ఫై)సదుపాయాన్ని కల్పించాలని ఇన్‌చార్జి వీసీ డాక్టర్ బాలకిష్టారెడ్డి(In-charge VC Dr. Balakishta Reddy) నిర్ణయించారు.
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) విద్యార్థులకు కొత్త సంవత్సరంలో సరికొత్త సదుపాయాలు అందుబాట్లోకి రానున్నాయి. వర్సిటీలోని వివిధ విభాగాలతో పాటు అన్ని హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నిరంతరాయమైన ఇంటర్నెట్ (హై-ఫై)సదుపాయాన్ని కల్పించాలని ఇన్‌చార్జి వీసీ డాక్టర్ బాలకిష్టారెడ్డి(In-charge VC Dr. Balakishta Reddy) నిర్ణయించారు. ఈ నెల 7న జేఎన్‌టీయూకు ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, గత పదిరోజులుగా వర్సిటీలోని అన్ని విభాగాలను, హాస్టళ్లకు నేరుగా వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: జైలులో కలిశారు.. ముఠాగా ఏర్పడ్డారు
ఈ క్రమంలో మంగళవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్, రెక్టార్, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశమయ్యారు. యూనివర్సిటీలో విద్యార్థులే కీలక భాగస్వాములని, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ బాలకిష్టారెడ్డి సూచించారు. విద్యార్థులకు అధునాతన ఇంటర్నెట్ సదుపాయంతో పాటు హాస్టళ్లలో వారు కోరిన విధంగా మెరుగైన వసతులను ఈ నెల 31వ తేదీలోగా కల్పించాలని ఆదేశించారు.
ఇన్‌చార్జి వీసీ ఆదేశాల మేరకు వర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సంబంధిత విభాగాలకు కేటాయిస్తూ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వరరావు(Registrar Dr. Venkateswara Rao) ఉత్తర్వులు జారీచేశారు. కొత్త సంవత్సరం కానుగా రూ.కోటి విలువైన అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం పట్ల విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎయిర్‌పోర్టు తరహాలో..
దేశంలోనే అతిపెద్ద సాంకేతిక విశ్వవిద్యాలయమైన జేఎన్‌టీయూలో విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరికరాలను చేరువ చేయడంలో ఇప్పటివరకు అధికారులు విఫలమయ్యారు. ఆరు నెలలుగా రెగ్యులర్ వీసీ లేకపోవడంతో వర్సిటీ అభివృద్ధి మరింత కుంటుపడింది. కొత్తగా ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బాలకిష్టారెడ్డి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సాంకేతికతను వినియోగించేలా నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇంతకు ముందు వివిధ విభాగాలు, హాస్టళ్లలో రూటర్ల ద్వారా వై-ఫై (వైర్‌లెస్ ఫెడిలిటీ) ఇంటర్నెట్ సదుపాయం కల్పించినప్పటికీ, తరచుగా అవి పాడవతుండడంతో అధికారులు పట్టించుకోవడం మానేశారు.
దీంతో విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావడానికి, ప్రాజెక్టులు చేసుకోవడానికి, ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూలు హాజరు కావడానికి సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవడంపై ఇన్‌చార్జి వీసీకి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వర్సిటీ ప్రాజెక్ట్ ఇంజనీర్ (నెట్‌వర్కింగ్ అండ్ సాఫ్ట్‌వేర్)ను ఆదేశించారు. దీంతో రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టులలో మాదిరిగా వేలాదిమంది కనెక్టయినా పాడవని హై-ఫై ఇంటర్నెట్ యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
హాస్టళ్లకు హంగులు
వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లను ఇటీవల సందర్శించిన ఇన్‌చార్జి వీసీ అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. కొన్ని గదులకు డోర్లు, కిటికీలకు అద్దాలు లేకపోవడం, సరిపడా బెడ్స్ లేక విద్యార్థుల నేలపై పడుకోవడం, ఎలక్ట్రికల్ బోర్డులు ఊడిపోయి తీగలు బయటకు వేలాడుతుండడం, తాగునీటి ఆర్‌వో ప్లాంట్లు పాడైపోవడం, వాష్‌రూమ్స్‌తో పాటు వంటగదులు అపరిశుభ్రంగా ఉండడంపై పట్ల వీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీజీ ఉమెన్స్ హాస్టల్, గౌతమి హాస్టల్, కిన్నెర, మంజీరా తదితర హాస్టళ్లలో విద్యార్థుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన.. ఆయా పనులను వారంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త సంవత్సరంలో హాస్టళ్లకు సరికొత్త హంగులు సమకూరనున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రిన్సిపాల్స్ వ్యయపరిమితి పెంపు
సుమారు 8 వేలమంది విద్యార్థులు ఉన్న క్యాంపస్ కళాశాలల్లో అత్యవసర పనుల నిమిత్తం గతంలో ప్రిన్సిపాల్స్‌కు ఉన్న వ్యయ పరిమితిని రూ.25వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ ఇన్‌చార్జి వీసీ బాలకిష్టారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మాజీ వీసీ హయాంలో ప్రిన్సిపాల్స్‌కు అధికారాల్లో కోత పెట్డడంతో తాము కళాశాల నిర్వహించే పరిస్థితి లేకుండా పోయిందని వర్సిటీ అనుబంధ కాలేజీల ప్రిన్సిపాల్స్.. ఇటీవల ఇన్‌చార్జి వీసీకి మొర పెట్టుకున్నారు. దీంతో కాలేజీ నిర్వహణ నిమిత్తం అవసరమైతే రూ.లక్ష దాకా వ్యయం చేసే అధికారం కల్పించడం పట్ల ప్రిన్సిపాల్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - Dec 18 , 2024 | 08:20 AM