Kaleshwaram Project: పనులు పూర్తికాకున్నాసర్టిఫికెట్లా?
ABN, Publish Date - Aug 22 , 2024 | 04:33 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీల నిర్మాణం పూర్తికాకముందే.. వినియోగానికి సరిపడేంత పని జరిగిందని నిర్ధారిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ ప్రశ్నించింది.
మార్గదర్శకాల్లో అలా ఇచ్చే క్లాజు ఏదైనా ఉందా?
బ్యారేజీల నిర్మాణం నాలుగేళ్లు జరిగితే.. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు ఒక్కసారే చేయడమేంటి?
చెల్లింపుల్లో మార్గదర్శకాలు ఏవీ?
డీపీఆర్ దాఖలు చేశాక మార్పులా?
హైపవర్ కమిటీని ఎప్పుడు నియమించారు?
మాజీ ఈఎన్‌సీని ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
‘కాళేశ్వరం’పై ప్రారంభమైన క్రాస్ ఎగ్జామినేషన్
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీల నిర్మాణం పూర్తికాకముందే.. వినియోగానికి సరిపడేంత పని జరిగిందని నిర్ధారిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. టెండర్ నిబంధనలకు సంబంధించిన క్లాజుల్లో దీని ప్రస్తావన ఉందా? అని, 2020 జూన్ 29న బ్యారేజీల నిర్మాణం పూర ్తయితే.. 2019 సెప్టెంబరులోనే సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని మాజీ ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్‌ను అడిగింది. కాళేశ్వరంపై విచారణలో భాగంగా కమిషన్ బుధవారం క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. తొలిరోజు మాజీ ఈఎన్‌సీని ప్రశ్నించిన కమిషన్.. బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఏయే రిజిస్టర్‌లను నిర్వహించాల్సి ఉంటుంది?
పనులు పూర్తికాకపోయినా వినియోగానికి సరిపడేంత పని జరిగిందని సర్టిఫికెట్లు ఇచ్చే మార్గదర్శకాలేమైనా ఉన్నాయా? అని ఆరా తీసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీ చేస్తే.. దానిపై సూపరింటెండెంట్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కౌంటర్ సంతకాలు చేస్తారా? అని, భారతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్) కోడ్‌ను అనుసరించే కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరిగిందా? అని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఒక్కో కాంపోనెంట్ అంచనాలను ఎవరు తయారు చేశారు? పరిపాలన అనుమతులకు శాఖాధిపతి (హెచ్‌వోడీ)యే కారణమా? అంటూ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. వీటికి ఈఎన్‌సీ మురళీధర్ సమాధానమిస్తూ.. పరిపాలన పరమైన అనుమతులను హెచ్‌వోడీయే ఇచ్చారని తెలిపారు. సంబంధిత ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లే కాంపోనెంట్ వారీగా అంచనాలను తయారు చేశారని, సబ్‌స్టాన్షియల్ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం గానీ, క్లాజు గానీ లేదని చెప్పారు.
ఐఎస్ కోడ్‌ను ఎందుకు పాటించలేదు?
బ్యారేజీల నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ అధికారుల, క్షేత్రస్థాయి ఇంజనీర్ల వైఫల్యం కనిపిస్తోందని, ఏ క్లాజునూ, ఐఎస్ కోడ్‌ను పాటించలేదని పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. 2016 నుంచి 2020 దాకా బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) నిర్మాణం జరిగితే.. వరంగల్ లోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఒక్కసారి మాత్రమే తనిఖీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయని గుర్తు చేసింది. రూ.వేల కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న పనులు జరుగుతుంటే ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడమేంటని నిలదీసింది. నిర్మాణ కాలంలో ఒక్కసారే తనిఖీలు చేసి.. నాణ్యతా ప్రమాణాలకు లోబడే పనులు జరిగాయంటూ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది. ఇందుకు మురళీధర్ బదులిస్తూ.. బ్యారేజీల వైఫల్యానికి గల కారణాల్లో క్వాలిటీ కంట్రోల్ వైఫల్యం కూడా ఒకటి అని, రెండు వారాలకోసారి తనిఖీలు జరగాల్సి ఉండగా.. అలా జరగలేదని అన్నారు. దీంతో.. క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయించకుండానే రూ.1342.72 కోట్లు ఎలా చెల్లించారు? అని కమిషన్ ప్రశ్నించింది. రిజిస్టర్‌లలో అడ్డదిడ్డంగా మార్పులు ఎందుకు చేశారని, బిల్లుల చెల్లింపుల్లోనూ మార్గదర్శకాలు ఎందుకు పాటించలేదని నిలదీసింది.
కాళేశ్వరంలో మీ పాత్ర ఏంటి?
‘‘కాళేశ్వరంలో మీ పాత్ర ఏంటి? ఈఎన్‌సీగా మీ విధులు, బాధ్యతలేంటి? హైపవర్ కమిటీ వేసిన తర్వాతే కాళేశ్వరంపై నిర్ణయం తీసుకున్నారా? హైపవర్ కమిటీని ఎప్పుడు వేశారు?’’ అని పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. అయితే ఈఎన్‌సీ(జనరల్)గా ప్రాజెక్టుల పర్యవేక్షణ తనదేనని, దీంతోపాటు క్షేత్రసాయి నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలించడం (వెట్టింగ్ చేయడం), వాటిని ప్రభుత్వానికి పంపించడం తన బాధ్యత అని మురళీధర్ వివరించారు.
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్ చేసి, కాళేశ్వరం చేపట్టారని, డీపీఆర్‌ను వ్యాప్కోస్ తయారు చేసిందని చెప్పా రు. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లోని పలు విభాగాలు 17 రకాల అనుమతుల అనంతరం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. కాగా, డీపీఆర్‌ను సీడబ్ల్యూసీలో దాఖలు చేశాక జరిగిన మార్పులకు కారణమేంటని, మార్పులను ఎవరు సూచించారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వ ఆదేశాలు, ఆమోదంతోనే మార్పులు జరిగాయని మురళీధర్ బదులిచ్చారు. దాదాపు రెండు గంటలపాటు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరిగింది.
షీట్‌ఫైల్స్ స్థానంలో సీకెంట్ ఫైల్స్ ఎందుకు వాడారు?
బ్యారేజీల డిజైన్, డ్రాయింగ్‌లో పొందుపరిచిన విధంగా నిర్మాణ సంస్థ షీట్‌ఫైల్స్‌ను వినియోగించాల్సి ఉండగా.. సీకెంట్ ఫైల్స్ వాడినట్లు తెలిసిందని పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇలా మధ్యలో మార్పులు చేయవచ్చా? అని ప్రశ్నించింది. దీంతో.. రాఫ్ట్ (పునాది)కు రక్షణగా షీట్ ఫైల్స్‌ను వాడతారని, పనులు జరుగుతున్నప్పుడు అనుకూలతను బట్టి సీకెంట్ ఫైల్స్ వాడినట్లు తెలుస్తోందని ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు. అంచనాలను ఏ విధంగా తయారు చేస్తారని కమిషన్ ప్రశ్నించగా.. పనుల ఆధారంగా అంచనాలు సిద్ధమవుతాయని చెప్పారు. ‘‘2019 నవంబరులో వరదల అనంతరం గేట్లు మూసినప్పుడు లోపాలు బయటపడ్డాయి.
ఆ సమయంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఏమైనా ఆదేశాలిచ్చారా? బ్యారేజీల డి జైన్లు సిద్ధం చేయడానికి ముందు న మూనా అధ్యయనాలు జరిగాయా? జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు చేశారా?’’ అని కమిషన్ ప్రశ్నించింది. అయితే ఏమేం లోపాలు జరిగాయో.. వాటిని సరిచేయాలని తాము ఆదేశాలు ఇచ్చామని మురళీధర్ బదులిచ్చారు. దాంతోపాటు నమూనా అధ్యయనాల అనంతరమే డి జైన్/డ్రాయింగ్‌లు సిద్ధమయ్యాయని చెప్పారు. ఇక డిజైన్‌కు తగ్గట్లుగా డ్రాయింగ్‌లు ఉంటాయని, తేడాలు లేవని తెలిపారు.
మాజీ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ నేడు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డ్రాయింగ్, డిజైన్లను తయారుచేసిన/ఆమోదించిన నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన మాజీ ఈఎన్సీ ఎ.నరేందర్ రెడ్డిని గురువారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. అఫిడవిట్లు దాఖలు చేసిన 57 మందిలో దాదాపు 25 మందిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కమిషన్ ఇదివరకు నిర్ణయించిన విషయం విదితమే.
ఆ పత్రాలు లాక్కున్న కమిషన్
క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుండగా.. కమిషన్ వేసిన కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి వీలుగా మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌కు నీటిపారుదల అధికారులు కొన్ని పత్రాలు అందించారు. అయితే.. హైపవర్ కమిటీ నియామకానికి సంబంధించిన ఈ పత్రాలను కమిషన్ లాక్కుంది. తమ అనుమతి లేకుండా పత్రాలివ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Updated Date - Aug 22 , 2024 | 04:33 AM