Kaleshwaram Project: నేతలకు త్వరలో సమన్లు!
ABN, Publish Date - Aug 18 , 2024 | 04:22 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది.
కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర
పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు..
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం
అధికారుల అఫిడవిట్లపై క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే ఇంజనీర్లు, మేధావులు, ఐఏఎ్‌సలతో పాటు మాజీ ఐఏఎ్‌సల నుంచి వాంగ్మూలాలు సేకరించడంతోపాటు వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్.. ఆ అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా కొందరికి సమన్లు జారీ చేయనుంది. ఇప్పటిదాకా 57మంది అఫిడవిట్లు దాఖలు చేయగా, ఆయా అంశాలపై వచ్చే వారం నుంచే క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తోంది.
ఇందుకోసం తెలంగాణ, ఏపీ, పశ్చిమబెంగాల్‌తో సంబంధం లేని న్యాయవాదిని నియమించుకోనుంది. ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరింది. క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాగానే ఆర్థిక అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది. కాగా, అఫిడవిట్ దాఖలుకు ఇచ్చిన గడువు ముగిసినా... కీలక మాజీ ఐఏఎస్ స్పందించకపోవడం కలకలం రేపుతోంది. ఆయన తీరుపై సీరియ్‌సగా ఉన్న కమిషన్.. త్వరలోనే చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కీలక మాజీ ప్రజాప్రతినిధి ఒకరు ఆనారోగ్యంతో ఉన్నారని సమాచారం అందించగా.. సమన్లు జారీ చేశాక కూడా రాకుంటే నేరుగా ఆయన నివసించే ప్రాంతానికే వెళ్లి వివరాలు సేకరించాలని కమిషన్ యోచిస్తోంది.
కాగా, కాళేశ్వరంపై విచారణకు తనను పిలవాలని స్వయంగా అభ్యర్థించుకున్న తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకా్‌షను శనివారం కమిషన్ విచారించింది. తుమ్మిడిహెట్టి కోణంలో కాకుండా, మూడు తరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకే చేపట్టారన్న కోణంలో కాళేశ్వరాన్ని చూడాలని ఆయన నివేదించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం సాధ్యం కాదని, ఈ బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో కడితే 5 టీఎంసీల దాకా నిల్వ చేసే అవకాశం ఉంటుందని, అదే మహారాష్ట్ర అనుమతించిన విధంగా 148 మీటర్ల ఎత్తుతో కడితే కేవలం 1.8 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరే శ్రీరామ్ కమిషన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వార్ధా-వెన్‌గంగా కలిసే చోట ‘వీ’ ఆకారంలో బ్యారేజీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రూ.7500 కోట్లు వెచ్చించినా తుమ్మిడిహెట్టితో ఆశించిన ప్రయోజనం రాదన్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలేంటి? అనే కోణంలో ఈనెల 26వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించగా.. సాక్ష్యాధారాలతో నివేదిక ఇస్తానని ప్రకాశ్ ప్రకటించారు.
Updated Date - Aug 18 , 2024 | 04:22 AM